కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

కంపెనీలు త‌మ అసాధార‌ణ స‌మావేశాల‌ను వీసీ, ఓఏవీఎమ్‌ల ద్వారా నిర్వహించుకొనేలా ఎంసీఏ అనుమ‌తి

- రిజిస్టర్డ్ ఈ-మెయిల్స్ ద్వారా సరళీకృత ఓటింగ్‌నకు అనుమ‌తి

Posted On: 08 APR 2020 7:58PM by PIB Hyderabad

కోవిడ్‌-19 కార‌ణంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్ష‌లు అమ‌లులో ఉన్న నేప‌థ్యంలో కంపెనీల‌కు ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌పై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంసీఏ) దృష్టి సారించింది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి వ‌ల్ల క‌లుగుతున్న ప‌లు విపరీతమైన అంతరాయాలను అధిగమించేందుకు గాను ప‌లు చ‌ర్య‌లు తీసుకొనేలా త‌మ‌కు త‌గిన వెసులుబాటు క‌ల్పించాల‌ని పరిశ్రమల సంఘాలు, కార్పొరేట్ల నుండి ఎంసీఏకు ప‌లు ర‌కాల అభ్య‌ర్థ‌న‌లు అందాయి. ప‌రిస్థితిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న ఎంసీఏ జూన్ 30 వరకు కార్పోరేట్ సంస్థ‌లు డైరెక్టర్ల బోర్డుకు చెందిన అన్ని సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్(వీసీ) లేదా ఇతర ఆడియో విజువల్ మార్గాలలో (ఓఏవీఎమ్‌) నిర్వ‌హించేలా ఇప్ప‌టికే అనుమతినిచ్చింది. ప్ర‌స్తుతమున్న‌ లాక్‌డౌన్ ప‌రిస్థితుల నేప‌థ్యంలో కార్ప‌రేట్ కాంప్లియ‌న్స్‌ను సుల‌భత‌రం చేసేందుకు గాను బుధ‌వారం ఎంసీఏ ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. దీని ప్ర‌కారం వీసీ లేదా ఓఏవీఎమ్ ద్వారా కంపెనీలు అసాధార‌ణ స‌మావేశాల‌ను నిర్వ‌హించేందుకు అనుమ‌తులు జారీ చేయ‌డ‌మైంది. దీనికి తోడు రిజిస్టర్డ్ ఈ-మెయిళ్ళ ద్వారా ఈ-వోటింగ్ సౌక‌ర్యాన్ని, సరళీకృత ఓటింగ్ సౌక‌ర్యాన్ని పొందేందుకు కూడా ఎంసీఏ అనుమ‌తినిచ్చింది. కంపెనీల చట్టం - 2013 ప్ర‌కారం సాధారణ మరియు ప్రత్యేక కంపెనీల తీర్మానాలను భౌతిక సాధారణ సమావేశం నిర్వహించాల్సిన అవ‌స‌రం లేకుండానే పోస్టల్ బ్యాలెట్/ఈ-ఓటింగ్ మార్గం ద్వారా ఆమోదించడానికి అనుమతినిస్తుంది. అయితే కోవిడ్ లాక్‌డౌన్ కార‌ణంగా సామాజిక దూరం వంటి ఆంక్ష‌లు నెల‌కొన్న పరిస్థితులలో కంపెనీలు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని ఉపయోగించుకోలేని ప‌రిస్థితిలో ఉన్నందున ఎంసీఏ కొత్త త‌ర‌హా చ‌ర్య‌ల‌ను ప్రారంభించింది. కంపెనీలు తమ ఈజీఎంలు నిర్వహించడానికి వీలుగా రిజిస్టర్డ్ ఈ-మెయిళ్ళ ద్వారా వీసీ మరియు ఈ-ఓటింగ్/ సరళీకృత ఓటింగ్ కలయికను ఉపయోగించడం ద్వారా ఈ ఫ్రేమ్‌వర్క్ డిజిటల్ ఇండియా యొక్క బలాన్ని పెంచ‌నుంది. చ‌ట్టం ప‌రిధికి లోబ‌డే కంపెనీలు వీసీ, ఓఏవీఎమ్‌ మార్గంలో వార్షిక, ఇత‌ర స‌మావేశాలు నిర్వ‌హించేలా అనుమ‌తించిన‌ప్ప‌టికీ.. ఇదే సంద‌ర్భంలో కంపెనీలు ప‌లు చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాల‌ని కంపెనీ తెలిపింది. కంపెనీలు ఈ స‌మావేశాల మొత్తం కార్యకలాపాల స‌మ‌గ్ర రికార్డుల‌ను నిర్వ‌హించాల‌ని, వాటిని సుర‌క్షితంగా అదుపులో ఉంచుకోవాల‌ని, మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త కోసం వాటిని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాల‌ని కూడా ఎంసీఏ తెలిపింది. ఈ కొత్త ఫ్రేమ్‌వ‌ర్క్ కింద తీసుకున్న అన్ని తీర్మానాల‌ను కంపెనీలు 60 రోజుల వ్య‌వ‌ధిలో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీలో (ఆర్‌వోసీ) దాఖ‌లు చేయాల్సి ఉంటుంది. దీంతో ఆయా రిజ‌ల్యూష‌న్స్ గురించి ప్ర‌జ‌లు తెలుసుకొనేందుకు వీలుంటుంది ఎంసీఏ తెలిపింది. కంపెనీల స‌మావేశాల‌లో తీసుకున్న నిర్ణ‌యాల విష‌య‌మై మ‌రింత జావాబుదారీత‌నం పెంచేందుకు రక్షణను నిర్ధారించడానికి సర్క్యులర్‌లో ఇతర భద్రతలు కూడా చేర్చబడ్డాయి.


(Release ID: 1612402) Visitor Counter : 293