హోం మంత్రిత్వ శాఖ
లాక్ డౌన్ నేపథ్యంలో విడుదల చేస్తున్న మార్గదర్శకాలను సంపూర్ణంగా అమలు చేయాలని కోరిన కేంద్ర హోంశాఖ
Posted On:
12 APR 2020 10:22PM by PIB Hyderabad
దేశంలో కోవిడ్ -19 వైరస్ విస్తరించకుండా వుండడానికిగాను ఆయా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్ డౌన్ మార్గదర్శకాలను అమలు చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని నిత్యావసర వస్తువులు, సేవలకు ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా వుండడానికిగాను ఈ మార్గదర్శకాలకు సంబంధించి అనేక వివరణల్ని విడుదల చేసింది.
ఆయా రాష్ట్రాల్లోను, రాష్ట్రాల మధ్యన కార్గో వాహనాలు, ట్రక్కుల ప్రయాణానికి, గోదాములు, శీతలీకరణ గిడ్డంగుల నిర్వహణ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కొనసాగాలని కేంద్ర హోంశాఖ లాక్ డౌన్ మార్గదర్శకాల్లో తెలిపింది. వీటిని సంపూర్ణంగా అమలు చేయాలని కోరింది. అయితే దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ మార్గదర్శకాలు మరియు వాటికి సంబంధించిన వివరణలు సరిగా అమలుకావడం లేదనే విషయం కేంద్ర హోంశాఖ దృష్టికి వచ్చింది.
ముఖ్యంగా నిత్యావసర వస్తువులు, నిత్యావసరేతర వస్తువులకు సంబంధించిన ట్రక్కులను ఆపుతున్నారు. అలాగే తయారీ పరిశ్రమల్లో పని చేసే కార్మికులకు అధికారిక పాసులు లభించడం లేదు. పైన తెలిపిన రెండు కేటగిరీలకు సంబంధించి ఒక రాష్ట్రం ఇచ్చే పాసులను మరో రాష్ట్రం పరిగణలోకి తీసుకోవడం లేదని తెలిసింది. అలాగే గోదాములు, శీతల గిడ్డంగులకు సంబంధించిన పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కేంద్ర హోం శాఖ అనుమతులు ఇచ్చినప్పటికీ ఆయా ప్రాంతాల్లో అమలు కాకపోవడంవల్ల సిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడుతుంది. కాబట్టి వీటికి సంబంధించి మరింత స్పష్టత కోసం కేంద్ర హోంశాఖ మరోసారి ఈ క్రింది మార్గదర్శకాలను ఆయా అధికారులకు పంపుతోంది. వివిధ స్థాయిలో అధికారులు వీటిని అమలు చేయాల్సి వుంటుంది.
రాష్ట్రాల మధ్యనగానీ, రాష్ట్రాల్లోగానీ అన్ని ట్రక్కులు, వస్తు రవాణా వాహనాలను అనుమతినివ్వాలి. ఈ వాహనాల్లో నిత్యావసర వస్తువులకు సంబంధించినవి కావొచ్చు, కాకపోవచ్చు. వీటిలో లైసెన్సు కలిగిన డ్రైవర్తో పాటు అదనంగా మరో వ్యక్తి వుంటారు. వీరికి ప్రత్యేకంగా అనుమతి అవసరం లేదు.
చట్టబద్దమైన డాక్యుమెంట్లు, డ్రైవింగ్ లైసెన్స్ వుంటే చాలు ఈ వాహనాలు తిరగవచ్చు. ఆయా ప్రాంతాల్లో వస్తువులను ఎక్కించుకోవడానికిగాను లేదా వాటిని దించడానికిగాను ఖాళీగా వాహనాలు వెళ్లడం జరుగుతుంటుంది. అలాంటి వాహనాలను ఎక్కడా ఆపకూడదు.
ట్రక్కు డ్రైవర్లు, వారితోపాటు వుండే క్లీనర్లు తమ నివాస ప్రాంతాన్నించి తమ ట్రక్కులున్న ప్రాంతానికి వెలుతున్నప్పుడు వారిని ఆపకుండా ఆయా స్థానిక అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అన్ని అనుమతులున్న వాణిజ్య, వ్యాపార కార్యక్రమాల్లో పాల్గొనే కార్మికులను ఆయా ప్రాంతాల అధికారులు ఎక్కడా ఆపకుండా చూడాలి.
రైల్వే శాఖ, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, కస్టమ్స్ శాఖ...తమ సిబ్బందికి, కాంట్రాక్టు కార్మికులకు తామే పాసులు ఇచ్చుకోవచ్చని అనుమతి ఇవ్వడం జరిగింది.
అనుమతి పొందిన విభాగాల్లో తయారీ పనులకు సంబంధించి కార్మికులకు పాసులను ఇచ్చే విషయంలో ఆయా రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆయా కంపెనీలు, సంస్థలు ఇచ్చిన ఉత్తరాల మేరకు వెంటనే నిర్ణయాలు తీసుకొని ఆయా కార్మికులు పనులకు వెళ్లేలా చూడాలి. అలాగే ఈ పాసులు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే కాదు ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సరిహద్దుల్లోను చెల్లుబాటయ్యేలా చూడాలి. గోధుమ పిండి తయారీ, పప్పుల తయారీ, వంట నూనెల తయారీకి సంబంధించిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆయా ప్రాంతాల అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి.
గోదాములు, శీతలీకరణ గిడ్డంగులకు నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా వాటి దగ్గరనుంచి వచ్చే, వెళ్లే వాహనాలకు అనుమతి ఇవ్వాలి. అంతే కాదు ఆయా వాహనాల వస్తువులు నిత్యావసరమైనవైనా, కాకపోయినా అనుమతి ఇవ్వాలి. కంపెనీల గోదాముల నిర్వహణకు కూడా అనుమతి ఇవ్వాలి.
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, భారత ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం నియంత్రణ, క్వారంటైన్, నిఘా ఏర్పరిచిన హాట్ స్పాట్ ప్రాంతాలను తప్పించి మిగతా అన్ని ప్రాంతాల్లో ఈ నిబంధనల్ని అమలు చేయాలి.
అయితే ఇక్కడ పదే పదే చెబుతున్న విషయం ఏదంటే పైన తెలియజేసిన ఆయా వాహనాలుగానీ, వాటిలోని వ్యక్తులనుగానీ అనుమతించడానికిగాను శుభ్రత, సామాజిక దూరం నిబంధనల్ని తప్పకుండా పాటించాలి. కోవిడ్ -19 వైరస్ నియంత్రణకు ఇది చాలా ముఖ్యం. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఒక విజ్ఞప్తి చేస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పైన తెలియజేసిన నిబంధనలకు సంబంధించి తమ జిల్లా అధికారులకు, క్షేత్ర స్థాయి ఏజెన్సీలకు తగిన సమాచారం ఇవ్వాలి. తద్వారా క్షేత్రస్థాయిలో ఎలాంటి తడబాటు లేకుండా, కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చిన కార్యకలాపాలన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతాయి.
(Release ID: 1614200)
Visitor Counter : 178