ప్రధాన మంత్రి కార్యాలయం

దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి పరిధి లో కోవిడ్‌-19 నిరోధం పై సార్క్‌ దేశాల అధినేతల తో ప్రధాన మంత్రి సంభాషణ

సార్క్‌ సభ్యత్వ దేశాల కోసం ‘కోవిడ్‌-19 అత్యవసర నిధి’ ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన ప్రధాన మంత్రి

Posted On: 15 MAR 2020 6:58PM by PIB Hyderabad

ఎస్ఎఎఆర్ సి (సార్క్‌’) సభ్యత్వ దేశాల పరిధి లో కోవిడ్‌-19 వైరస్‌ నిరోధం పై ఉమ్మడి వ్యూహం రూపకల్పన దిశ గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయా దేశాల అధినేతల తో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సంభాషించారు.

ఉమ్మడి చరిత్ర సమష్టి భవిష్యత్తు

 

ఈ గోష్ఠి కి పిలుపు నివ్వగా స్వల్ప వ్యవధిలోనే అధినేతలంతా చర్చ లో భాగస్వాములు కావడం పై ప్రధాన మంత్రి శ్రీ మోదీ ముందు గా వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.  సార్క్‌ ప్రాంతీయ సమాజాల నడుమ అంతర్గత అనుసంధానం, ప్రాచీన కాలం నుండి ప్రజల మధ్య సంబంధాల ను ఈ సందర్భం లో ప్రస్తావిస్తూ, కరోనా సవాలు ను ఉమ్మడి గా ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన నొక్కి వక్కాణించారు.

 

ముందున్న మార్గం

సమష్టి స్ఫూర్తి తో అన్ని దేశాల స్వచ్ఛంద భాగస్వామం తో కోవిడ్‌ -19 అత్యవసర నిధిని ఏర్పాటు చేద్దామని ప్రధాన మంత్రి శ్రీ మోదీ ప్రతిపాదించారు.  ఇందుకోసం భారతదేశం పక్షాన 10 మిలియన్ యుఎస్ డాలర్ ఆరంభిక విరాళాన్ని ఆయన ప్రకటించారు.  ఈ విధం గా సమకూరిన నిధి నుండి ఏ భాగస్వామ్య దేశం అయినా తక్షణ కార్యాచరణ వ్యయం నిమిత్తం సొమ్ము ను వాడుకోవచ్చని ఆయన వివరించారు.  అలాగే వైద్యులు, ఇతర నిపుణుల తో కూడిన సత్వర ప్రతిస్పందన బృందాన్నిఏర్పాటు చేసి, పరీక్ష పరికరాలు సహా అవసరమైన సందర్భాల లో వాడుకొనేందుకు వీలు గా సంబంధిత ఇతర ఉపకరణాల ను కూడా ఆయా దేశాలకు భారతదేశం అందుబాటు లో ఉంచుతుందని ప్రకటించారు.

 

పొరుగు దేశాల సత్వర ప్రతిస్పందన బృందాల కు శిక్షణ కోసం ఆన్‌ లైన్‌ శిక్షణ విభాగాల ను కూడా ఏర్పాటు చేస్తామని ప్రధాన మంత్రి హామీనిచ్చారు.  భారత దేశాని కి చెందిన సమీకృత వ్యాధి నిఘా పోర్టల్‌ సంబంధి సాఫ్ట్‌వేర్‌ పరిజ్ఞానాన్ని పంచుకొంటామని తెలిపారు.  తద్వారా కరోనా వైరస్‌ సోకిన వారితో పాటు వారి ని కలుసుకొన్న ఇతరుల కు కూడా పరీక్ష లు నిర్వహించేందుకు తోడ్పడతామని తెలిపారు.  అంతే కాకుండా సార్క్‌ విపత్తుల నిర్వహణ కేంద్రం వంటి ప్రస్తుత వ్యవస్థల ను ఉత్తమ పద్ధతుల తో సామూహిక కార్యాచరణ కు వాడుకోవచ్చునని ఆయన సూచించారు.

