ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

లాక్ డౌన్ సమయంలో రైతులు మరియు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వండి – కేంద్రం మరియు రాష్ట్రాలకు ఉపరాష్ట్రపతి సూచన

వ్యవసాయ ఉత్పత్తిదారులతో పాటు వినియోగ దారు ప్రయోజనాలను పరిరక్షిచండి - ఉపరాష్ట్రపతి

రైతుల నుంచి నేరుగా వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసేలా ఎ.పి.ఎం.సి. చట్టంలో మార్పులు తీసుకురావాలని సూచన

రాష్ట్ర, జిల్లాల సరిహద్దుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులను సజావుగా రవాణా చేయాలని ప్రభుత్వాలను కోరిన ఉపారాష్ట్రపతి

లాక్ డౌన్ సందర్భంగా ఎదురౌతున్న రైతు సమస్యలపై ఉపరాష్ట్రపతితో కేంద్ర వ్యవసాయ మంత్రి సమావేశం

రైతులకు సహాయం చేయడానికి తీసుకున్న చర్యలను ఉపరాష్ట్రపతికి వివరించినే కేంద్ర మంత్రి

Posted On: 15 APR 2020 5:53PM by PIB Hyderabad

లాక్ డౌన్ సమయంలో రైతులు మరియు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. వ్యవసాయ కార్యకలాపాలు సజావుగా నిర్వహించేందుకు మరియు వ్యవసాయ ఉత్పత్తులు రవాణాను సులభతరం చేసేందుకు చొరవ తీసుకోవాలని తెలిపారు.

ఈ రోజు ఉపరాష్ట్రపతి నివాసానికి విచ్చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతికి వివరించారు. కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, రైతులతో పాటు వినియోగదారుల ప్రయోజనాలను సైతం పరిరక్షించాలని తెలిపారు.

రైతులు వ్యవస్థీకృతమై ఉండరు గనుక, వారి ఆకాంక్షలను బయటకు చెప్పుకునే అవకాశం పెద్దగా లభించదని, ఈ పరిస్థితుల్లో రైతుల ప్రయోజనాలకు కాపాడడం ప్రభుత్వాల కర్తవ్యం అన్న ఉపరాష్ట్రపతి, ఇది ప్రధానంగా రాష్ట్రాల విధి అయినప్పటికీ కేంద్రం మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

పండ్లు, కూరగాయలు వంటి త్వరగా పాడయ్యే వ్యవసాయ ఉత్పత్తులపై అధికంగా దృష్టి కేంద్రీకరించాలని పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి, ఈ పాడైపోయే వస్తువుల నిల్వ మరియు మార్కెంటిగ్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేయడానికి వీలుగా ఎ.పి.ఎం.సి. చట్టాన్ని తగిన విధంగా సర్దుబాటు చేయాలని సూచించారు. తద్వారా ఎవరూ మండీలకు వెళ్ళవలసిన అవసరం ఉండదని, వినియోగ దారు నేరుగా వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే వెసులుబాటు ఉండేలా ఇది సహాయపడుతుందని తెలిపారు.

వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను సజావుగా సాగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఉపరాష్ట్రపతి, రవాణా సమయంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుత పంటకాలం గురించి ప్రధానంగా చెబుతూ, వ్యవసాయ యంత్రాలు, సామగ్రిని ఉచితంగా అందుబాటులో ఉంచడం మీద దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తీసుకోవలసిన చర్యలను వ్యవసాయ మంత్రి కూలంకషంగా వివరించారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పూర్తి సమన్వయంతో పని చేస్తున్నామని, ప్రస్తుత సంక్షోభ సమయంలో రైతులకు సాయం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వ తప్పక చేపడుతుందని హామీ ఇచ్చారు.


(Release ID: 1614791) Visitor Counter : 190