మంత్రిమండలి

భార‌త‌దేశానికి, మొరాకో కు మ‌ధ్య వైమానిక సేవ‌ల ఒప్పందం పై సంత‌కాల‌కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం.

Posted On: 29 AUG 2018 1:32PM by PIB Hyderabad

భార‌త‌దేశానికి, మొరాకో కు మ‌ధ్య స‌వ‌రించిన‌టువంటి వైమానిక సేవ‌ల ఒప్పందానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ వహించిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.  నూత‌న వైమానిక సేవ‌ల ఒప్పందం అందుబాటు లోకి వ‌చ్చిన తరువాత, ప్రస్తుతం అమ‌లులో ఉన్న‌ 2004 డిసెంబ‌ర్ నాటి ఒప్పందం ర‌ద్ద‌ు అవుతుంది.

ప్ర‌యోజ‌నాలు:

ఈ వైమానిక సేవ‌ల ఒప్పందం (ఎఎస్ఎ) భార‌త‌దేశానికి, మొరాకో కు మ‌ధ్య పౌర విమాన‌యాన సంబంధాల‌లో ఒక ముఖ్య‌మైన మైలురాయి ని సూచిస్తోంది.  ఉభ‌య దేశాల మ‌ధ్య వ్యాపారాన్ని, పెట్టుబ‌డులను, ప‌ర్యట‌న బృందాలు, సాంస్కృతిక బృందాల రాక‌పోక‌ల‌ను మరింత వ‌ర్ధిల్లజేసే సామ‌ర్ధ్యం ఈ ఒప్పందానికి ఉంది.  ఇది ఇరు ప‌క్షాల‌కు చెందిన విమాన సంస్థ‌ల‌కు వాణిజ్య‌ప‌ర‌మైన అవ‌కాశాల‌ను సమ‌కూరుస్తూ వాటికి ఇతోధిక భ‌ద్ర‌త‌ ను, ర‌క్ష‌ణ‌ ను అందిస్తుంది; అలాగే నిరంత‌రాయ సంధానానికి త‌గిన వాతావ‌ర‌ణాన్ని కూడా ఏర్ప‌రుస్తుంది.
 
వివ‌రాలు:

ఒప్పందం లోని ప్ర‌ధాన అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

i)          ప్ర‌తి ఒక్క ప‌క్షం బ‌హుళ విమాన సంస్థ‌ ల‌ను నియోగించవచ్చును;

ii)         ప్ర‌తి ఒక్క ప‌క్షం లోని నిర్దేశిత విమాన సంస్థ అదే ప‌క్షం లోని ఇత‌ర నిర్దేశిత విమాన సంస్థ‌ ల‌తోను, అవ‌త‌లి ప‌క్షం లో నిర్దేశిత విమాన సంస్థ‌ల  తోను మ‌రియు మూడో ప‌క్షానికి చెందిన నిర్దేశిత విమాన సంస్థ‌ల‌ తోను స‌హ‌కార పూర్వ‌క మార్కెటింగ్ ఏర్పాట్ల‌ను కుదుర్చుకోవచ్చు;

iii)        ఉభ‌య ప‌క్షాల నిర్దేశిత విమాన సంస్థ‌ల‌కు వైమానిక సేవ‌ల ప్రోత్సాహానికి మ‌రియు విక్ర‌యానికి గాను అవ‌త‌లి దేశం లో  కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేసేందుకు వీలు కల్పిస్తుంది;

iv)        రెండు దేశాల‌లోని నిర్దేశిత విమాన సంస్థ‌లు ఎఎస్ఎ లోని రూట్ షెడ్యూల్ లో పేర్కొన్న ఆరు కేంద్రాల‌కు/ఆరు కేంద్రాల నుండి ఎన్ని స‌ర్వీసుల‌ నైనా న‌డపవచ్చు.  ఆ ఆరు కేంద్రాలలో మొరాకో లోని కాసాబ్లాంకా, రాబ‌త్‌, మ‌రాకేశ్‌, అగాదీర్, ఇంకా ఫెజ్, భార‌త‌దేశం లోని న్యూ ఢిల్లీ, ముంబ‌యి, కోల్‌క‌త్తా, చెన్నై, బెంగ‌ళూరు మ‌రియు హైద‌రాబాద్ ఉన్నాయి.  భారత్, మొరాకో ల లోని నిర్దేశిత విమాన సంస్థ‌లు ఈ నగరాలకు/ ఈ నగరాల నుండి ఎన్ని స‌ర్వీసుల‌నైనా న‌డిపేందుకు అవ‌కాశం ఉంటుంది.

v)         ఈ వైమానిక సేవ‌ల ఒప్పందం లో కూడా- భార‌త‌దేశ న‌మూనా ఎఎస్ఎ లో పేర్కొన్న‌ట్లుగా అంగీకారం కుదిరిన మేర‌కు సేవ‌ల నిర్వ‌హ‌ణ‌, వాణిజ్య అవ‌కాశాలు, ర‌క్ష‌ణ కు, భ‌ద్ర‌త కు సంబంధించిన క్లాజుల సంబంధిత సూత్రాలు, ఆపరేటింగ్ ఆథరైజేశన్ యొక్క సస్పెన్షన్ లేదా రద్దు  తాలూకు నిబంధ‌న‌లు-  పొందుప‌ర‌చబ‌డ్డాయి.

పూర్వ‌రంగం:

పౌర విమాన‌యాన రంగం లో వృద్ధి ని దృష్టి లో పెట్టుకొని రెండు సార్వ‌భౌమ దేశాల న‌డుమ నిరంత‌రాయ వైమానిక సంధానాన్ని ఆధునికీకరించ‌డానికి, మెరుగుప‌ర‌చ‌డానికి ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న‌టువంటి వైమానిక సేవ‌ల ఒప్పందాన్ని తాజాప‌ర‌చ‌డ‌ం జరిగింది. 

భార‌త‌దేశానికి, మొరాకో కు మ‌ధ్య ఇప్పుడు అమ‌లు లో ఉన్నటువంటి వైమానిక సేవ‌ల ఒప్పంద పత్రం పైన 2004వ సంవ‌త్స‌రంలో  సంత‌కాల‌య్యాయి.  ఈ ఒప్పందం లో ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌, విమాన సంస్థ‌ల నిర్దేశం, వాణిజ్య స‌ర‌ళి కార్య‌క‌లాపాలు, టారిఫ్ లు త‌దిత‌ర అంశాల పై న‌వీక‌రించిన క్లాజులంటూ లేవు.  అదీకాక‌, ఇరు ప‌క్షాలు వాటి వాటి విమానాల విష‌యం లో కోడ్ శేర్ ను నెల‌కొల్పుకోవ‌డానికి అనువైన స‌హ‌కార పూర్వ‌క మార్కెటింగ్ స‌ర్దుబాటు తాలూకు నిబంధ‌న‌లు, అలాగే మూడో దేశానికి చెందిన విమాన సంస్థ‌ల తాలూకు కోడ్ శేర్ ప్ర‌స్తుత వైమానిక సేవ‌ల ఒప్పందం లో చోటు చేసుకోలేదు.


**



(Release ID: 1544603) Visitor Counter : 75