 

దక్షిణాసియా ప్రాంతం లో సాంక్రామిక వ్యాధుల నియంత్రణ పై సమన్వయం కోసం ఉమ్మడి పరిశోధన వేదిక ను సృష్టిద్దామని ఆయన ప్రతిపాదించారు.  కోవిడ్‌-19 ప్రభావిత దీర్ఘకాలిక ఆర్థిక పరిణామాల పై నిపుణుల తో మేథోమధనం అవసరమని కూడా సూచించారు.  దీని ప్రభావం నుండి అంతర్గత వాణిజ్యం, విలువ శృంఖలాల కు అత్యుత్తమ రక్షణ కవచం రూపకల్పన పై చర్చిద్దామన్నారు.

 

ప్రధాన మంత్రి ప్రతిపాదిత వినూత్న చర్యల కు సార్క్‌ దేశాల నేత లు ధన్యవాదాలు తెలిపారు.  సంయుక్త పోరాటం పై భారతదేశం యొక్క దృఢ సంకల్పాన్ని ప్రకటిస్తూ- సార్క్‌ దేశాల నడుమ ఇరుగు పొరుగు సహకారం ప్రపంచాని కి ఆదర్శం కావాలని ఈ సందర్భం గా ప్రధాన మంత్రి అన్నారు.

 

అనుభవాల ఆదాన ప్రదానం

 “సన్నద్ధమవుదాం... భయపడొద్దుఅన్నదే భారత ప్రభుత్వం అనుసరిస్తున్న తారకమంత్రమని ప్రధాన మంత్రి చెప్పారు. తదనుగుణం గా ప్రభుత్వం ఇప్పటి దాకా తీసుకున్న చురుకైన చర్యల గురించి వివరించారు.  ఆ మేరకు అంచెలవారీ యంత్రాంగం, దేశం లో ప్రవేశించే వారికి సునిశిత వైద్య పరీక్షలు, ప్రసార- ప్రచురణ, సామాజిక మాధ్యమాల లో ప్రజల కు అవగాహన కార్యక్రమాలు, దుర్బల వర్గాల కు చేరువ గా సేవ లు, రోగ నిర్ధరణ సదుపాయాల సమీకరణ, ప్రపంచ ప్రపంచ వ్యాప్త వ్యాధి ని ప్రతి దశలోనూ నిలువరించే ప్రత్యేక విధానాల రూపకల్పన వంటి అనేక చర్యల ను తీసుకొన్నామని వివరించారు.

 

ఈ చర్యల లో భాగం గా వివిధ దేశాల నుండి 1,400 మంది భారతీయుల ను విజయవంతం గా స్వదేశం తీసుకురావడమే కాకుండా పొరుగు కు ప్రాధాన్యంఅనే తమ విధానం ప్రకారం.. పొరుగు దేశాల పౌరుల లో కొందరి ని కూడా వ్యాధి పీడిత దేశాల నుండి తరలించినట్లు తెలిపారు.

 

ఇరాన్‌ తో సార్వత్రిక సరిహద్దు వల్ల తమ దేశం అత్యంత ప్రమాదకర స్థితి లో ఉందని అఫ్గానిస్తాన్‌ అధ్యక్షుడు శ్రీ అశ్ రఫ్‌ గనీ తెలిపారు.  మోడలింగ్ వ్యాప్తి నమూనా లు, టెలిమెడిసిన్ ల కోసం సాధారణ చట్రాన్ని రూపొందించడం మరియు పొరుగు దేశాల మధ్య ఎక్కువ సహకారం అనే ప్రతిపాదనల ను ఆయన ప్రస్తావించారు.  వ్యాధి వ్యాప్తి పై నమూనాల రూపకల్పన, ఉమ్మడి దూర వైద్యం కోసం ఒక చట్రాన్ని సృష్టించడం, ఇరుగు పొరుగు దేశాల మధ్య మరింత సహకారం పై దృష్టి సారించాలని ఆయన సూచించారు.

 

కోవిడ్‌-19 పీడితుల కు చికిత్స, వ్యాధి నియంత్రణ లకు వైద్యసహాయం తో పాటు వుహాన్‌ నగరం నుండి తమ 9 మంది పౌరుల తరలింపు లో భారత ప్రభుత్వం తీసుకొన్న చొరవ కు మాల్దీవ్స్‌ అధ్యక్షుడు శ్రీ ఇబ్రహీం మొహమ్మద్‌ సోలిహ్ కృతజ్ఞత లు తెలిపారు. పర్యాటక రంగం పై కోవిడ్‌-19 ప్రతికూల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ పై ఎంతటి దుష్ప్రభావాన్ని చూపిందో ఆయన ప్రముఖం గా వివరించారు. సార్క్‌ దేశాల అత్యవసర ఆరోగ్య సేవాసంస్థ ల మధ్య సహకారం మరింత సన్నిహితం కావాలని ఆయన ప్రతిపాదించారు.  అదేవిధం గా ఈ ప్రాంతం కోలుకొనేందుకు తగిన దీర్ఘకాలిక ప్రణాళిక సహా ఆర్థిక సహాయ ప్యాకేజీ కి రూపకల్పన చేయాలని కోరారు.

