శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్-19కు నవ్య రక్త జీవద్రవ్య చికిత్స దిశగా అన్వేషణ
Posted On:
11 APR 2020 12:26PM by PIB Hyderabad
వ్యాధిగ్రస్తుడిపై కోలుకున్న వ్యక్తిలోని ప్రతిరక్షకాల ప్రయోగం
కోవిడ్-19 రోగులకు వినూత్న చికిత్సనందించే దిశగా సాహసోపేత ముందడుగు వేసేందుకు శాస్త్ర-సాంకేతిక శాఖ పరిధిలోని జాతీయ ప్రాధాన్య సంస్థ ‘శ్రీ చిత్ర తిరునాళ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ’ (SCTIMST)కి అనుమతి లభించింది. సాంకేతికంగా దీన్ని “కోలుకున్న వ్యక్తి రక్త జీవద్రవ్యంతో చికిత్స”గా వ్యవహరిస్తారు. ఇటువంటి ప్రయోగాలకు అనుమతులిచ్చే అత్యున్నత ప్రాధికార సంస్థ ‘భారత వైద్య పరిశోధన మండలి’ (ICMR) ఈ నవ్య ప్రయోగాత్మక ప్రక్రియకు ఆమోదముద్ర వేసింది.
కోలుకున్న వ్యక్తి రక్త జీవద్రవ్యంతో చికిత్స అంటే ఏమిటి?: కరోనా వైరస్ వంటి రోగ కారకం శరీరంలో ప్రవేశించినపుడు దాన్ని నిర్మూలించేందుకు రోగనిరోధక వ్యవస్థ ప్రతిరక్షక కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి ఆ శత్రువును గుర్తించి తుదముట్టిస్తాయి. ఆ విధంగా వ్యాధినుంచి రోగి పూర్తిగా కోలుకుంటారు. ఆ వ్యక్తినుంచి రక్తాన్ని సేకరించి, సదరు రోగనిరోధక కణాలను సంవృద్ధి చేసి, మరో రోగికి ఎక్కిస్తారు. వాటి తోడ్పాటుతో రోగిలోని నిరోధక శక్తి పుంజుకుని వైరస్‌ను నిర్మూలిస్తుంది.
ప్రతిరక్షకాలంటే ఏమిటి?: ఏదైనా సూక్ష్మజీవి మన శరీరంపై దాడిచేసినప్పుడు ముందువరుసలో ఉండి పోరాడే ఒకరకం కణాలే ‘ప్రతిరక్షకాలు.’ మన రోగనిరోధక కణాలు స్రవించే నిర్దిష్ట రకం ప్రొటీన్‌తో కూడిన ఈ రక్షకాలను ‘బి’ లింఫోసైట్స్ అంటారు. ఆ మేరకు మన నిరోధక వ్యవస్థ రోగ కారకాలను గుర్తించి, అందుకు తగిన ప్రతిరక్షకాలను రూపొందిస్తుంది. ఆ విధంగా ప్రతి రోగకారకం నిర్మూలనకు ఒక ప్రత్యేక ప్రతిరక్షకం తయారవుతూంటుంది.
ప్రతిరక్షకాలతో చికిత్స ఎలా చేస్తారు?: కోవిడ్-19 నుంచి కోలుకున్న వ్యక్తికి తొలుత అన్నిరకాల పరీక్షలూ నిర్వహించి సంతృప్తి చెందిన తర్వాత వారినుంచి రక్తం సేకరించి, జీవద్రవ్యాన్ని వేరుచేస్తారు. అందులో వైరస్‌ను నిర్మూలించే ప్రతిరక్షకాలు ఉన్నదీ-లేనిదీ నిర్ధారించుకున్న తర్వాత ఆ జీవద్రవ్యాన్ని కోవిడ్-19 బారినపడిన రోగికి ఎక్కిస్తారు.
ఈ ప్రయోగాత్మక చికిత్స పొందే వారెవరు?: ఈ ప్రయోగాత్మక ప్రక్రియతో ముందుగా కొద్దిమంది రోగులకు మాత్రమే చికిత్స చేస్తామని SCTIMST డైరెక్టర్ డాక్టర్ ఆశాకిషోర్ తెలిపారు. ఆ మేరకు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నవారిని ఎంపిక చేస్తామని, వారినుంచి ఇందుకు సంపూర్ణ సమ్మతి తీసుకున్న తర్వాతే వినూత్న చికిత్స ప్రారంభిస్తామని చెప్పారు.
ఇది టీకాలకు ఏ విధంగా భిన్నం?: టీకా వేసినప్పుడు మన రోగనిరోధక శక్తి రూపొందించే ప్రతిరక్షకాలు మనకు జీవితాంతం ఆ రకం రోగకారకం నుంచి రక్షణనిస్తాయి. కానీ, ప్రస్తుత చికిత్సలో రోగి రక్తంలోకి ఎక్కించిన జీవద్రవ్యంలోని ప్రతిరక్షకాలు చురుగ్గా ఉన్నంతవరకూ మాత్రమే చికిత్స లభిస్తుంది. దాదాపు 130 ఏళ్లకిందట జర్మనీ వైద్యుడు ఈమిల్ వాన్ బియరింగ్ జీవద్రవ్యం తరహా చికిత్స ఫలితమిచ్చే అవకాశం ఉందని నిరూపించారు. అయితే, అప్పట్లో ప్రతిరక్షకాల గురించి పరిజ్ఞానం అందుబాటులో లేదు. కాగా, ఈ ఆవిష్కరణకుగాను వైద్యశాస్త్రంలో తొలి నోబెల్ పురస్కారం 1901లో ఆయనకు లభించింది.
*****
(Release ID: 1613251)
Visitor Counter : 268