ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

నవ్య కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)పై తీసుకున్న చర్యలుసహా నిరోధం-నియంత్రణ సన్నద్ధతపై డాక్టర్ హర్షవర్ధన్‌ సమీక్ష

“వైరస్‌ పీడిత అనుమానితుల పరిశీలన-వైద్య పరీక్షల కేంద్రాల్లో
పరిస్థితుల అంచనా, నిరంతర సమీక్షకు ప్రత్యేక బృందాల నియామకం’’

Posted On: 18 MAR 2020 3:24PM by PIB Hyderabad

   కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ ఇవాళ ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశాఖకు చెందిన సీనియర్‌ అధికారులుసహా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సఫ్దర్‌జంగ్‌, డాక్టర్‌ ఆర్‌ఎంఎల్‌, ఎయిమ్స్‌ ఆస్పత్రుల డైరెక్టర్లు తదితరులు ఇందులో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్రస్థాయులలోనే కాకుండా విదేశాల్లోని రాయబార కార్యాలయాల పరిధిలోనూ వివిధ మంత్రిత్వ శాఖల సమన్వయంతో తీసుకున్న అనేక చర్యల గురించి ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి వివరించారు. కోవిడ్‌-19 నిరోధం-నియంత్రణ దిశగా సమర్థ రీతిలో అనుమానితుల అన్వేషణ, నిఘాసహా రాష్ట్ర ప్రభుత్వాల సన్నద్ధత సంతృప్తికరంగా ఉందని ఆయన ప్రశంసించారు. ఆస్పత్రులలో ఔట్‌పేషెంట్‌ బ్లాకులు, పరీక్ష పరికరాలు, వ్యక్తిగత రక్షక సామగ్రి, మందులు, తగిన సంఖ్యలో ఏకాంత చికిత్స వార్డులు తదితరాలపై మంత్రి సమీక్షించారు. వీటన్నిటినీ తగిన పరిమాణంలో అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. విమానాశ్రయాలు, రేవులు తదితర ప్రదేశాల నుంచి తరలించిన వైరస్‌ పీడిత అనుమానితుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలు, ఇతర అవసరాల లభ్యతలపై డాక్టర్‌ హర్షవర్ధన్‌ విస్తృతంగా సమీక్షించారు. ఈ కేంద్రాల్లో పరిస్థితులపై నిరంతర అంచనా, సమీక్షకు ప్రత్యేక బృందాలను నియమించాలని ఆదేశించారు. సంక్షోభ నివారణలో సమాచార ఆదానప్రదానానికిగల ప్రాధాన్యాన్ని ఆయన నొక్కిచెప్పారు. కరోనా వైరస్‌ నిరోధం, నివారణ, అపోహల తొలగింపు, పరీక్ష సదుపాయాల కల్పన, పరిశీలన తదితరాలపై నిరంతరం దృష్టి సారించాలని సూచించారు.

****



(Release ID: 1607009) Visitor Counter : 144