రక్షణ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 నిరోధంలో తమ శాఖ చేస్తున్న కృషిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్ష
పౌర అధికారులకు సహకారాన్ని మరింత ముమ్మరం
చేయాలని అన్ని సంస్థలకూ ఆదేశాలు జారీ
Posted On:
01 APR 2020 3:25PM by PIB Hyderabad
కోవిడ్-19పై పోరాటానికి తమశాఖ పరిధిలో అందుతున్న సహకారాన్ని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ దృశ్ర-శ్రవణ మాధ్యమంద్వారా సమీక్షించారు. ఆ శాఖ సహాయమంత్రి శ్రీ శ్రీపాద నాయక్‌సహా పలువురు ఉన్నతాధికారులు, ఇతర ముఖ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆయా సంస్థలు అనేక రూపాల్లో అందిస్తున్న సేవలను రక్షణమంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు. దీంతోపాటు ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇతర మంత్రిత్వశాఖలు, సంస్థలతో సమన్వయం చేసుకుంటూ సహాయ సహకారాలను మరింత ముమ్మరం చేయాలని ఆయన తమ శాఖ పరిధిలోని అన్ని సంస్థలనూ ఆదేశించారు.
కోవిడ్-19 నిరోధక కృషిలో భాగంగా దేశంలోని ఆర్మీ స్థావరాలలో 9,000 పడకలతో చికిత్స సదుపాయాలను కల్పించామని శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌కు రక్షణ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ వివరించారు. వీటిలో వివిధ ప్రాంతాల నుంచి తరలించిన 1,000 మందికి అందిస్తున్న దిగ్బంధ 2020 చికిత్స ఏప్రిల్ 7న ముగుస్తుందన్నారు. ఇక ఏ సమయంలోనైనా సేవలందించేందుకు తమ నౌకలు సిద్ధంగా ఉన్నాయని నావికా దళాధిపతి అడ్మిరల్ కరమ్‌వీర్ సింగ్ మంత్రికి చెప్పారు. గడచిన ఐదు రోజులుగా భారత వాయుసేన విమానాలు దాదాపు 25 టన్నుల వైద్య, ఇతర అత్యవసర సరకులను దేశంలోని పలు ప్రాంతాలకు చేరవేసినట్లు ఎయిర్‌చీఫ్ మార్షల్ ఆర్.కె.ఎస్.భదూరియా వివరించారు. అలాగే ఆర్మీ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు 8,500 మంది డాక్టర్లు, సహాయ సిబ్బంది సంసిద్ధంగా ఉన్నారని పదాతి దళాధిపతి జనరల్ ఎం.ఎం.నరవాణే తెలిపారు.
రక్షణ శాఖ కార్యదర్శి, డీఆర్‌డీవో అధిపతి డాక్టర్ జి.సతీష్‌రెడ్డి, సాయుధ దళాల వైద్యసేవల (AFMS) డీజీ లెఫ్టినెంట్ జనరల్ అనూప్ బెనర్జీ తమతమ విభాగాల తరఫున అందించిన సహాయ సహకారాల గురించి వివరించారు. అలాగే ‘కార్పొరేట్ సామాజిక బాధ్యత’ కింద ‘పీఎం కేర్స్’ నిధికి రూ.40 కోట్ల విరాళం అందించినట్లు రక్షణశాఖ పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థల అధిపతులు వెల్లడించారు. దీంతోపాటు తమ సంస్థల ఉద్యోగులు కూడా ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్లు, ఇతర వ్యక్తిగత రక్షణ సామగ్రిని తయారుచేసి అందిస్తున్నట్లు ఆయుధ తయారీ కర్మాగార బోర్డు (OFB) తెలిపింది.
***
(Release ID: 1609948)
Visitor Counter : 211