రైల్వే మంత్రిత్వ శాఖ

ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం 30వేల కవరాల్స్‌

ఏప్రిల్‌లో భారత రైల్వేశాఖ వ్యక్తిగత రక్షణ సామగ్రి తయారీ లక్ష్యం
మే నెలలో ఉద్యమ తరహాలో ఏకంగా లక్ష పీపీఈ తయారీకి ప్రణాళిక
ఇటువంటి ఉత్పత్తుల తయారీలో ఇతర భాగస్వాములకు ఆదర్శం
రైల్వే ఉత్పాదక సంస్థలు, జోనల్‌ వర్క్‌షాపులు, క్షేత్ర యూనిట్ల సన్నద్ధత

Posted On: 15 APR 2020 2:23PM by PIB Hyderabad

కోవిడ్‌-19 రోగులకు సేవలందిస్తున్న ఆరోగ్య సంరక్షణ నిపుణులు, కార్యకర్తల కోసం వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ) కవరాల్స్‌ తయారీని భారత రైల్వేశాఖ చేపట్టింది. ఈ మేరకు రైల్వే ఉత్పాదక సంస్థలు, వర్క్‌షాపులు, క్షేత్రస్థాయి యూనిట్లు ఇప్పటికే పని ప్రారంభించాయి. ఇందులో భాగంగా ఏప్రిల్‌ నెలాఖరులోగా 30 వేల కవరాల్స్‌ తయారుచేయాలని నిర్దేశించుకోగా- మే నెలలో లక్ష కవరాల్స్‌ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. వీటి నమూనాలను ఇప్పటికే గ్వాలియర్‌లోని డీఆర్‌డీవో లేబొరేటరీ పరీక్షించి అత్యున్నత ప్రమాణాలతో ఉన్నట్లు ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో కోవిడ్‌-19పై నిర్విరామంగా శ్రమిస్తున్న భారత రైల్వేశాఖ డాక్టర్లు, ఇతర వైద్య నిపుణులు, ఆరోగ్య కార్యకర్తలకు ఈ పీపీఈ కిట్లను సరఫరా చేయనుంది. వీటిని ఒకసారి మాత్రమే వాడే వీలుందిగనుక, భారీ సంఖ్యలో తయారుచేయడం అవసరం. దీంతో ప్రస్తుతం తమ శాఖ పరిధిలోని డాక్టర్లకు, ఇతర సిబ్బందికి అవసరమైన కవరాల్స్‌ తయారీని రైల్వే సంస్థలు ప్రారంభించాయి. అయితే, వీటి తయారీకి కావాల్సిన ముడిపదార్థాలకు అంతర్జాతీయంగా భారీ డిమాండ్‌తోపాటు కొరత కూడా అధికంగానే ఉంది. అయినప్పటికీ రైల్వేశాఖ వెనుకంజ వేయకుండా పీపీఈ కిట్ల సత్వర తయారీకి అన్ని వనరులనూ సమకూర్చుకుంది. కోవిడ్‌-19 రోగులకు చికిత్స కోసం స్వల్ప వ్యవధిలోనే దాదాపు 5,000 బోగీలను తాత్కాలిక క్వారంటైన్‌/ఏకాంత చికిత్స సదుపాయాలుగా మార్చేసిన రైల్వేశాఖకు నేడు పీపీఈ కిట్ల తయారీ కష్టమేమీ కాదనడంలో సందేహం లేదు.

*****


(Release ID: 1614681) Visitor Counter : 272