సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

కోవిడ్-19 చికిత్సలో ఉపయోగించే వైద్య పరికరాలు తయారుచేసే ఎంఎస్ఎంఇలకు ప్రాధాన్యతా ప్రతిపత్తి ఇవ్వాలి - శ్రీ నితిన్ గడ్కరి

Posted On: 09 APR 2020 9:07PM by PIB Hyderabad

కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ (ఎంఎస్ఎంఇ) మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ తమ శాఖ సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహించి కోవిడ్-19 మహమ్మారిపై పోరాటానికి ప్రభుత్వం యంత్రాంగం సమాయత్తతను సమీక్షించారు. ఎంఎస్ఎంఇ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ చంద్ర సారంగి, కార్యదర్శి డాక్టర్ అరుణ్ కుమార్ పాండా, కెవిఐసి చైర్మన్ శ్రీ వి.కె.సక్సేనా, ఎస్ఎస్ డిసి శ్రీ రామ్ మోహన్ మిశ్రా, దేశంలోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న ఫీల్డ్ అధికారులతో సహా ఎంఎస్ఎంఇకి చెందిన ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ మహమ్మారి కారణంగా ఎంఎస్ఎంఇ రంగం తీవ్రంగా దెబ్బ తిన్న నేపథ్యంలో తీసుకున్న పలు చర్యల గురించి రెండున్నర గంటల పాటు జరిగిన ఈ చర్చలో మంత్రి సమీక్షించారు. అలాగే ఆ రంగాన్ని ఆదుకునేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్ బిఐ ఇటీవల తీసుకున్న చర్యలతో పాటుగా ఆ రంగంపై కోవిడ్ ప్రభావం అతి తక్కువగా ఉండేలా చేసేందుకు ఎంఎస్ఎంఇ శాఖ తీసుకున్న చర్యలను కూడా చర్చించారు.

ప్రస్తుత పరిస్థితిలో ఒక పక్క కోవిడ్, మరో పక్క దాని వల్ల దెబ్బ తిన్న ఆర్థిక రంగం రెండింటి పైన దేశం పోరాటం చేయాల్సి ఉన్నదని మంత్రి అన్నారు. తమ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు, క్షేత్ర స్థాయి విభాగాలు ఇప్పటివరకు తీసుకున్న చర్యలను ఆయన ప్రశంసిస్తూ శానిటైజేషన్, సామాజిక దూరం, వ్యక్తిగత సంరక్షణ వంటి విధానాలకు తప్పనిసరిగా కట్టుబడాలని ఆయన సూచించారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా గత నెల రోజులుగా వెంటిలేటర్లు, పిపిఇ కిట్లు, మాస్క్ లు, శానిటైజర్లు వంటి వైద్య పరికరాలకు ఆకస్మికంగా  డిమాండు పెరిగిందని, వాటి తయారీ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా సరఫరా లోటును పూడ్చడంలో ఎంఎస్ఎంఇలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు. ఇలాంటి వస్తువుల తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఇలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన చెప్పారు. తమ శాఖ నిర్వహణలోని పలు పథకాలకు కేటాయించిన నిధుల్లో 2019-20 సంవత్సరంలో అధిక శాతం నిధులు వినియోగంలోకి వచ్చాయని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. మంత్రిత్వ శాఖకు చెందిన ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు (కెవిఐసి), జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ (ఎన్ఎస్ఐసి), కాయిర్ బోర్డు, వివిధ టెక్నాలజీ సెంటర్లు, డెవలప్ మెంట్ సంస్థలు తీసుకున్న చర్యలను కూడా ఆయన ఈ సమావేశంలో సమీక్షించారు.

లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ మంత్రిత్వ శాఖకు చెందిన పలు సంస్థలు దేశంలోని భిన్న ప్రాంతాల్లో అన్నార్తులకు ఆహారం ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నాయని తమ దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. అలాగే చేతి వృత్తి కళాకారులందరికీ ఆర్టిసన్ సంక్షేమ నిధి (ఎడబ్ల్యుఎఫ్) నుంచి నెలకి రూ.1000 విడుదల చేయాలని కెవిఐసి నిర్ణయించిందని ఆయన చెప్పారు. అలాగే చేతి వృత్తి కళాకారులందరికీ ఎడబ్ల్యుఎఫ్ సహాయాన్ని మూడు వాయిదాల్లో వారి ఖాతాల్లో జమ చేయాలని ఖాదీ సంస్థలను ఆదేశించినట్టు శ్రీ గడ్కరి తెలిపారు. కాయిర్ బోర్డు పిఎం కేర్స్ సహాయ నిధికి రూ.8 కోట్లు అందించినట్టు తనకు తెలిపిందని ఆయన అన్నారు. అలాగే 2020 మార్చి 1వ తేదీకి ముందు బిజిలకు బదులుగా ఆర్ఎంఏ సదుపాయం ఉపయోగించుకున్న ఎంఎస్ఎంఇల్లో అర్హులైన వాటికి బకాయిల చెల్లింపునకు మూడు నెలల విరామం, మార్చి 1 నుంచి జూన్ 30 తేదీ మధ్యలో గడువు ముగిసిపోతున్న ఎస్ పిఆర్ఎస్ వద్ద నమోదైన సర్టిఫికేట్లన్నింటికీ చెల్లుబాటు గడువు పొడిగించడం వంటి రాయితీలు ఇచ్చినట్టు, ఎంఎస్ఎంఇ మార్ట్ వార్షిక సభ్యత్వ రుసుముపై 50 శాతం రాయితీ ఆఫర్ ను పొడిగించడం వంటి పలు చర్యలు తీసుకున్నట్టు కూడా ఆయన వెల్లడించారు. అలాగే ఎన్ఎస్ఐసి తన వద్ద అందుబాటులో ఉన్న సిఎస్ఐఆర్ నిధుల నుంచి  రూ.100 లక్షలు, ఆ సంస్థ సిబ్బంది అందరూ ఒక రోజు వేతనం సహాయంగా అందించడం ద్వారా వసూలైన రూ.15 కోట్లు పిఎం కేర్స్ సహాయనిధికి  అందించినట్టు ఆయన తెలిపారు.

దేశంలోని ఎంఎస్ఎంఇ టెక్నాలజీ కేంద్రాలు (టిసిలు) కూడా శానిటైజర్లు, మాస్క్ లు, గౌన్లు, ముఖ రక్షణ పరికరాలు, ఆస్పత్రి ఫర్నిచర్ తయారుచేస్తున్నట్టు తెలియచేశాయని మంత్రి చెప్పారు. అలాగే ఇంటి ద్వారా కూడా ఇలాంటి వస్తువుల ఉత్పత్తిని పెంచడం ద్వారా ఈ అత్యవసర వస్తువుల తయారీలో ఎంఎస్ఎంఇలకు సహాయపడడానికి టిసిలు హామీ ఇచ్చాయని ఆయన అన్నారు. ఈ వస్తువులన్నీ భారీ పరిమాణంలో అవసరం ఉన్నందువల్ల ఈ ప్రయత్నాలు సమయానుకూలమైనవని ఆయన నొక్కి చెప్పారు. అంతే కాదు వెంటిలేటర్లు, కరోనా టెస్టింగ్ కిట్లు వంటివి తయారుచేసే విషయంలో నిపుణులు, నైపుణ్యం గల సంస్థల సహాయం పొంది వైద్య ప్రమాణాలకు అనుగుణంగా టిసిలు వాటిని భారీ పరిమాణలో ఉత్పత్తి చేయాలని శ్రీ గడ్కరి సూచించారు. టిసిలు తమ ఉత్పత్తి ప్రదేశాలను కార్మికుల షెల్టర్లు, పోలీసు హాస్టళ్లు, ఐసొలేషన్ సెంటర్ల కోసం ఇవ్వడాన్ని ఆయన ప్రశంసించారు. శాశ్వత సిబ్బంది అతి తక్కువగా ఉన్నప్పటికీ టిసిలు ఒకరోజు వేతనంగా వసూలైన రూ.22 లక్షలు పిఎం కేర్స్ నిధికి అందించడాన్ని కూడా ఆయన ప్రశంసించారు.

ఎంఎస్ఎంఇ శాఖ నిర్వహణలోని వివిధ స్కీమ్ లపై థర్డ్ పార్టీ మదింపు నిర్వహించి వాటికి అవసరమైన సవరణలు చేయడం, పరిధి పెంచడం ద్వారా ఎంఎస్ఎంఇలకు మరింతగా సహాయపడాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే ఎంఎస్ఎంఇలకు సమన్వయపూరిత సహాయం అందించేందుకు ఆ విభాగంతో సంబంధం ఉన్న అందరితోనూ సంప్రదించాలని ఆయన అధికారులను కోరారు.



(Release ID: 1612790) Visitor Counter : 198