ప్రధాన మంత్రి కార్యాలయం

కేంద్ర మంత్రులతో ప్రధానమంత్రి చర్చ

కోవిడ్‌-19పై పోరులో ప్రేరణ, పట్టుదల, అప్రమత్తత అవసరమన్న ప్రధాని;
రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలతో నిత్య సంబంధాలు.. అత్యవసర సమస్యలకు పరిష్కారాలు.. జిల్లాస్థాయి సూక్ష్మ ప్రణాళికల రూపకల్పన చేయండి;
గరీబ్ కల్యాణ్‌ యోజన లబ్ధిదారులందరికీ నిత్య ప్రయోజనం అందేవిధంగా నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత మంత్రిత్వా శాఖలకు ఆదేశాలు;
గ్రామీణ ప్రాంతాలు.. క్షేత్రస్థాయి సంస్థల్లో ‘ఆరోగ్య సేతు’ యాప్‌ ప్రాచుర్యం పొందేలా చూడాలని మంత్రిమండలి సహచరులను కోరిన ప్రధాన మంత్రి;
రైతులను మండీలతో జోడించేందుకు యాప్‌ ఆధారిత క్యాబ్‌ సేవల తరహాలో సామూహిక ట్రక్కు సేవలవంటి వినూత్న పరిష్కారాలను అన్వేషించండి;
దిగ్బంధం, సామాజిక దూరం నిబంధనలు ఒకేతరహాలో అమలు కావాలి;
దిగ్బంధం ముగిశాక తీసుకోవాల్సిన 10 కీలక నిర్ణయాలు.. దృష్టి సారించాల్సిన 10 ప్రాధాన్యాంశాలను గుర్తించాలని ప్రధానమంత్రి ఆదేశం;
మంత్రిత్వ శాఖలన్నీ కార్యకలాపాల కొనసాగింపు ప్రణాళికతో సిద్ధమై కోవిడ్‌-19 ప్రభావిత ఆర్థిక ప్రతికూలతపై పోరుకు యుద్ధస్థాయిలో సన్నద్ధం కావాలి;
‘మేక్‌ ఇన్‌ ఇండియా’ ఉత్తేజితం కావడానికి ఈ సంక్షోభం కూడా ఒక అవకాశం.. దీనివల్ల ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం

Posted On: 06 APR 2020 3:36PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా వివిధ అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించారు. కోవిడ్‌-19 మహమ్మారిపై ప్రభుత్వ చర్యల అమలులో మంత్రుల నాయకత్వ కృషిని ప్రధాని అభినందించారు. అలాగే వారు నిరంతరం అందిస్తూ వచ్చిన సమాచారం వినూత్న వ్యూహాల రూపకల్పన ఎంతగానో తోడ్పడిందని పేర్కొన్నారు. ఇదే ఉత్సాహంతో నాయకులంతా రాష్ట్రాలు, జిల్లా యంత్రాంగాలతో తప్పనిసరిగా నిత్య సంబంధాలు నెరపాలని ఆయన ఆదేశించారు. ప్రత్యేకించి ప్రపంచ మహమ్మారి కేంద్రాలుగా ఉన్న జిల్లాల విషయంలో క్షేత్రస్థాయి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని చెప్పారు. అంతేకాకుండా అక్కడ తలెత్తే సమస్యలకు పరిష్కారాలు సూచించే బాధ్యత కూడా మంత్రులు, నాయకులదేనని స్పష్టం చేశారు. ప్రజా పంపిణీ కేంద్రాలవద్ద జనసమ్మర్దం ఏర్పడకుండా చూడటం కూడా చాలా ముఖ్యమన్నారు. అక్కడ పరిస్థితులను సమర్థంగా పర్యవేక్షించాలని, ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడంసహా నల్లబజారుకు సరకుల తరలింపును, నిత్యావసరా ధరల పెరుగుదలను అడ్డుకోవాలని సూచించారు. 

   రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ పంట కోతల కాలంలో ప్రభుత్వం అన్నివిధాలా రైతులకు సాయపడుతుందని హామీ ఇచ్చారు. ఈ దిశగా అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై దృష్టి సారించాలని కోరారు. తదనుగుణంగా రైతులను మండీలతో జోడించేలా యాప్‌ ఆధారిత క్యాబ్‌ సేవల తరహాలో సామూహిక ట్రక్కు సదుపాయాలు కల్పించే వినూత్న పరిష్కారాలు అన్వేషించాలని సూచించారు. గిరిజన ఉత్పత్తులను మూల ప్రదేశాలనుంచే కొనుగోలు చేసే వినూత్న మార్గం రూపొందించాలని కోరారు. దీనివల్ల దేశీయ గిరిజన జనాభాతోపాటు వారి ఆదాయ వనరుల మూలాలు చెక్కుచెదరకుండా చూడవచ్చునని పేర్కొన్నారు. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన ప్రయోజనాలు లక్షిత లబ్ధిదారులకు నిరంతరం అందేవిధంగా నిత్య పర్యవేక్షణ ఉండాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.

