వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పరిశ్రమ, వాణిజ్య సంఘాల వారితో మంత్రి పియూష్ గోయల్ భేటీ
సమస్యల పరిష్కారానికి కేంద్ర సర్కారు కృషి చేస్తోందని భరోసా.
Posted On:
09 APR 2020 6:02PM by PIB Hyderabad
దేశంలో కోవిడ్-19 వ్యాప్తి ఆ తరువాత అమలులోకి వచ్చిన లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకొనేందుకు గాను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ దేశంలోని వివిధ పరిశ్రమ మరియు వాణిజ్య సంఘాల ప్రతినిధులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్(వీసీ) నిర్వహించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ(సీఐఎం), భారతీయ రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ తో పాటు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రభుత్వం దృష్టికి వివిధ సమస్యలు..
సీఐఐ, ఫిక్కీ, అసోచామ్, ఐసీసీ, లఘు ఉద్యోగ్ భారతీ, ఎఫ్ఐఎస్ఎంఈ, నాస్కామ్, పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ర్టీ, సియామ్, ఏసీఎంఏ, ఐఎంటీఎంఏ, ఐఈఈఎంఏ, సీఏఐటీ, ఫేమ్‌లకు చెందిన ఆఫీస్ బేరర్లు ఈ వీసీలో పాల్గొన్నారు. లాక్‌డౌన్ సమయం నుంచి ఇటీవల కొన్ని రోజుల ముందు వరకు క్షేత్రస్థాయిలో జరిగిన పరిణమాలు, పురోగతి గురించి పరిశ్రమల సంఘాల వారు మంత్రికి తెలియజేశారు. ఇదే సమయంలో నగదు లభ్యత కొరత, వివిధ సంస్థల నుంచి ఆర్డర్ల రద్దు, మార్కెట్లో కార్మికుల కొరత, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు కొన్ని రాష్ట్రాలు, జిల్లాల అధికారుల విభిన్న వివరణలు, లాక్‌డౌన్ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో ట్రక్కులు చిక్కుకుపోవడం, విడిభాగాలు లభించడంలో ఇబ్బందులు వంటి పలు సమస్యలను వారు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. అదే సమయంలో, గత పక్షం రోజులలో పరిస్థితి గణనీయంగా మెరుగుదల కనిపిస్తోందని వారు తెలియజేశారు. మరోవైపు ఐటీ పరిశ్రమల వారు 95% వరకు తమ కార్యకలాపాలను స్థిరీకరించుకోగలగినట్టుగా ఆ పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
ఇదే సమయంలో కార్పరేట్ సామాజిక బాధ్యతలో (సీఎస్ఆర్) భాగంగా చేపడుతున్న వివిధ కార్యక్రమాలను కూడా వారు వివరించారు. ఉత్తమ సీఎస్ఆర్ పద్ధతులు మరియు కమ్యూనిటీ కిచెన్ల గురించి కూడా పరిశ్రమల వర్గాల వారు తెలియజేశారు.
ప్రజల ప్రాణాలు కాపాడటానికే అగ్ర ప్రాధాన్యం..
ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ కోవిడ్-19 నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ మరియు ప్రజల జీవనోపాధిపై తీవ్ర ఒత్తిడి నెలకొన్నప్పటికీ ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రథమ ప్రాధాన్యతగా ముందుకు సాగుతున్నట్టుగా తెలిపారు. లాక్‌డౌన్ ఎత్తివేతపై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇంతకాలం లాక్‌డౌన్ వల్ల కలిగిన లాభాలకు ఇకపై తీసుకోనున్న చర్యలతో విఘాతం కలుగుకుండా తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. కొన్ని రాష్ర్టాల వారు లాక్‌డౌన్ పొడగింపు దిశగా సన్నాహకాలు చేస్తుండడం గురించి మంత్రి ప్రస్తావిస్తూ పలు సూచనలు చేశారు. తమ ఉద్యోగులు, ఇతర వాటాదారుల ఆరోగ్య భద్రత విషయంలో రాజీ లేకుండా, వారి ఉత్పాదకత, సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడేలా సంస్థలు తమ ప్రోటోకాల్స్ మరియు విధానాల్ని రూపొందించుకోవాలని మంత్రి గోయల్ సూచించారు. అసాధారణ పరిస్థితులు నేపథ్యంలో ఆయా సమస్యలకు హేతుబద్ధమైన విధానాల్ని రూపొందించుకొని ముందుకు సాగాలని మంత్రి గోయల్ కోరారు. భవిష్యత్తు విషయమై అంచనాలతో కూడిన కోరికల జాబితాతో ముందుకు సాగడం కంటే కూడా ఆచరణాత్మకంగా మాట్లాడుకోవడం ప్రారంభిస్తేనే చాలా మేలని అన్నారు. లాజిస్టిక్స్, ఎగుమతి-దిగుమతి సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి తమ మంత్రిత్వ శాఖ ఇప్పటికే కృషి చేస్తోందని ఆయన వివరించారు. పరిశ్రమ, వ్యాపార వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివిధ మంత్రిత్వ శాఖల దృష్టికి కూడా తీసుకెళ్తున్నట్టుగా కూడా గోయల్ తెలిపారు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పడితే ఇటీవల వలసపోయిన కార్మికులు తిరిగి విధుల్లోకి చేరుకొనే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ప్యాకేజీ విషయం ఆర్ధిక శాఖ దృష్టికి..
అనూహ్య పరిస్థితుల నేపథ్యంలో పరిశ్రమలకు ఉపశమన ప్యాకేజీని ముందస్తుగా ప్రకటించాలని కొంతమంది చేసిన అభ్యర్థనపై మంత్రి గోయల్ స్పందించారు. ఇందుకు గాను ఈ సమావేశంలోని అభిప్రాయాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపుతున్నట్టు తెలిపారు. అనంతరం వివిధ అసోసియేషన్ సభ్యులు చేపట్టిన మానవతా కార్యకలాపాలను మంత్రి గోయల్ ప్రశంసించారు. కోవిడ్-19తో సమర్థవంతమైన పోరుకు సాంకేతిక సాధనంగా అభివర్ణించబడుతోన్న ఆరోగ్య సేథు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొనేలా సంస్థలోని సభ్యులను మరియు ఇతరులను ప్రోత్సహించాలని మంత్రి పరిశ్రమలు, వాణిజ్య సంఘాల వారికి మంత్రి పిలుపునిచ్చారు.
(Release ID: 1612726)
Visitor Counter : 248