సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

వాస్త‌వాల్నిధ్రువీక‌రించుకోకుండా భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేసే వార్త‌ల్ని ప్ర‌చారం చేయొద్దు

దేశంలోని మీడియా సంస్థ‌లకు సుప్రీంకోర్టు ఆదేశాలు

Posted On: 01 APR 2020 3:34PM by PIB Hyderabad

ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేసే అవ‌కాశం ఉన్న వార్తల‌ను ప్ర‌చారం చేసేట‌ప్పుడు  మీడియా వాస్త‌వాల‌ను ధ్రువీక‌రించుకోవాల‌ని దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు మీడియా సంస్థ‌ల‌ను ఆదేశించింది. ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్‌తో స‌హా సోష‌ల్ మీడియా సంస్థ‌లు వార్త‌ల‌ను ప్ర‌సారం చేసేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని పెద్ద‌కోర్టు సూచించింది. ప్ర‌స్తుతం దేశంలో అమ‌లులో ఉన్న లాక్డౌన్ మ‌రో మూడు నెల‌ల కంటే కూడా ఎక్కువ కాలం కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని ఇటీవ‌ల కొన్ని మీడియా సంస్థ‌లు ప్ర‌సారం చేసిన వార్త‌ల‌పై సుప్రీం సీరియ‌స్ అయింది. ఇలాంటి వార్త‌లు న‌గ‌రాల‌లో అధిక సంఖ్య‌లో ప‌నిచేస్తున్న‌ వ‌ల‌స కార్మికుల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేసింద‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం పేర్కొంది. ఇలాంటి వార్త‌లు వ‌ల‌స కార్మికుల్లో తెలియ‌ని భ‌యాందోళ‌న‌ల్ని క‌లిగించ‌డంతో పాటు కొందరు ప్రాణాలు కూడా కోల్పోయేందుకు కార‌కంగా నిలిచే అవ‌కాశ‌ముంద‌ని సుప్రీం కోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో నిజ‌నిర్దార‌ణ చేసుకోకుండా ప్ర‌చురించే వార్త‌ల‌ను చూసి చూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌డం సాధ్యం కాద‌ని పెద్దకోర్టు తెలిపింది. కోవిడ్ మ‌హ‌మ్మారి గురించి మీడియాలో జ‌రుగుతున్న చ‌ర్చ‌ల విష‌యంలో తాము జోక్యం చేసుకోవాలని చూడ‌డం లేద‌ని.. అయితే ఇదే స‌మ‌యంలో మీడియా సంయ‌మ‌నంతో మెద‌లుతూ.. జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై అధికారిక స‌మాచారాన్ని తీసుకొని నిజ‌నిర్థార‌ణతో వార్త‌ల‌ను ప్ర‌చారం చేయాల‌ని కోర్టు మీడియా సంస్థ‌ల‌కు ఆదేశాల‌ను జారీ చేసింది. 



(Release ID: 1609945) Visitor Counter : 168