రక్షణ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వ యంత్రాంగానికి అన్ని విధాలా సహాయంగా నిలుస్తోంది భారతీయ వైమానికదళం. ఇందుకోసం వైమానికి దళం అనేక చర్యలను చేపట్టింది.
Posted On:
26 MAR 2020 6:22PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా ఇప్పటికే 9 క్వారంటైన్ సౌకర్యాలను ఏర్పాటు చేసింది. వీటిలో ఒక్కోదానిలో 200-300 వరకు రోగులను చేర్చుకొని చికిత్స అందించవచ్చు. దేశవ్యాప్తంగాగల ముఖ్యమైన ఐఏఎప్ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేశారు.
భారత వైమానిక దళానికి చెందిన బెంగళూరు కమాండ్ ఆసుపత్రిలో మొదటి లేబరేటరీని ఏర్పాటు చేసి అందులో కోవిడ్ 19 కేసులకు సంబంధించిన పరీక్షలు చేస్తున్నారు. అనుమానిత కేసులు రాగానే వాటిని వెంటనే పరీక్షించడానికి వీలవుతోంది. ఫలితాలు రాగానే అవసరమైనవారికి వెంటనే తదనుగుణమైన చికిత్సలను వెంటనే అందివ్వగలుగుతున్నారు.
తాజా పరిస్థితులను పరిశీలించడానికి, అవసరమైతే వెంటనే స్పందించడానికి, సహాయం అందించడానికిగాను 24 గంటలూ పని చేసే సంక్షోభ నివారణ నిర్వహణ విభాగాన్ని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేశారు. అలాగే ఈ విభాగాలను పలు కమాండ్ ప్రధాన కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేశారు. లెహ్ ప్రాంతానికి వైద్య పరికరాలు, మందులను, వైద్యులను తీసుకుపోవడానికి అక్కడనుంచి రక్త నమూనాలను తీసుకొని వాటిని చండీగడ్, ఢిల్లీలలో అందించడానికి వైమానిక దళ విమానాల సేవల్ని వినియోగించుకుంటున్నారు.
కోవిడ్ 19 నిరోధానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన అన్ని నియమ నిబంధనల్ని దేశంలోని అన్ని ఐఏఎఫ్ కేంద్రాలలో అమలు చేస్తున్నారు. కోవిడ్ 19పై ప్రభుత్వం చేస్తున్న ఈ సమరంలో వైరస్ వ్యాప్తి నిరోధానికిగాను భారతదేశ వైమానిక దళం అన్నిరకాల సేవలను అందజేస్తూ దేశ పౌరులకు అండగా నిలుస్తోంది.
(Release ID: 1608475)
Visitor Counter : 173