రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

డ్రగ్స్ & ఫార్మా పరిశ్రమ ప్రతినిధులు మరియు వారి సంఘాలతో కేంద్ర ఫార్మా కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్.

మందులు మరియు పరికరాల తగినంత ఉత్పత్తి మరియు లభ్యతకు హామీ.

Posted On: 13 APR 2020 7:05PM by PIB Hyderabad

అత్యవసర మందులు ముఖ్యంగా హెచ్.సి.క్యూ. నిల్వలు దేశీయ అవసరాలతో పాటు ఎగుమతుల అవసరాన్ని కూడా తీర్చగలిగినంత మేర ఉండేవిధంగా భారతీయ ఫార్మా పరిశ్రమ ఉత్పత్తి చేస్తోంది.   దేశ వ్యాప్తంగా వీటి ఉత్పత్తి మరియు రవాణా కు ఎటువంటి ఆటంకం కలుగకుండా రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల యంత్రాంగాలతో కలిసి కేంద్ర మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది.  ఫార్మాస్యూటికల్ మరియు వైద్య పరికరాల పరిశ్రమ కార్యకలాపాలు మరియు సమస్యలపై ఫార్మాస్యూటికల్ మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్ పి.డి. వాఘేలా అధ్యక్షతన ఈ రోజు జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఈ పరిస్థితి స్పష్టమైంది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సంయుక్త కార్యదర్శి (పాలసీ) శ్రీ నవదీప్ రిన్వా తో పాటు ఐ.పి.ఐ., ఐ.డి.ఎం.ఏ., ఓ.పి.పి.ఐ., బి.డి.ఎం.ఏ., ఏ.ఐ.ఎం.ఈ.డి., ఎమ్.టి.ఏ.ఐ., ఫార్మ్ ఎక్సిల్, సి.ఐ.ఐ., ఎఫ్.ఐ.సి.సి.ఐ., మరియు అఖిల భారత కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ వంటి వివిధ ఔషధాలు, వైద్య పరికరాల తయారీదారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు

బడ్డీ (హిమాచల్ ప్రదేశ్); జిరాక్ పూర్ (పంజాబ్); డామన్ & సిల్వస్సా; మరియు ఈశాన్య ప్రాంతంలో పరిశ్రమ ఎదుర్కొంటున్న విలక్షణమైన సమస్యల గురించి పరిశ్రమ వర్గాలు  వివరించాయి.  పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కశ్మీర్లడాఖ్ లలోని అన్ని ప్రాంతాలకూ ఔషధాల సరఫరాకు జిరాక్ పూర్ ప్రధాన పంపిణీ కేంద్రంగా ఉంది  అదేవిధంగా ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల తయారీకి బడ్డీ, డామన్ మరియు సిల్వస్సా ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి.  ఈశాన్య ప్రాంతంలో ఔషధాల సరఫరాలో ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ విభాగాలు సమన్వయంతో కృషి చేస్తాయని హామీ ఇచ్చారు.  పరిశ్రమ వర్గాలతోనూ, రాష్ట్రాలు, ఇతర మంత్రిత్వ శాఖలతో ఫార్మాస్యూటికల్ మంత్రిత్వశాఖ  నిరంతరం ఈ-మెయిల్ , వాట్సాప్ గ్రూపులు, డి.ఓ.పి. లోనూ, ఎన్.పి.పి.ఏ. లోనూ  ఏర్పాటు చేసిన కంట్రోల్ రూములు,   వీడియో కాన్ఫరెన్సులు ద్వారా పరిశ్రమ వర్గాలను సంప్రదిస్తూ ఉంటుందని కార్యదర్శి ఈ సందర్భంగా తెలిపారు.  వారి సమస్యలు తెలుసుకుని, వాటిని వేగంగా పరిష్కరించడానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఆయన చెప్పారు

ప్రస్తుత క్లిష్ట సమయంలో ఫార్మా రంగానికి ప్రయోజనకరంగా ఉండే విధంగా కేంద్ర హోంమంత్రి 2020 ఏప్రిల్ 4వ తేదీన జారీ చేసిన అడ్వైజరీ పట్ల పరిశ్రమ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.   అయితే, మధుమేహం, కాన్సర్, ఇతర అధిక విలువైన మందులతో సహా ఔషధాల డెలివరీ లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న కొరియర్ సర్వీసును అత్యవసర సేవగా ప్రకటించవలసిందిగా వారు కోరారు. దీనితో పాటు మరికొన్ని సూచనలు కూడా వారు చేశారు.  ఫార్మాస్యూటికల్ పరిశ్రమ సజావుగా సాగడానికి అవసరమైన అనుబంధ సేవలు, ఉత్పత్తులను కూడా అనుమతించవలసిన అవసరం ఉందని కూడా వారు సూచించారుజె.ఎన్.పి.టి. నౌకాశ్రయం మరియు ముంబయి విమానాశ్రయం రద్దీ సమస్యను కూడా వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు.  దేశంలోని అన్ని ప్రాంతాలకు నిరంతరాయంగా మందులు, వైద్య పరికరాలు సరఫరా అయ్యేవిధంగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని డాక్టర్ వాఘేలా కోరారు.  ప్రిస్క్రిప్షన్ తప్పనిసరిగా ఉండవలసిన మందులను ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించవద్దని, ఏ.ఐ.ఓ.సి.డి. కెమిస్ట్ లకు విజ్ఞప్తి చేసింది.  దేశంలోని పంపిణీ దారులు, కెమిస్టులు తమ పూర్తి సహకారాన్ని అందిస్తారని ఏ.ఐ.ఓ.సి.డి  హామీ ఇచ్చింది.   లాక్ డౌన్ సమయంలో ఔషధాల సరఫరా సజావుగా సాగడానికి అద్భుతంగా కృషి చేస్తున్నందుకు కార్యదర్శి అన్ని సంఘాల వారికి కృతజ్ఞతలు తెలియజేసారు.  వారి వాస్తవమైన ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.  

 *****



(Release ID: 1614198) Visitor Counter : 184