ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రి మరియు స్పెయిన్ ప్రధానమంత్రి మధ్య టెలిఫోన్ సంభాషణ

Posted On: 04 APR 2020 9:55PM by PIB Hyderabad

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు స్పెయిన్ ప్రభుత్వ ప్రెసిడెంట్ (ప్రధానమంత్రితో సమాన హోదా) గౌరవనీయులు పెడ్రో శాంచెజ్ పెరెజ్-కాస్తేజోన్ తో టెలిఫోన్ లో మాట్లాడారు.   కోవిడ్-19 మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎదురైన సవాళ్ల గురించి ఇరువురు నాయకులు చర్చించారు. 

స్పెయిన్ లో సంభవించిన విషాదకర  ప్రాణ నష్టానికి ప్రధానమంత్రి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. వ్యాధితో బాధపడుతున్నవారు త్వరగా కోలుకోవాలని తాను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.   స్పెయిన్ వీరోచిత కృషికి భారత దేశం సంఘీభావం తెలియజేస్తోందనీ, శక్తి వంచన లేకుండా సహాయం అందించడానికి భారతదేశం సిద్ధంగా ఉందనీ ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. 

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఈ  ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో అంతర్జాతీయ సహకారం చాలా ముఖ్యమని  నాయకులు ఇద్దరూ అంగీకరించారు.  కోవిడ్ అనంతర ప్రపంచీకరణకు సంబంధించి నూతన మానవ కేంద్రీకృత భావన ను నిర్వచించవలసిన అవసరాన్ని గుర్తించిన ప్రధానమంత్రి  పరిశీలనతో స్పెయిన్ ప్రధానమంత్రి ఏకీభవించారు. 

ఈ మహమ్మారి కారణంగా గృహాలకే పరిమితమైన ప్రజల మానసిక, శారీరిక ఆరోగ్య పరిరక్షణకు సులభంగా అందుబాటులో ఉండే యోగా, సంప్రదాయ మూలికా మందుల వినియోగం పై ఇద్దరు నాయకులు ఒక అంగీకారానికి వచ్చారు. 

పెరుగుతున్న కోవిడ్-19 పరిస్థితికి సంబంధించీ, తద్వారా వెలుగులోకి వచ్చే అవసరాల గురించీ, రెండు దేశాలకు చెందిన బృందాలు నిరంతరం సన్నిహితంగా కొనసాగాలని వారు అంగీకరించారు.  

****


(Release ID: 1611241) Visitor Counter : 212