ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రి మరియు అబు ధాబి యువరాజు మధ్య టెలిఫోన్ సంభాషణ

Posted On: 26 MAR 2020 10:31PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు అబూ ధాబి యువరాజు గౌరవనీయులు షేక్ మొహమ్మద్  బిన్ జాయేద్ అల్ నహ్యాన్ తో టెలిఫోను లో మాట్లాడారు.   

 

ప్రస్తుతం నెలకొన్న కోవిడ్-19 మహమ్మారి పై సమాచారం, అభిప్రాయాలతో పాటు, తమ తమ దేశాల్లో పరిస్థితి గురించీ, తమ ప్రభుత్వాలు చేపడుతున్న చర్యల గురించీ, ఇరువురు నాయకులు ఒకరికొకరు తెలియజేసుకున్నారు.   వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి రానున్న కొన్ని వారాలు చాలా కీలకమనీ, అన్ని దేశాలూ, ఈ విషయమై సమిష్టిగా, సమన్వయంతో చర్యలు చేపట్టవలసిన అవసరం ఉందనీ, వారు అంగీకరించారు.  ఈ మహమ్మారిపై చర్చించడంకోసం,  జి-20 నాయకుల మధ్య ఈ ఉదయం వర్చ్యువల్ సదస్సు నిర్వహించడాన్ని వారు ఈ సందర్భంగా ప్రశంసించారు. 

 

ద్వైపాక్షిక సంబంధం యొక్క పటిష్టత, గొప్పదనం పై తమకు గల ప్రాముఖ్యతను ఇరువురు నాయకులు ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.  ప్రస్తుత పరిస్థితుల్లో,  ముఖ్యంగా లాజిస్టిక్ సరఫరా మార్గాల కొనసాగింపును నిర్ధారించుకోడానికి, తమ అధికారుల మధ్య క్రమం తప్పకుండా సంప్రదింపులు కొనసాగించాలని వారు నిర్ణయించారు.  

 

యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ లో నివసిస్తూ, తమ దేశ ఆర్ధిక వ్యవస్థకు దోహదపడుతున్న, రెండు మిలియన్లకు పైగా ఉన్న భారతీయుల సంక్షేమం గురించి గౌరవనీయులు యువరాజు ప్రధానమంత్రికి హామీ ఇచ్చారు.  ప్రస్తుత పరిస్థితిలో ప్రవాస భారతీయుల ఆరోగ్యం, భద్రత పై యువరాజు చూపుతున్న వ్యక్తిగత శ్రద్ధ కు ప్రధానమంత్రి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. 

 

యువరాజు, వారి మొత్తం రాజ కుటుంబంతో పాటు, ఎమిరేట్స్ పౌరులూ మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుతూ ప్రధానమంత్రి శుభాకాంక్షలు చెప్పారు. యువరాజు కూడా తిరిగి ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. 

 

***


(Release ID: 1608512)