ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19పై తాజా సమాచారం

విదేశాల నుంచి వ్యక్తిగత రక్షణ సామగ్రి సరఫరా ప్రారంభం

Posted On: 06 APR 2020 6:08PM by PIB Hyderabad

కోవిడ్‌-19పై ముందువరుసన నిలిచి పోరాడుతున్న వారికోసం విదేశీ వ్యక్తిగత రక్షణ సామగ్రి (PPE) సరఫరా నేటినుంచి ప్రారంభమైంది. ఈ మేరకు భారత్‌కు విరాళం కింద చైనా పంపిన 1.7 లక్షల ‘కవరాల్స్‌’ (సంపూర్ణ శరీర రక్షకం) అందాయని ప్రభుత్వం నిర్ధారించింది. వీటితోపాటు దేశీయ సరఫరాల కింద అందుబాటులోగల 20,000 కలిపి మొత్తం 1.9 లక్షల కవరాల్స్‌ను ఆస్పత్రులకు పంపిణీ చేయనుంది. కాగా, దేశంలో ఇప్పటికే 3,87,473 వ్యక్తిగత రక్షణ సామగ్రి ఉందని, ఇప్పటిదాకా ఆరోగ్య సంరక్షణ విధుల్లో ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం 2.94 లక్షల కవరాల్స్‌ సరఫరా చేసింది. అలాగే దేశీయంగా ఉత్పత్తి చేసిన 2 లక్షల N95 మాస్కులను ప్రభుత్వం వివిధ ఆస్పత్రులకు అందజేసింది. దీంతో ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసిన N95 మాస్కుల సంఖ్య 20 లక్షలకు చేరింది. ఇక దేశంలో ఈ మాస్కులు ఇంకా 16 లక్షలదాకా అందుబాటులో ఉండగా, తాజాగా మరో 2 లక్షలు అందనున్నాయి.

   ఈ వ్యక్తిగత రక్షక సామగ్రి తాజా సరఫరాల్లో అధికశాతాన్ని సాపేక్షంగా కేసుల సంఖ్య అధికంగా ఉన్న తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాలకు అందజేసింది. అలాగే ఎయిమ్స్‌ (AIIMS), సఫ్దర్‌జంగ్‌, RML, RIMS, NEIGRIHMS, BHU, AMU తదితర కేంద్రీయ ఆస్పత్రులు/సంస్థలకు ప్రభుత్వం సరఫరా చేసింది. కోవిడ్‌-19పై యుద్ధం కోసం వ్యక్తిగత రక్షణ సామగ్రి కొనుగోలుకు కృషిచేస్తున్న నేపథ్యంలో విదేశీ సరఫరాలు ప్రారంభం కావడాన్ని ఒక మైలురాయిగా పరిగణించవచ్చు. ప్రస్తుతం (N95 మాస్కులు సహా) 80 లక్షల పూర్తిస్థాయి వ్యక్తిగత రక్షణ సామగ్రి కోసం సింగపూర్‌లోని సంస్థకు ప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చింది. ఇందులో 2 లక్షలదాకా 2020 ఏప్రిల్‌ 11న అందనుండగా, వచ్చేవారం మరో 8 లక్షలు దేశానికి చేరుతాయని సమాచారం. అలాగే (N95 మాస్కులు సహా) మరో 60 లక్షల కిట్ల కోసం చైనాలోని సంస్థకు ఆర్డర్‌ ఇవ్వడంపై సంప్రదింపులు తుది దశలో ఉన్నాయి. ఇవేకాకుండా N95 మాస్కులతోపాటు రక్షణ కళ్లద్దాల కోసం కొన్ని విదేశీ కంపెనీలకు ఆర్డర్‌ ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.

   ఇక దేశీయ సంస్థల సామర్థ్యానికి ఊపునిస్తూ- ఉత్తర రైల్వే విభాగం పీపీఈ ‘కవరాల్‌’ను రూపొందించింది. ఇంతకుముందు రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (DRDO) తయారుచేసిన పీపీఈ కవరాల్స్‌, N99 మాస్కులకు ఉత్తర రైల్వే కృషి అదనం. ఈ మేరకు భారీస్థాయిలో సామగ్రి ఉత్పత్తికి ప్రయత్నాలు ప్రారంభమవుతున్నాయి. మరోవైపు ప్రస్తుత N95 మాస్కుల తయారీ కంపెనీలు కూడా తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజుకు 80,000 స్థాయికి పెంచాయి. కాగా, మొత్తం 112.76 లక్షల N95 మాస్కులుసహా 157.32 లక్షల పీపీఈ కవరాల్స్‌ కోసం ఆర్డర్లు ఇవ్వబడ్డాయి. వీటిలో 80 లక్షల పీపీఈ కిట్లలో N95 మాస్కులు కూడా భాగంగా ఉంటాయి. మొత్తంమీద వారానికి 10 లక్షల పీపీఈ కిట్ల సరఫరా లక్ష్యం కాగా, ప్రస్తుతం దేశంలోని రోగుల సంఖ్యతో పోలిస్తే తగినంత వ్యక్తిగత రక్షణ సామగ్రి అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో తాజా సరఫరాలు ఈ వారాంతంలోగా ప్రారంభం కావచ్చునని అంచనా!

*****


(Release ID: 1611774) Visitor Counter : 274