మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల వైస్‌-చాన్సలర్లతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్‌ పోఖ్రియాల్‌ ‘నిషాంక్‌’ దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం

‘స్వయం’ తదితర డిజిటల్‌ మాధ్యమాల ద్వారా విద్యార్థులకు
పాఠ్యాంశాల బోధన కొనసాగించాలని కేంద్ర మంత్రి స్పష్టీకరణ
ఆన్‌లైన్ విద్య - ఆన్‌లైన్ ప‌రీక్ష‌లపై సూచ‌న‌లిచ్చేందుకు ఇగ్నో ఉప కుల‌ప‌తి ప్రొఫెసర్ నాగేశ్వరరావు అధ్యక్షతన క‌మిటీ ఏర్పాటు చేశాం: కేంద్ర మంత్రి

Posted On: 04 APR 2020 9:39PM by PIB Hyderabad

కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల వైస్‌-చాన్సలర్లతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్‌ పోఖ్రియాల్‌ ‘నిషాంక్‌’ ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కింద పేర్కొన్న అంశాలపై వారు చర్చించారు:

  1. విశ్వవిద్యాలయ వసతిగృహాల్లోని విద్యార్థులు, బోధన-బోధనేతర సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు;
  2. విశ్వవిద్యాలయాల్లో ‘సామాజిక దూరం, ఏకాంత’ నిబంధనలకు సముచిత కట్టుబాటు;
  3. కోవిడ్‌-19 అనుమానిత కేసుల పరీక్షకు విశ్వవిద్యాలయాల్లో సదుపాయాల కల్పన;
  4. విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన కొనసాగింపునకు తగిన ఏర్పాట్లు;
  5. విద్యార్థుల్లో మానసిక ఆరోగ్య సవాళ్ల పరిష్కారానికి కృషి;
  6. ఉద్యోగుల (శాశ్వత, తాత్కాలిక, రోజువారీ) జీతనాతాల సమస్యకు పరిష్కారం;
  7. కోవిడ్‌-19పై చర్యల గురించి సామాజిక మాధ్యమాలద్వారా సమాచార ప్రదానం;
  8. కోవిడ్‌-19 సంబంధిత పరిశోధనల నిర్వహణకు ప్రోత్సాహం.

   ప్రస్తుత సంక్షోభ సమయంలో వసతిగృహాల్లో ఉన్న విద్యార్థులకు ఆహార సరఫరా, మానసిక ఆరోగ్యంపై తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు విశ్వవిద్యాలయాలన్నీ తెలిపాయి. ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాల బోధన కొనసాగుతున్నట్లు వెల్లడించాయి. కాగా, ఇందుకోసం ‘స్వయం, స్వయంప్రభ’ వంటి అన్ని డిజిటల్‌ మాధ్యమాలను వాడుకోవాలని వైస్‌-చాన్సలర్లను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఆదేశించారు. ఆన్‌లైన్‌ విద్యతోపాటు పరీక్షల నిర్వహణపై సూచనలిచ్చేందుకు ‘ఇగ్నో’ ఉప కులపతి ప్రొఫెసర్‌ నాగేశ్వరరావు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే అకడమిక్‌ కేలండర్‌ రూపకల్పనపై యూజీసీ చైర్మన్‌ నేతృత్వంలో మరో కమిటీ ఏర్పాటుకు నిర్ణయించామన్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం తమ శాఖ సంయుక్త కార్యదర్శి నాయకత్వాన ఇంకొక కమిటీ కూడా ఏర్పాటవుతుందని తెలిపారు. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో అవసరమైన సౌకర్యాలకు కొరత లేకుండా చూడాలని ఉప కులపతులను మంత్రి ఆదేశించారు. దీనిపై పరిశోధనలు చేపట్టాలని, ప్రభుత్వం ఇందుకు చేయూతనిస్తుందని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని శ్రీ నిషాంక్‌ అందరికీ సూచించారు.

*****



(Release ID: 1611240) Visitor Counter : 154