కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ల‌ దాఖలు గ‌డువు మ‌రింత పొడ‌గింపు

- 3.49 కోట్ల ఐపీల‌కు 12,11,174 యాజమాన్యాల‌కు లబ్ధి
- లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌యివేటు మందుల షాపుల నుంచి ఔష‌ధాల కొనుగోలుకు అనుమ‌తి

Posted On: 14 APR 2020 4:51PM by PIB Hyderabad

కోవిడ్-19 మ‌హ‌మ్మారితో పోరాటం నేప‌థ్యాన దేశం ప‌లు సవాళ్ల‌తో కూడిన‌ ప్ర‌తికూల‌ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ నేప‌థ్యంలో ప‌లు సంస్థ‌లు తాత్కాలికంగా మూత‌బ‌డ్డాయి. దీంతో ఆయా సంస్థ‌ల్లో ప‌ని చేస్తున్న కార్మికులు విధుల్లోకి వెళ్లి త‌మ‌త‌మ ప‌నుల‌ను నిర్వ‌ర్తించలేక పోతున్నారు. ఈ క‌ఠిన స‌మయంలో వ్యాపార సంస్థ‌లు, కార్మికులకు అండ‌గా ఉండేలా ప్రభుత్వం వివిధ సహాయక చర్యలను చేప‌డుతోంది. కోవిడ్‌-19తో పోరాడటానికి గాను వైద్య వనరులను బలోపేతం చేయ‌డంతో పాటు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్ఐసీ) తన వాటాదారులకు ప్రత్యేకంగా యజమానులు మరియు బీమా చేసిన కార్మికుల‌ కోసం ప‌లు సహాయక చర్యలను చేప‌డుతోంది.
చందాల ఫైలింగ్ గ‌డువు పొడగింపు..
మిన‌హాయింపు చ‌ర్య‌ల్లో భాగంగా ఈఎస్ఐ ఫిబ్ర‌వ‌రి, మార్చి మాసాల‌కు సంబంధించిన చందాల ఫైలింగ్ గ‌డువును వ‌రుసాగా ఏప్రిల్ 15, మే 15 వరకు పొడ‌గించారు. ఆయా సంస్థ‌ల యాజ‌మాన్యాలు ఎదుర్కొంటున్న క‌ఠిన స‌మ‌యాన్ని దృష్టిలో ఉంచుకొని తాజాగా ఫిబ్ర‌వ‌రి మాసపు ఈఎస్ఐ చందాల చెల్లింపున‌కు చెందిన ఫైలింగ్ల‌కు గ‌డువు కాలాన్ని ఏప్రిల్ 15 నుంచి మే 15కు పొడ‌గించారు. గ‌త మార్చి నెలకు చెందిన చందాల ఫైలింగ్ దాఖలు గ‌డువును కూడా 15, మే 2020గా నిర్ణ‌యించారు. పొడ‌గించిన కాలంలో సంస్థలపై ఎటువంటి జరిమానా, వడ్డీ, నష్ట ప‌రిహారంను వ‌సూలు చేయ‌రు. రిటర్న్ దాఖలు వ్యవధి పొడ‌గింపుతో దాదాపు 3.49 కోట్ల బీమా వ్యక్తులు(ఐపీలు) మరియు 12,11,174 మంది యజమాన్యాల వారికి ఉపశమనం క‌లుగ‌నుంది. వీటితో పాటు, బీమా చేసిన వ్యక్తులు, లబ్ధిదారులకు ప‌లు సహాయక‌ చర్యలను కూడా చేపట్టారు.
ప్ర‌యివేటు మెడిక‌ల్ షాపుల్లో ఔష‌ధాల కొనుగోలుకు అనుమ‌తి..
దేశంలో లాక్‌డౌన్ అమ‌లవుతున్న నేప‌థ్యంలో ఈఎస్ఐ ల‌బ్ధిదారులు ప్ర‌యివేటు మెడిక‌ల్ షాపుల నుంచి త‌మ‌కు కావాల్సిన అత్యవ‌స‌ర మందుల‌ను కొనుగోలు చేసుకొనే వెసులుబాటును ఈఎస్ఐ క‌ల్పించింది. ఇలా కొనుగోలు చేసిన మందుల‌కు సంబంధించిన సొమ్మును ఈఎస్ఐ త‌రువాత ల‌బ్ధిదారుల‌కు తిరిగి చెల్లించేలా ఈఎస్ఐసీ అనుమ‌తులు జారీ చేసింది. కరోనా కేసుల చికిత్స‌కు ప్రత్యేకంగా ఏదైనా ఈఎస్ఐసీ ఆసుపత్రిని ప్రత్యేకమైన కోవిడ్ -19 చికిత్స‌ ఆసుపత్రిగా ప్రకటించినట్లయితే ఆ ఆసుపత్రి ప‌రిధిలోని ల‌బ్ధిదారులు అనుబంధ ఆసుప్ర‌తుల‌కు వెళ్లి వైద్య సేవ‌లు పొందేలా కూడా ఈఎస్ఐసీ వెసులుబాటు క‌ల్పించింది. దీంతో ల‌బ్ధిదారులు ఈఎస్ఐ నిర్ధేశించి ద్వితీయ వైద్య సేవ‌లు / ఎస్ఎస్‌టీ సంప్రదింపులు/ ఆసుప‌త్రిలో చేర్చుకోవ‌డం/ రోగ నిర్ధార‌ణ త‌దిత‌ర సేవ‌ల‌ను టైఅప్ అసుప‌త్రుల నుంచి పొందేందుకు వీలు క‌లుగ‌నుంది. దీనికి తోడు అత్య‌వ‌స‌ర, అత్య‌వ‌స‌రం కాని కొన్ని చికిత్స‌లను ల‌బ్ధిదారుల‌కు ఉన్న ప‌రిమితి మేర‌కు ఆయా ఆసుపత్రుల్లో ఎలాంటి రిఫ‌ర‌ల్ లేఖ లేకుండానే పొందేలా కూడా త‌గిన వెసులుబాటు క‌ల్పించారు.
వార్షిక చందా మొత్తాన్ని జమ చేయలేకపోయినా ఊర‌ట‌..
కోవిడ్ లాక్‌డౌన్ ప్ర‌త్యేక ప‌రిస్థితుల కార‌ణంగా వార్షిక చందా మొత్తాన్ని జమ చేయలేకపోయిన లబ్ధిదారులకు జారీ చేయబడిన వైద్య ప్రయోజన కార్డులు జూన్ నెలాఖ‌రు వ‌ర‌కు చెల్లుబాట‌య్యేలా చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇలాంటి వారు ఈఎస్ఐ (సెంట్రల్ రూల్స్) లోని నిబంధ‌న 60 మరియు 61 ప్రకారం వీరు వైద్య ప్రయోజనం పొందటానికి అనుమతించింది. శాశ్వత దివ్యాంగుల‌, డిపెండెంట్ల ప్రయోజనానికి సంబంధించి చెల్లింపుల‌కు గాను రూ.41.00 కోట్ల‌ (సుమారుగా) సొమ్మును ఈఎస్ఐసీ మార్చి నెలలోనే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జ‌మ‌చేసింది. 

 



(Release ID: 1614519) Visitor Counter : 239