మంత్రిమండలి

వృత్తిగత భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల స్మృతి బిల్లు-2019కి కేంద్ర మంత్రిమండలి ఆమోదం

కొత్త స్మృతి పరిధిలోకి 13 కేంద్ర కార్మిక చట్టాలు

Posted On: 10 JUL 2019 6:04PM by PIB Hyderabad

  ‘‘అందరి తోడ్పాటుతో... అందరి అభివృద్ధి- అందరి విశ్వాసం’’ స్ఫూర్తికి అనుగుణంగా సమాజంలోని అన్నివర్గాల ప్రజల ప్రయోజనార్థం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిరంతర శ్రమిస్తోంది.  ఇందులో భాగంగా వృత్తిగత భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల స్మృతి బిల్లు-2019ను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంవల్ల ఇప్పటి నేపథ్యంతో పోలిస్తే భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులకు సంబంధించి ప్రతిపాదిత నిబంధనల పరిధి బహుళంగా విస్తరిస్తుంది.

దిగువ పేర్కొన్న 13 కేంద్ర కార్మికచట్టాల క్రోడీకరణ, సరళీకరణ, హేతుబద్ధీకరణ అనంతరం కొత్త స్మృతి ముసాయిదా రూపొందింది. ఆ మేరకు...:

•    ఫ్యాక్టరీల చట్టం-1948;

•    గనుల చట్టం-1952; రేవు కార్మికుల (భద్రత, ఆరోగ్యం, సంక్షేమం) చట్టం-1986;

•    భవనాలు, ఇతర నిర్మాణ కార్మికుల (ఉపాధి, పని పరిస్థితుల నియంత్రణ) చట్టం-1996;

•    తోటల కార్మికుల చట్టం-1951;

•    కాంట్రాక్టు కార్మికుల (నియంత్రణ-రద్దు) చట్టం-1970;

•    అంతర్రాష్ట్ర కార్మిక వలసల (ఉపాధి, పని పరిస్థితుల నియంత్రణ) చట్టం-1979;

•    వార్తా పత్రికల సిబ్బంది, పాత్రికేయుల (పని పరిస్థితులు, వగైరాల నిబంధనల) చట్టం-1955;
•    పాత్రికేయుల (వేతన నిర్ణయ) చట్టం-1958;

•    మోటారు రవాణారంగ కార్మికుల చట్టం-1961;

•    అమ్మకాల ప్రచార సిబ్బంది (పని పరిస్థితుల) చట్టం-1976;

•    బీడీ-చుట్ట తయారీ కార్మికుల (ఉపాధి పరిస్థితుల నియంత్రణ) చట్టం-1966;

•    చిత్ర పరిశ్రమ, థియేటర్ కార్మికుల చట్టం-1981; తదితరాలు కొత్త స్మృతి అమలులోకి వచ్చిన తర్వాత రద్దు కావడంతోపాటు అందులో భాగమైపోతాయి.

ప్రయోజనాలు:
     
•    కార్మికుల జీవన శ్రేయస్సు కోసమే కాకుండా దేశ ఆర్థిక వృద్ధి రీత్యా వారికి మెరుగైన పని పరిస్థితులు, భద్రత, ఆరోగ్యం, సంక్షేమం తప్పనిసరి. అంతేకాకుండా ఆరోగ్యకర కార్మికశక్తి దేశంలో మరింత ఉత్పాదకతకు దోహదపడటంతోపాటు అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాల సంఖ్య కనీస స్థాయికి పరిమితం కాగలదు. దీనివల్ల యాజమాన్యాలకూ ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. ఈ నేపథ్యంలో దేశ కార్మికశక్తి మొత్తానికీ భద్రత, ఆరోగ్యకర పని పరిస్థితులు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా 9 ప్రధాన రంగాల్లో 10 మంది అంతకన్నా ఎక్కువ సంఖ్యలో కార్మికులున్న అన్ని సంస్థల్లోనూ కార్మిక భద్రత, ఆరోగ్యం, సంక్షేమం, పని పరిస్థితులు కొత్త స్మృతి పరిధిలోకి వస్తాయి.

***
 



(Release ID: 1578421) Visitor Counter : 407