ప్రధాన మంత్రి కార్యాలయం

ఫార్మా పరిశ్రమ ప్రతినిధులతో ప్రధానమంత్రి సంప్రదింపులు

Posted On: 21 MAR 2020 7:13PM by PIB Hyderabad

కోవిడ్-19 పరీక్షలో ఉపయోగించే ఆర్ఎన్ఏ టెస్టింగ్ కిట్ లను యుద్ధప్రాతిపదికపై తయారుచేయాలని ఫార్మా పరిశ్రమకు ప్రధానమంత్రి పిలుపు
ఎపిఐల సరఫరాకు, వాటిని దేశంలోనే ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : ప్రధానమంత్రి
నిత్యావసర వస్తువులు తగినంతగా సరఫరా చేయడం, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్లను నిరోధించడం తప్పనిసరి :  ప్రధానమంత్రి 

ఫార్మా పరిశ్రమ ప్రతినిధులతో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సంప్రదింపులు జరిపారు.
కోవిడ్-19 విసురుతున్న సవాలుపై పోరాడడంలో ఫార్మా ఉత్పత్తిదారులు, పంపిణీదారులకు కీలకమైన పాత్ర ఉన్నదని ప్రధానమంత్రి అన్నారు. అత్యవసర ఔషధాలు, మెడికల్ కిట్లు, పరికరాల సరఫరా తగినంతగా ఉండేలా చూసే బాధ్యతే కాదు, సరికొత్త, అన్వేషణాత్మక పరిష్కారాల కోసం కృషి చేయాలని పరిశ్రమకు సూచించారు.
తగనంతగా యాక్టివ్ ఫార్మా ఇంగ్రెడియెంట్ల (ఎపిఐ) సరఫరాలు అందుబాటులో ఉంచి పరిశ్రమకు సహాయపడడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదంటూ ఎపిఐలు దేశంలోనే ఉత్పత్తి చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. అత్యంత ప్రాధాన్యం గల ఔషధాలు, పరికరాలు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం రూ.10 వేల కోట్లు, రూ.4 వేల కోట్ల విలువ గల రెండు స్కీమ్ లను ఆమోదించిందని ఆయన తెలిపారు.
కోవిడ్-19 పరీక్షలకు చాలా అవసరం అయిన ఆర్ఎన్ఏ డయాగ్నస్టిక్ కిట్లు యుద్ధ ప్రాతిపదికన తయారుచేసేందుకు కృషి చేయాలని ప్రధానమంత్రి ఫార్మా పరిశ్రమ యజమానులను కోరారు.
నిత్యావసర ఔషధాలన్నీ తగినంతగా సరఫరాలో ఉండేలా చూడాలని, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వ విషయంలో నిరంతర నిఘా పాటించాలని ఆయన ఔషధ రిటైలర్లను, ఫార్మసిస్టులను కోరారు. ఎక్కడ సాధ్యమైతే అయితే అక్కడ భారీ పరిమాణంలో ఔషధాల సరఫరాను నివారించాలని ప్రధానమంత్రి సూచించారు.
ఇలాంటి అత్యవసర సమయంలో పరిశ్రమ దీర్ఘ సమయం పాటు అవిశ్రాంతంగా పని చేయాల్సిన అవసరం ఉన్నదని చెబుతూ కార్మికశక్తి కొరత లేకుండా చూసుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. ఫార్మసీల వద్ద రద్దీని తగ్గించి సామాజిక దూరం పాటించేలా చూసేందుకు ఔషధాలను ఇళ్లకే సరఫరా చేసే అవకాశాలు పరిశీలించాలని, వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు డిజిటల్ చెల్లింపుల విధానం అనుసరించాలని కూడా సూచించారు.
సంక్షుభిత సమయంలో చక్కని నాయకత్వం ప్రదర్శిస్తున్నందుకు ఫార్మాస్యూటికల్స్ సంఘాలు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపాయి. అత్యవసర ఔషధాలు, పరికరాల సరఫరా తగినంతగా ఉండేలా చూసేందుకు తాము కట్టుబడి ఉన్నామని, అలాగే టీకా మందుల అభివృద్ధికి తాము కృషి చేస్తున్నామని అసోసియేషన్లు తెలియచేశాయి. ప్రభుత్వం ప్రకటించిన విధానపరమైన అంశాలు ఫార్మా రంగాన్ని ఎంతో ఉత్తేజితం చేస్తాయని వారన్నారు. 
పరిశ్రమ ప్రదర్శిస్తున్న కట్టుబాటును, ఎంతో ఉత్సాహంగా వారు పని చేస్తున్న తీరును ప్రధానమంత్రి ప్రశంసించారు. వారిపై ప్రజల్లో గల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని శాస్ర్తీయ సమాచారం అందరికీ అందించడంలో క్రియాశీలపైన పాత్ర పోషించాలని ఆయన సూచించారు.
ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత కృషిని ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శి సవివరంగా తెలియచేస్తూ సరఫరాలు తగినంతగా ఉండేలా చూసేందుకు విమానాశ్రయాలు, నౌకాశ్రయాల అధికారులతో సమన్వయపూర్వకంగా కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఇంతవరకు ఎక్కడా ఔషధాల సరఫరాల్లో కొరతను కనుగొనలేదంటూ అందుకు ఫార్మాస్యూటికల్స్ సంఘాలు ఆరోగ్య శాఖ కార్యదర్శి కృతజ్ఞతలు తెలిపారు. సంరక్షణకు అవసరం అయిన ఉత్పత్తులు తయారుచేస్తున్న పరిశ్రమ సంఘాలతో సమన్వయం గురించి కూడా ప్రస్తావించారు.
కేంద్ర షిప్పింగ్, రసాయనాలు, ఎరువుల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, కేబినెట్ కార్యదర్శి, ఆరోగ్యం, టెక్స్ టైల్, ఫార్మాస్యూటికల్స్ కార్యదర్శులు, ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్, భారత ఔషధ తయారీదారుల సంఘం, భారత ఫార్మా ఉత్పత్తిదారుల సంఘం, అఖిల భారత కెమిస్టులు, డ్రగ్గిస్టుల సంఘం, టోరెంట్ ఫార్మాస్యూటికల్స్, బల్క్ డ్రగ్ తయారీదారుల సంఘం, మెడికల్ డివైస్ పరిశ్రమ సంఘం ప్రతినిధులు ఈ గోష్ఠిలో పాల్గొన్నారు.(Release ID: 1607593) Visitor Counter : 126