   ప్రణాళికల రూపకల్పన సందర్భంగా వైరస్‌ మరింత వ్యాప్తిచెందే అవకాశం ఉందన్న అంశాన్ని పరిగణనలో ఉంచుకోవాలని ప్రధాని సూచించారు. తదనుగుణంగా అత్యవసర ఔషధాల ఉత్పత్తి, రక్షణ పరికరాల సరఫరాలు నిర్దిష్ట వ్యవధిలో కొనసాగేలా చూడాలన్నారు. సరఫరా శృంఖలాలను అత్యవసర సామగ్రి అందుబాటును నిరంతరాయంగా కొనసాగించడానికి సూక్ష్మస్థాయి ప్రణాళికలు అవసరమని చెప్పారు. అదే సమయంలో దిగ్బంధ చర్యలు, సామాజిక దూరం నిబంధన తప్పనిసరిగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. దిగ్బంధం ముగిశాక తలెత్తే పరిస్థితులకు తగినట్లుగా వ్యూహాలను రూపొందించుకోవడం అవశ్యమని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు తీసుకోవాల్సిన 10 ప్రధాన నిర్ణయాలు, 10 ప్రధానాంశాల జాబితాను రూపొందించాలని సూచించారు. అదే సమయంలో ఆయా శాఖలలో చేపట్టాల్సిన సంస్కరణలను గుర్తించి అమలులోకి తేవాలని మంత్రులను ఆదేశించారు. రాబోయే సవాళ్ల దృష్ట్యా మన అవసరాల కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించాల్సి ఉందన్నారు. ఆయా శాఖల పనితీరు ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు ఏ మేరకు ప్రోత్సాహకరంగా ఉంటుందో తెలిపే ‘వాస్తవిక సూచీ’లను నిర్వహించాలని అన్ని విభాగాలనూ కోరారు.

   ఆర్థిక వ్యవస్థపై కోవిడ్‌-19 ప్రభావాన్ని ప్రస్తావిస్తూ- ఈ ప్రతికూలతను అంతం చేయడానికి  ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కృషిచేయాల్సి ఉంటుందని ప్రధానమంత్రి చెప్పారు. తదనుగుణంగా మంత్రిత్వశాఖలు తమ కార్యకలాపాల కొనసాగింపు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. మహమ్మారి తీవ్రతలేని ప్రాంతాలను గుర్తించి దశలవారీగా కార్యాలయాలను నిదానంగా తెరవాలని ప్రధాని అన్నారు. కాగా, వైద్యరంగంలో భారతదేశ స్వావలంబన దిశగా ఈ సంక్షోభం ఒక అవకాశం కల్పించిందన్నారు. భారత్‌ నుంచి ఎగుమతులపై ప్రభావాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- వస్తు తయారీ-ఎగుమతులకు ఉత్తేజమిచ్చే ఆచరణాత్మక సూచనలివ్వాల్సిందిగా మంత్రులను కోరారు. అలాగే ఎగుమతుల జాబితాలో కొత్త రంగాలకు స్థానం లభించేలా వినూత్న చర్యలు తీసుకోవాలని చెప్పారు.  ప్రపంచ మహమ్మారిపై ప్రజలకు మరింత సమాచారంతోపాటు అవగాహన పెంపు అవసరమన్నారు. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో, క్షేత్రస్థాయి సంస్థలలో ‘ఆరోగ్య సేత’ యాప్‌కు ప్రాచుర్యం లభించేలా మంత్రులు శ్రద్ధ చూపాలని ప్రధానమంత్రి సూచించారు. కాగా, ఆదివారం రాత్రి 9 గంటలనుంచి 9 నిమిషాలపాటు దీపాలు వెలిగించే కార్యక్రమంపై మంత్రులు ప్రశంసలు కురిపించారు. ప్రధాని పిలుపు మేరకు దేశం నలుమూలలా ప్రజలు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఈ సందర్భంగా ఆయన దృష్టికి తెచ్చారు. వలస కార్మికుల సమస్యల పరిష్కారం, ప్రజల్లో భయాందోళనలు పెంచేవిధంగా సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చేస్తున్న కృషిని వారు వివరించారు. అలాగే నిత్యావసరాల నిరంతర సరఫరా, మహమ్మారిపై పోరులో అగ్రశ్రేణి సిబ్బంది, కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు తెలిపారు. కాగా, ముందున్న సవాళ్లను ఎదుర్కొనడానికి తీసుకోబోయే చర్యలపై ప్రధానికి, మంత్రులకు ప్రభుత్వ ఉన్నతాధికారులు వివరించారు. పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్య కార్యదర్శి, మంత్రిమండలి కార్యదర్శి, ఇతర సీనియర్‌ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

*****


(Release ID: 1611687) Visitor Counter : 270