ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 పై తీసుకున్న చర్యలపై రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ కు అధ్యక్షత వహించిన డాక్టర్ హర్ష వర్ధన్

కోవిడ్ -19కు వ్యతిరేకంగా దృఢసంకల్పంతో పోరాటానికి భారత ప్రజలను ఏకం చేయడానికి ఆరోగ్య సేతు మొబైల్ యాప్ ను ప్రోత్సహించాలని రాష్ట్రాలను కోరిన మంత్రి

పరిస్థితిని నియంత్రణలో ఉంచడానికి అంకితభావంతో పనిచేస్తున్నందుకు నేను మీ అందరినీ అభినందిస్తున్నాను

Posted On: 10 APR 2020 7:18PM by PIB Hyderabad

“మీమీ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో కోవిడ్ -19పై మనం జరుపుతున్న పోరాటంలో పటిష్టమైన పర్యవేక్షణ ద్వారా  పరిస్థితిని నియంత్రణలో ఉంచుతున్నందుకు నేను మీ అందరినీ అభినందిస్తున్నాను” అని వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.  కోవిడ్-19 వ్యాప్తిని నిరోధించడానికి తీసుకుంటున్న చర్యలు, సంసిద్ధతపై శుక్రవారం మంత్రి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ మంత్రులు, చీఫ్ సెక్రెటరీలు/ ఆరోగ్య శాఖ కార్యదర్శులు పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే కూడా సమావేశంలో పాల్గొన్నారు.  

వీడియో కాన్ఫరెన్సులో మహారాష్ట్ర, డిల్లీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, కేరళ,  ఆంద్ర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, బీహార్, తెలంగాణ, హర్యానా, ఒడిషా, అస్సాం, చండీగఢ్, ఝార్ఖండ్, అండమాన్ మరియు నికోబార్, ఛత్తీస్గఢ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్, తమిళనాడు, మేఘాలయ మరియు దాద్రా & నాగర్ హవేలీ నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. 

“మన దేశంలో కోవిడ్ -19 మహమ్మారిని కట్టడి చేయడానికి మూడు నెలలుగా పోరాటం జరుగుతోందని” మంత్రి అన్నారు.  కేంద్ర, రాష్ట్రాలు సమన్వయంతో నిర్వహిస్తున్న ఈ పోరాటాన్ని ఉన్నత స్థాయిలో ప్రధాన మంత్రి నేతృత్వంలో పర్యవేక్షించడం, వ్యాప్తిని అడ్డుకోవడానికి సమర్ధవంతమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందని డాక్టర్ హర్షవర్ధన్ ప్రకటించారు. కాలాతీతం లేకుండా సమయానికి తగిన చర్యలు తీసుకోవడం వల్ల మనం పరిస్థితిని అదుపు చేయగలిగామని,  ఎలాంటి పరిథి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. 

వ్యాధి వ్యాప్తి శృంఖలను తెంచడంలో రానున్న కొన్ని వారాలు చాలా కీలకమని అయన అన్నారు. ఇందుకోసం సామాజిక దూరం పాటించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత గురించి అందరికీ అవగాహన కలుగజేయాలని హర్షవర్ధన్ విజ్ఞప్తి చేశారు. అది మనం దృఢసంకల్పంతో మహమ్మారిని ఎదుర్కోవడానికి తోడ్పడగలదని అన్నారు. 

గర్భిణీలు, డయాలసిస్ రోగులు, తలసేమియా వ్యాధితో బాధపడే వారి చికిత్స / వైద్య అవసరాల పట్ల శ్రద్ధ చూపాలని కూడా ఆయన కోరారు. రక్తం అవసరాలను సర్వదా తీర్చేందుకు స్వచ్ఛందంగా రక్త దానం చేయడాన్ని ప్రోత్సహించాలని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు ఉద్బోధ చేశారు.  

కోవిడ్ -19 రోగుల చికిత్స కోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రుల స్థితిగతులను కూడా డాక్టర్ హర్షవర్ధన్ సమీక్షించారు.  ప్రతి జిల్లాలో కోవిడ్ -19 ప్రత్యెక ఆసుపత్రుల ఏర్పాటు ఆవశ్యకత ఉందని ఆయన అన్నారు. 

కోవిడ్ -19 రోగుల చికిత్స అవసరమైన సాధనాలు ఆవశ్యకతను, ప్రతి రాష్ట్రంలో  వ్యక్తిగత సంరక్షణ సాధనాలు, ఎన్ 95 మాస్కులు, పరీక్షా కిట్లు, ఔషధాలు మరియు వెంటిలేటర్ల  లభ్యత తీరును గురించి కూడా మంత్రి సమీక్షించారు. ఈ క్లిష్ట సమయంలో చికిత్సా సాధనాల సరఫరాలలో ఎలాంటి కొరత లేకుండా భారత ప్రభుత్వం చూడగలదని ఆయన హామీ ఇచ్చారు.  ఇందుకు అవసరమైన ఆర్డర్లు కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు. రాష్ట్రాలు తమ సహచరులు ఆచరిస్తున్న మంచి పద్దతులను చూసి అనుకరించాలని ఆయన అన్నారు. 

ఆరోగ్యసేతు యాప్ డౌన్ లోడ్ చేసుకొని ఉపయోగించాలని కూడా మంత్రి  అందరినీ కోరారు. దానివల్ల కరోనా వైరస్ సోకే విపత్తును ముందే అంచనా వేయగలదని కూడా ఆయన వెల్లడించారు.  దానిని స్మార్ట్ ఫోన్ లో ఇన్స్ టాల్ చేసుకోవడం వల్ల వ్యాధి సోకే ప్రమాదాన్ని ముందుగానే అంచనా వేయవచ్చని ఆయన తెలిపారు.  

ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సెక్రెటరీ ప్రీతి సుడాన్, ప్రత్యేక కార్యదర్శి శ్రీ సంజీవ కుమార్, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు,  భారత వైద్య పరిశోధనా మండలి (ఐ సి ఎం ఆర్) ప్రతినిధులు కూడా సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. 

 **** 


(Release ID: 1613127) Visitor Counter : 240