ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 ను అధిగమించడానికి సంసిద్ధతను తెలుసుకోడానికి ఎల్.ఎన్.జె.పి. ఆసుపత్రిని సందర్శించిన డాక్టర్ హర్ష వర్ధన్

కోవిడ్-19 కోసం అంకితమైన ఆసుపత్రిగా పనిచేయనున్న ఎల్.ఎన్.జె.పి.

Posted On: 04 APR 2020 4:36PM by PIB Hyderabad

ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ రోజు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రిని సందర్శించి కోవిడ్-19 అధిగమించడానికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. 

కేంద్ర మంత్రి ఆసుపత్రిలోని ఫీవర్ వార్డు, న్యూ సర్జికల్ వార్డు బ్లాకు, ఆహారం అందించే విభాగం, ప్రత్యేక వార్డు, కరోనా పరీక్షా కేంద్రం, కరోనా సంరక్షణ యూనిట్, ఐ.సి.యు. విభాగాలను సందర్శించారు.  ఆసుపత్రి ఆవరణ, వివిధ వార్డులను క్షుణ్ణంగా సమీక్షించి, పరిశీలించిన అనంతరం, వివిధ విభాగాల పనితీరు పట్ల ఆరోగ్య మంత్రి  సంతృప్తి వ్యక్తం చేసి, ప్రశంసించారు.  అక్కడ ముందు వరుసలో అంకితభావంతో పని చేస్తున్న ఆరోగ్య కార్మికుల కృషిని ఆయన అభినందించారు. "ఇటువంటి క్లిష్ట సమయంలో మీరు చేస్తున్న సేవలకు దేశం మీకు కృతజ్ఞతలు తెలియజేస్తోంది", అని పేర్కొన్నారు. ఆసుపత్రిలో వైరస్ వ్యాప్తి నియంత్రణకు తగిన పద్ధతులు పాటించాలని వారికి సూచించారు.  ఐసోలేషన్ పడకల కోసం పెరుగుతున్న అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, సమృద్ధిగా ఐసోలేషన్ వార్డులు, పడకలు కలిగివున్న ఎల్.ఎన్.జె.పి. ఆసుపత్రి, కోవిడ్-19 కోసం అంకితమైన ఆసుపత్రిగా పనిచేస్తుందని డాక్టర్ హర్ష వర్ధన్ ప్రకటించారు.  

కోవిడ్-19 రోగులకు ఎల్.ఎన్.జె.పి. ఆసుపత్రిలో 1500 పడకలనూ, జి.బి. పంత్ ఆసుపత్రిలో 500 పడకలనూ ప్రభుత్వం గుర్తించినట్లు డాక్టర్ హర్ష వర్ధన్ తెలియజేసారు.  ఈ వార్డులలో పనిచేస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా, కుటుంబ సభ్యులను కలవడం వల్ల వచ్చే సమస్యలను అధిగమించడానికీ వీలుగా, వారికి ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉన్న నర్సుల వసతి గృహంలోనూ, సమీపంలో ఉన్న హోటళ్లలోనూ ప్రత్యేక వసతి, భోజన సదుపాయాలు కల్పించారు.  ఆసుపత్రిలో సేవలు పొందుతున్న రోగుల కోసం టెలి-మెడిసిన్ / టెలి-కన్సల్టేషన్ విధానాన్ని నెలకొల్పాలని కూడా ఆయన సూచించారు.  ఇటువంటి ఏర్పాటు ఇప్పటికే న్యూఢిల్లీ లోని ఎయిమ్స్ లో నెలకొల్పినట్లు, ఆయన, తెలిపారు.  డిజిటల్ ప్రిస్క్రిప్షన్ మరియు ఇంటి దగ్గర మందులు అందజేసే విధానాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినట్లు ఆయన తెలియజేశారు. 

పి.పి.ఈ., ఎన్-95 రకం మాస్కులు, వెంటిలేటర్ల లభ్యత పై ఆరోగ్యమంత్రి స్పందిస్తూ, " దేశ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని, తగినంత పరిమాణంలో ఇప్పటికే ఆర్డర్ పెట్టడం జరిగింది. వివిధ రాష్ట్రాల వద్ద ఇప్పటికే తగిన సంఖ్యలో,  పి.పి.ఈ. రకం మాస్కులు - 4,66,057 మరియు ఎన్-95 రకం మాస్కులు - 25,28,996 ఉన్నాయి. రానున్న మరి కొద్ది రోజుల్లోనే వీరికి  పి.పి.ఈ. రకం మాస్కులు - 1,54,250  మరియు ఎన్-95 రకం మాస్కులు - 1,53,300 అదనంగా సరఫరా చేయడం జరుగుతుంది." అని వివరించారు.   

వైద్యులు, ముందు వరుసలో సేవలందిస్తున్న ఆరోగ్య సిబ్బందిపై జరుగుతున్న దాడుల గురించి ఆయన ప్రస్తావిస్తూ,  ఇటువంటి సంఘటనలను హోం మంత్రిత్వశాఖ గుర్తించిందనీ, జాతీయ భద్రతా చట్టం కింద బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా అధికారులను ఆదేశించిందనీ చెప్పారుకరోనా బారిన పడిన వ్యక్తుల జీవితాలను కాపాడడం కోసం తమ విలువైన జీవితాన్నీసమయాన్నీ త్యాగం చేస్తున్న వైద్యులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులపై దాడి చేయవద్దని సాధారణ ప్రజలకు ముఖ్యంగా రోగుల కుటుంబ సభ్యులకు కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు

దేశంలో కోవిడ్-19 వ్యాధి నివారణ, వ్యాప్తి నియంత్రణకు సామాజిక దూరం మార్గదర్శకాలను అనుసరించడంతో పాటు, ఇతర చేయవలసిన పనులు, చేయకూడని పనులను తప్పక పాటించాలని డాక్టర్ హర్ష వర్ధన్ ప్రజలను కోరారు

*****


(Release ID: 1611156) Visitor Counter : 183