ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

లాక్‌డౌన్ తదనంతరం ఆర్థిక వ్యవస్థతోపాటు ప్రజారోగ్యంపై దృష్టి పెట్టడమూ కీలకమేనన్నఉపరాష్ట్రపతి

- లాక్‌డౌన్ తొలగింపు నిర్ణయంలో మూడోవారం అత్యంత కీలకం

- స్వల్ప ఇబ్బందులున్నా.. సమస్య సమూల పరిష్కారానికి ప్రజలు సహకారాన్ని కొనసాగించాలి

- యావత్ ప్రపంచ సంక్షేమం కోసం భారతీయుల ప్రతిస్పందన, ఈ మాతృభూమి ఆధ్యాత్మిక దృష్టిని తెలియజేస్తుంది

- కరోనా నుంచి యావత్ ప్రపంచం గుణపాఠాలు నేర్చుకోవాలని సూచన

Posted On: 07 APR 2020 12:04PM by PIB Hyderabad

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి బారి నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు  మార్చి 25న కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు రెండు వారాలు పూర్తయిన నేపథ్యంలో.. ఈ మూడోవారమే అత్యంత కీలకమని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తదుపరి లాక్‌డౌన్‌కు సంబంధించిన నిర్ణయంలో ఈ మూడోవారంలో కరోనా వైరస్ వ్యాప్తి, వైరస్ విస్తృతి వేగం సంబంధించిన వివరాలే కీలకపాత్ర పోషిస్తాయని తాను భావిస్తున్నానన్నారు. 

ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితినుంచి బయటకు వచ్చేందుకు ప్రధాన మంత్రి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు ప్రారంభించడంపై ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి రేటు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని వీరంతా కలిసి సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానన్నారు. లాక్‌డౌన్ తదనంతర పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతోపాటు ప్రజారోగ్యంపైనా ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

కరోనాను ఎదుర్కునేందుకు దేశ ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి సహకారం అందిస్తున్నారని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి.. ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్‌డౌన్ కొనసాగింపు అవసరమైతే ఇదే స్ఫూర్తిని కనబర్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు సంపూర్ణ సహకారం అందించాలన్నారు.

ప్రజలకు నిత్యావసర వస్తువుల పంపిణీ, పేదలకు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అవసరమైన సహాయక చర్యలు సజావుగా జరిగేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

విపత్కర పరిస్థితుల్లో కరోనాను ఎదుర్కునేందుకు ప్రజలందరూ సంయుక్తంగా పోరాడుతూ దృఢసంకల్పాన్ని ప్రదర్శించారని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. వ్యక్తిగత ఆసక్తులకు ప్రాధాన్యత ఇవ్వకుండా.. ప్రజలందరకీ మేలు జరగాలని భావించారని, విశ్వమానవాళి శ్రేయస్సును కాంక్షించారని ఇదే భారతీయ సంప్రదాయానికి మూలమని ఆయన అన్నారు. 

మార్చి 22న జనతా కర్ఫ్యూ సందర్భంగా చప్పట్లతో.. అనంతరం మార్చి 25 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు దీపాలను వెలిగించి.. కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న వారికి స్వచ్ఛందంగా సంఘీభావం తెలపడం అభినందనీయమన్నారు. కరోనా వైరస్ వంటి కనిపించని శత్రువుపై చేస్తున్న పోరాటంలో విజయం సాధించేందుకు ఇలాంటి సందర్భాలు కొత్త ఉత్సాహాన్నిస్తాయన్నారు.

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ద్వారా కరోనా వైరస్ నియంత్రణ తీసుకుంటున్న చర్యలు సవ్యంగా ముందుకెళ్తున్నాయని భావిస్తున్న తరుణంలో ఢిల్లీలో జరిగిన ‘తబ్లిగీ జమాత్ సదస్సు’ తదనంతర పరిణామాలు దురదృష్టకరమని ఉపరాష్ట్రపతి అన్నారు. సామాజిక, వ్యక్తిగత దూరాన్ని పాటించాలనే నిబంధనను ఉల్లంఘించడం వల్ల తలెత్తిన పరిణామాలతో కరోనా వ్యాప్తిపై నెలకొన్న అంచనాలు మారాయన్నారు. జాగ్రత్తలను, సూచనలను ఉల్లంఘించడం వల్ల తలెత్తిన పరిణామాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని జాగ్రత్తగా మసలుకోవాలని సూచించారు. 

పలు అభివృద్ధి చెందిన దేశాలు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టలేకపోతున్న నేపథ్యంలో యావత్ ప్రపంచం ఈ విపత్కర పరిస్థితులనుంచి గుణపాఠం నేర్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. వివిధ సంస్థల సామర్థ్యం, మౌలిక వసతులు, సమాచార మార్పిడి, అంతర్గ సహకారం, వ్యక్తిగతంగా తీసుకునే చర్యలు మొదలైన అంశాల్లోని లోపాలను చక్కదిద్దుకుంటేనే భవిష్యత్తులో వచ్చే ఇటువంటి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనగలమని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. 

కరోనాపై చేస్తున్న పోరాటం ఎప్పుడు ముగుస్తుందనే దానిపై అనిశ్చితి నెలకొన్నప్పటికీ.. చివర్లో మనమంతా విజయం సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశం ప్రస్తుతం చూపిస్తున్న స్ఫూర్తిని తుదివరకు కొనసాగించాలని.. రేపటి చక్కటి భవిష్యత్తుకోసం, ప్రస్తుతం పడుతున్న ఇబ్బందులను మరికొన్నిరోజులు ఓపికగా భరించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.



(Release ID: 1611938) Visitor Counter : 209