రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ నిపుణులకు కోవిడ్‌-19 నుంచి రక్షణ కోసం

ముఖ రక్షక కవచాలు, పరిశుభ్రత చాంబర్లు రూపొందించిన డీఆర్‌డీవో

Posted On: 04 APR 2020 6:29PM by PIB Hyderabad

 కోవిడ్‌-19 ప్రపంచ మహమ్మారి నిర్మూలన కృషిలో భాగంగా రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ-డీఆర్‌డీవో త్వరితగతిన సరికొత్త ఉత్పత్తుల రూపకల్పనకు శాస్త్రీయ మార్గంలో శ్రమిస్తోంది. ఆ మేరకు ఉత్పత్తి పరిమాణం పెంచడానికి పరిశ్రమ భాగస్వాములతో సంయుక్తంగా ముందుకు సాగుతోంది.

వ్యక్తిగత శుభ్రత ఉపకరణం (PSE)

   ఈ మేరకు సంస్థ పరిధిలో అహ్మద్‌నగర్‌లోగల ‘వాహన పరిశోధన-అభివృద్ధి విభాగం’ (VRDE) ప్రయోగశాల ‘సంపూర్ణ శరీర శుభ్రత ఉపకరణం’ (PSE) రూపొందించింది. ఇందులోనుంచి ఒక్కొక్కరు వంతున నడిచి వెళితే... శరీర మలినాల తొలగింపు ప్రక్రియ పూర్తవుతుంది. శానిటైజర్‌, సబ్బు సదుపాయంగల ఈ చాంబర్‌ను ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఇందులోనికి ప్రవేశించేటపుడు కాలితో ఒక పెడల్‌ను తొక్కితే వారిపై హైపో సోడియం క్లోరైడ్‌ ద్రవం 25 సెకన్లపాటు పొగమంచులా పడి, వెంటనే ఆగిపోతుంది. అయితే, ఇందులోకి కళ్లుమూసుకుని లేదా రక్షణ ధరించి ప్రవేశించాలి. దీనిపై అమర్చిన ట్యాంకులోగల 700 లీటర్ల ద్రవంతో 650 మందికి వ్యక్తిగత పరిశుభ్రత లభిస్తుంది. ఈ ఉపకరణం రూపకల్పనలో ఘజియాబాద్‌లోని మెజర్స్‌ డి.హెచ్‌.లిమిటెడ్‌ సహకరించగా కేవలం నాలుగు రోజుల్లోనే ఇది సిద్ధమైంది.

సంపూర్ణ ముఖరక్షక కవచం (FFM)

   ఇక కోవిడ్‌-19 రోగులకు వైద్యసేవలందించే ఆరోగ్య సంరక్షణ నిపుణులకు రక్షణ కోసం  హైదరాబాద్‌లోని రీసెర్చి సెంటర్‌ ఇమారత్‌ (RCI), చండీగఢ్‌లోని టెర్మినల్‌ బాలిస్టిక్స్‌ రీసెర్చి లేబొరేటరీ (TBRL) సంపూర్ణ ముఖరక్షక కవచం (FFM) రూపొందించాయి. ఇది అత్యంత తేలికగా ఉండి, ఎక్కువసేపు ధరించగలిగేలా ఉంటుంది. దీని తయారీలో వాడిన థర్మోప్లాస్టిక్‌ను జొన్న లేదా చెరకు పిప్పినుంచి తీసిన పిండిపదార్థంతో రూపొందించారు. అందువల్ల ఇది వాడి పారేశాక త్వరగా భూమిలో కలసిపోతుంది.



(Release ID: 1611162) Visitor Counter : 151