సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

నగరాల్లో ప్రజలు తిరగకుండా చూసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం నిర్దేశం

వలస కూలీలకు వారి పని ప్రదేశంలో సకాలంలో వేతనాలు చెల్లించడం సహా అన్ని ఏర్పాట్లు కల్పించాలి.

విద్యార్థులు కార్మికులను ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తున్న వారిపై చర్యలు

Posted On: 29 MAR 2020 1:44PM by PIB Hyderabad

కేబినెట్ కార్యదర్శి మరియు కేంద్ర హోంశాఖ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. కేబినెట్ సెక్రటరీ, హోం శాఖ  సెక్రటరీలు నిన్న సాయంత్రం మరియు ఈ రోజు ఉదయం చీఫ్ సెక్రటరీ మరియు డీజీపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మార్గదర్శకాలను సమర్థవంతంగా అమలు చేయడం గురించి ప్రధానంగా చర్చ జరిగింది. అవసరమైన సామగ్రికి సంబంధించిన అంశాలు కూడా చర్చకు వచ్చాయి. 24 గంటలు పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు, పరిస్థితులకు తగ్గట్టుగా అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

అయితే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వలస కార్మికులు స్వస్థలాల బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా, రాష్ట్ర సరిహద్దులను సమర్ధవంతంగా మూయాలని ఆదేశాలు జారీ చేశారు. నగరాల్లో లేదా రహదారులపై ప్రజల సమ్మర్థం లేకుండా చూడాలని రాష్ట్రాలను ఆదేశించారు. అత్యవసరాలను చేరవేసే వాహనాలకు మాత్రమే అనుమతించాలని, డి.ఎం. చట్టం కింద జారీ చేసిన ఆదేశాల అమలుకు డిఎంలు, ఎస్పీలు వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని తెలిపారు.

వలస కార్మికులు మరియు పేద ప్రజలకు ఆహారం మరియు ఆశ్రయం కోసం వారున్న ప్రదేశంలోనే తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీని కోసం ఎస్.డి.ఆర్.ఎఫ్. నిధులను ఉపయోగించాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీని కోసం రాష్ట్రాల వద్ద తగినంత నిధులు అందుబాటులో ఉన్నాయి.

లాక్ డౌన్ కాలంలో కార్మికులకు వారి పని ప్రదేశాల్లో వేతనాలు ఎలాంటి తగ్గింపులకు తావు లేకుండా సరైన విధంగా సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలని రాష్ట్రాలకు సూచించడం జరిగింది. ఈ కాలంలో కూలీలకు ఇంటి అద్దె చెల్లింపు కోసం ఒత్తిడి చేయకూడదు. కార్మికులు లేదా విద్యార్థులను వారు ఉంటున్న ప్రదేశాన్ని ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి, ఈ కాలంలో ప్రయాణాలు చేసిన వారు ప్రభుత్వ నిర్బంధంలో, నిర్బంధ సదుపాయాలతో 14 రోజుల పాటు లోబడి ఉంటారు. నిర్బంధం సమయంలో అలాంటి వ్యక్తుల పర్యవేక్షణపై వివరణాత్మక సూచనలు రాష్ట్రాలకు జారీ చేయబడ్డాయి.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మూడు వారాల కఠినమైన ఆంక్షల అమలు అవసరమని, ఇది అందరి ప్రయోజనం కోసమని అన్ని రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయి. 


(Release ID: 1609030) Visitor Counter : 224