శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్-19పై పోరులో భాగంగా ముంబై ఐఐటీలోని ‘సైన్’లో
సత్వర ప్రతిస్పందన కేంద్రం ఏర్పాటు చేయనున్న డీఎస్‌టీ
Posted On:
03 APR 2020 5:35PM by PIB Hyderabad
ప్రపంచ మహమ్మారి కోవిడ్-19ను ఎదుర్కొనడంలో సత్వర ప్రతిస్పందనగా భారత ప్రభుత్వ శాస్త్ర-సాంకేతిక విజ్ఞాన విభాగం (DST) వినూత్నచర్యలు చేపట్టింది. ఈ మేరకు కోవిడ్-19 ఆరోగ్య సంక్షోభంపై ముమ్మర యుద్ధ కేంద్రం (CAWACH) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా కోవిడ్-19 సవాళ్ల పరిష్కారానికి అంకుర సంస్థలను ప్రోత్సహించడంసహా వినూత్న ఆవిష్కరణలకు మార్గదర్శనం, మూల్యాంకన మద్దతునిచ్చే ఈ కేంద్రం కోసం రూ.56 కోట్లు వెచ్చించనుంది. తదనుగుణంగా CAWACH కేంద్రం నిర్వాహక బాధ్యతలను డీఎస్‌టీ మద్దతుతో ముంబై ఐఐటీ (IIT)లో నడుస్తున్న సాంకేతిక వ్యాపార ప్రోత్సహక సంస్థ ‘ది సొసైటీ ఫర్ ఇన్నొవేషన్ అండ్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ (SINE)కు అప్పగించనుంది.
దేశం నుంచి కరోనా మహమ్మారిని పారదోలే చర్యలను వేగవంతం చేయడంలో డీఎస్‌టీ కీలకపాత్ర పోషిస్తోంది. దేశం అత్యవసర ఆరోగ్య పరిస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుసహా అనేక సంస్థలు, ప్రయోగశాలలు పలు పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ కృషిని ఏకీకరించి, పరిశోధన-అభివృద్ధి చర్యలను వేగవంతం చేసేందుకు డీఎస్‌టీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కోవిడ్-19 నియంత్రణ, నిర్మూలన దిశగా వెంటిలేటర్లు, వ్యాధి నిర్ధారణ సదుపాయాలు, చికిత్స విధానాలతోపాటు సమాచార సాంకేతికత తదితరాల రూపకల్పనలో అంకుర సంస్థలను ప్రోత్సహించనుంది. సంభావ్య సామర్థ్యంగల సంస్థలను గుర్తించి, సకాలంలో వాటికి తగిన ఆర్థిక మద్దతునిచ్చి రాబోయే ఆరు నెలల్లో పరిష్కారాలను అందుబాటులోకి తెచ్చేవిధంగా చూడటం CAWACH బాధ్యత.
***
(Release ID: 1610787)