రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కోవిడ్ -19ను ఎదుర్కొనేందుకు ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను స‌మీక్షించిన ర‌క్ష‌ణ మంత్రి శ్రీ రాజ్ నాథ్‌సింగ్‌:

పౌర అధికార యంత్రాంగానికి అవ‌స‌ర‌మైన అన్నిర‌కాల స‌హాయాన్ని అందించేందుకు స‌న్నద్ధంగా ఉండాల్సిందిగా సైనిక‌ద‌ళాలు, ర‌క్ష‌ణ విభాగానికి చెందిన ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌ల‌ను కోరిన ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ :

Posted On: 26 MAR 2020 2:23PM by PIB Hyderabad

కోవిడ్ -19 ప‌రిస్థితిపై ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, ర‌క్ష‌ణ మంత్రి త్వ‌శాఖ సీనియ‌ర్ అధికారుల‌తో ఈరోజు స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. కోవిడ్ -19 ప్ర‌భావిత దేశాల నుంచి భార‌త జాతీయుల‌ను, విదేశీయుల‌ను ఖాళీచేయించి వారిని వివిధ క్వారంటైన్ కేంద్రాల‌కు త‌ర‌లించ‌డంలో  సైనిక ద‌ళాలు, ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన వివిధ విభాగాలు చేప‌ట్టిన సానుకూల చ‌ర్య‌ల‌ను ర‌క్ష‌ణ మంత్రి అభినందించారు. వివిధ స్థాయిల‌లోని పౌర యంత్రాంగానికి అవ‌స‌ర‌మైన స‌హాయాన్ని అందించేందుకు
సాయుధ దళాలు , ఇతర విభాగాలు వారి సంసిద్ధతను సమకూర్చుకోవాలని , పౌర  యంత్రాంగానికి వివిధ స్థాయిలలో అవసరమైన అన్నిర‌కాల‌ సహాయాన్ని అందించాలని ఆయన కోరారు.
 ఇప్ప‌టివ‌ర‌కూ ఈ దిశ‌గా తీసుకున్న చ‌ర్య‌లు, అందించిన స‌హాయం గురించి రాజ్‌నాథ్‌సింగ్‌కు   అధికారులు,వివ‌రించారు. చైనా,జ‌పాన్‌, ఇరాన్ వంటి క‌రోనా ప్ర‌భావిత దేశాల‌నుంచి భార‌త‌జాతీయుల‌ను తీసుకువ‌చ్చేందుకు భార‌త వైమానిక ద‌ళం ప‌లు  విమానాల‌ను న‌డిపింది.
సైనిక‌ద‌ళాల‌కు చెందిన వివిధ క్వారంటైన్ కేంద్రాల‌లో ఇప్ప‌టివ‌ర‌కు  విదేశాల నుంచి తీసుకువ‌చ్చిన 1462 మందిని ఉంచారు వీరిలో 389 మందిని ఇళ్ల‌కు పంపారు. ప్ర‌స్తుతం 1073 మందిక మ‌నేశ్వ‌ర్‌,హిండ‌న్‌, జైస‌ల్మేర్‌, జోధ్‌పూర్‌, ముంబాయి ల‌లో క్వారంటైన్ స‌దుపాయం క‌ల్పిస్తున్నారు. మ‌రో 950 బెడ్‌ల సామ‌ర్ధ్యంగ‌ల స‌దుపాయాల‌ను  కూడా అందుబాటులో ఉంచారు.
డిఫెన్స్ రిసెర్చ్ డ‌వ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డిఆర్‌డిఓ) లేబ‌రెట‌రీలు 20 వేల లీట‌ర్ల శానిటైజ‌ర్ల‌ను త‌యారు చేసి, వివిధ సంస్థ‌ల‌కు పంపిణీ చేశాయి. ఇందులో 10 వేల లీట‌ర్ల‌ను ఢిల్లీ పోలీసుల‌కు అంద‌జేశాయి. అలాగే డి.ఆర్.డి.ఓ 10,000 మాస్క్‌ల‌ను ఢిల్లీ పోలీసుల‌కు అందజేసింది. వ్య‌క్తిగ‌త ర‌క్ష‌ణ ప‌రిక‌రాలైన బాడీ సూట్లు, వెంటిలేట‌ర్లు వంటి వాటిని తయారు చేసేందుకు డిఆర్‌డిఓ కొన్ని ప్రైవేటు సంస్థ‌ల‌తో సంబంధాలు పెట్టుకుంటోంది.

ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీ బోర్డు కూడా శానిటైజ‌ర్లు, మ‌స్క్‌లు, బాడీ సూట్ల ఉత్ప‌త్తికి రంగంలోకి దిగింది. భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ కూడా వెంటిలేట‌ర్ల ఉత్ప‌త్తిలో నిమ‌గ్న‌మై ఉంది. మాల్దీవుల‌కు పంపిన
 ఆర్మీ వైద్య బృందాలు త‌మ కార్య‌క‌లాపాలను పూర్తి చేసుకుని తిరిగివ‌చ్చాయి. పొరుగున ఉన్న మిత్ర దేశాల‌లో అవ‌స‌ర‌మైన స‌హాయం అందించేందుకు ఆర్మీ వైద్య బృందాఉ, నౌకాద‌ళానికి చెందిన రెండు నౌక‌లు సిద్ధంగా ఉన్నాయి.
ర‌క్ష‌ణ‌మంత్రితో జ‌రిగిన స‌మావేశంలో ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్‌, ర‌క్ష‌ణ శాఖ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ అజ‌య్ కుమార్‌, నౌకాద‌ళ ప్ర‌ధానాధిప‌తి అడ్మిర‌ల్ క‌ర‌మ్‌వీర్ సింగ్‌, వైమానిక ద‌ళ ప్ర‌ధానాధిప‌తి ఎయిర్ ఛీఫ్ మార్ష‌ల్ ఆర్‌.కె.ఎస్ భ‌దౌరియా, సైనిక ద‌ళాల ప్ర‌ధానాధిప‌తి జ‌న‌ర‌ల్ ఎం.ఎం న‌రవానే, ర‌క్ష‌ణ  ఉత్ప‌త్తి కార్య‌ద‌ర్శి శ్రీ రాజ్ కుమార్ మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ విభాగం కార్య‌ద‌ర్శి శ్రీ‌మ‌తి  సంజీవ‌నీ కుట్టి, డి.ఆర్‌.డి.ఓ ఛైర్మ‌న్‌, ర‌క్ష‌ణ విభాగం  ప‌రిశోధ‌న‌,అభివృద్ధి కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ జి.స‌తీశ్ రెడ్డి పాల్గొన్నారు.



(Release ID: 1608357) Visitor Counter : 155