ఈ కష్టకాలం లో ఆర్థిక వ్యవస్థ లు ఒడుదొడుకుల ను అధిగమించే విధంగా సార్క్‌ దేశాల అధినేత లు సమష్టి గా కృషి చేయాలని శ్రీలంక అధ్యక్షుడు శ్రీ గోటాబాయా రాజపక్షే సిఫారసు చేశారు.  కోవిడ్‌-19 నిరోధం, నియంత్రణ లలో ఈ ప్రాంతం లోని ఉత్తమాచరణల ను, ప్రాంతీయాంశాల ను సమన్వయం చేసుకోవాలని కూడా ఆయన సూచించారు.

 

వుహాన్‌ నగరం లో వ్యాధి నిరోధక శిబిరాల లో చికిత్స పొందుతున్న భారతీయుల తో పాటు తమ దేశాని కి చెందిన 23 మంది విద్యార్థుల ను స్వదేశాని కి చేర్చడం పై భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి బాంగ్లాదేశ్‌ ప్రధాని శేఖ్ హసీనా కృతజ్ఞత లు తెలిపారు. ఈ ప్రాంత దేశాల ఆరోగ్య శాఖ మంత్రులు, కార్యదర్శుల మధ్య వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సాంకేతిక స్థాయి లో చర్చ లు కొనసాగించాలని ఆమె ప్రతిపాదించారు.

 

కోవిడ్‌-19 నియంత్రణకు తమ దేశంలో తీసుకొన్న చర్యల గురించి నేపాల్‌ ప్రధాని శ్రీ కె.పి.శర్మ ఓలీ వివరించారు.  ఈ ప్రపంచ మహమ్మారి నిరోధం- నియంత్రణ కోసం చురుకైన, సమర్థ వ్యూహం రూపకల్పన కు సార్క్‌ దేశాల సమష్టి విజ్ఞానాన్ని, సామూహిక  కృషి ని జోడించాలని ఆయన చెప్పారు.

 

ఈ ప్రపంచ మహమ్మారికి దేశాల భౌగోళిక సరిహద్దులతో నిమిత్తం లేదని, అందువల్ల అన్ని దేశాలూ కలసికట్టుగా దాన్ని ఎదుర్కోవాలని భూటాన్‌ ప్రధానమంత్రి డాక్టర్‌ లోటే శెరింగ్‌ పిలుపునిచ్చారు.  కోవిడ్‌-19 చూపగల ఆర్థిక దుష్ర్పభావాన్ని గురించి మాట్లాడుతూ- చిన్న, దుర్బల దేశాల ఆర్థిక వ్యవస్థల పై ఈ ప్రపంచ మహమ్మారి ప్రభావం వివిధ రకాలు గా ఉంటుందని ఆయన వివరించారు.

 

ఆరోగ్య సమాచారం, గణాంకాల తక్షణ ఆదాన ప్రదానం సహా సమన్వయం కోసం జాతీయ ప్రాధికార సంస్థల తో కార్యాచరణ బృందం ఏర్పాటు కు సార్క్ సచివాలయాని కి ఆదేశాలు ఇవ్వాలని పాకిస్తాన్‌ ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్‌ జఫర్‌ మీర్జా ప్రతిపాదించారు.  అలాగే కరోనా వైరస్‌ వ్యాధి పై నిఘా సంబంధిత సమాచార ఆదాన ప్రదానం కోసం ప్రాంతీయ వ్యవస్థ ల రూపకల్పన తో పాటు సార్క్‌ దేశాల ఆరోగ్య శాఖ మంత్రుల స్థాయి సదస్సు ను కూడా నిర్వహించాలని ఆయన ప్రతిపాదించారు.

**

 



(Release ID: 1606634) Visitor Counter : 245