ప్రధాన మంత్రి కార్యాలయం
భీతావహులు కావద్దని, అనవసర ప్రయాణాలు విరమించుకోవాలని ప్రజలకు ప్రధానమంత్రి పిలుపు
Posted On:
21 MAR 2020 7:33PM by PIB Hyderabad
తోటి పౌరులకు నిరంతరాయంగా సేవలందిస్తున్నందుకు ఐటి వృత్తి నిపుణులకు ప్రధానమంత్రి ప్రశంసలు
కోవిడ్-19 కారణంగా భీతావహులు కావద్దని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హోమ్ క్వారంటైన్ పాటించి ఇళ్లలోనే ఉండే ప్రతీ ఒక్కరూ డాక్టర్ల సలహాలు, సూచనలు పాటించాలని ఆయన సూచించారు.
ప్రధానమంత్రి వరుసగా ట్విట్టర్ సందేశాలు ఇస్తున్నారు. “ముందు జాగ్రత్త అంటే భీతిల్లిపోవడం కాదనే విషయం మరిచిపోకండి. ఇంట్లో ఉండడం ఒక్కటే కాదు, మీ పట్టణంలో లేదా నగరంలోనే ఉండిపోవడం. అనవసర ప్రయాణాలు మీకే కాదు, ఇతరులకు కూడా ఏమీ సహాయకారి కాదు. ఇలాంటి సమయంలో మనం చేసే ఏ చిన్న ప్రయత్నం అయినా అతి పెద్ద ప్రభావాన్ని చూపుతుంది” అని ఆయన ఉద్బోధించారు.
“డాక్టర్లు, అధికారులు ఇచ్చే సూచనలు వినాల్సిన సమయం ఇది. హోమ్ క్వారంటైన్ లో ఉండే ప్రతీ ఒక్కరూ ఆ ఆదేశాలు పాటించాలని నేను అందరినీ కోరుతున్నాను. ఇది మిమ్మల్నే కాదు, మీ స్నేహితులని, కుంటుంబాలని కూడా కాపాడుతుంది” అని ప్రధానమంత్రి అన్నారు.
తోటి పౌరులకు సేవలందించేందుకు ఐటి వృత్తినిపుణులు, ఉద్యోగులు చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ కోవిడ్-19పై పోరాటంలో వారు పోషిస్తున్న అసాధారణమైన పాత్ర రాబోయే ఎన్నో సంవత్సరాలు చిరస్థాయిగా గుర్తుండిపోతుందని అన్నారు.
ఈ మేరకు ఒక ట్వీట్ చేస్తూ “వారంతా హీరోలు. కొన్ని సంవత్సరాల పాటు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే అసాధారణ వ్యక్తులు” అని ప్రశంసించారు.
“నేను చెబుతున్నది నూటికి నూరుపాళ్లు నిజం. తోటి పౌరుల కోసం ఎంతో శ్రమతో నిరంతరాయంగా సేవలందిస్తున్న ఐటి వృత్తి నిపుణులను చూసి భారతదేశం అమితంగా గర్వపడుతుంది. కోవిడ్-19పై చేస్తున్న అతి పెద్ద పోరాటంలో ఈ ఇన్నోవేటర్లు, వృత్తినిపుణులు అతి పెద్ద పాత్ర కలిగి ఉన్నారు”. #IndiaFightsCorona
(Release ID: 1607586)
Visitor Counter : 165