ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి తో సమావేశమైన సందర్భంగా తమ విజయగాథ లను వెల్లడించిన ప్రధాన మంత్రి ముద్ర యోజన లబ్ధిదారులు
Posted On:
11 APR 2018 7:40PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 100 కు పైగా ప్రధాన మంత్రి ముద్ర యోజన లబ్ధిదారులు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని ఆయన నివాసంలో ఈ రోజు కలుసుకొన్నారు.
శ్రీ నరేంద్ర మోదీ తో ఇష్టాగోష్ఠి గా జరిగిన సమావేశ క్రమం లో లబ్ధిదారులలో పలువురు వారికి మంజూరైన ముద్ర రుణాలను వినియోగించుకోవడం ద్వారా వారి యొక్క జీవితాలు ఏ విధంగా మెరుగుపడ్డాయో వివరించారు.
ఝార్ ఖండ్ లోని బొకారో కు చెందిన ఒక లబ్ధిదారు కిరణ్ కుమారి 2 లక్షల రూపాయల రుణాన్ని అందుకొన్నారు. ఆమె తాను బొమ్మలు మరియు బహుమతుల దుకాణాన్ని ఎలా మొదలుపెట్టిందీ చెప్పుకొచ్చారు. అంతక్రితం ఆమె, ఆమె భర్త తోపుడు బండ్ల మీద బొమ్మలు అమ్ముతూ వారి జీవనోపాధి ని ఆర్జించుకొనే వారు. రుణాన్ని అందుకొన్న తరువాత ఆమె స్వంతంగా ఒక సఫలీకృతురాలైన నవ పారిశ్రామికవేత్త కాగలిగారు.
సూరత్ నుండి వచ్చిన మునీరా బాను శబ్బీర్ హుస్సేన్ మాలిక్ 1.77 లక్షల రూపాయలను ముద్ర రుణం గా అందుకొన్నారు. ఆమె ఎల్ఎమ్‌వి ని నడపడంలో శిక్షణ ను పొంది, ప్రస్తుతం ఒక ఆటో రిక్షా ను నడుపుతూ ప్రతి నెలా 25,000 రూపాయలను ఆర్జిస్తున్నట్లు తెలియజేశారు.
కేరళ లోని కణ్ణూర్ కు చెందిన శ్రీ శిజేశ్. పి ఎనిమిది సంవత్సరాల పాటు విదేశాలలో పని చేశారు. భారతదేశానికి తిరిగి వచ్చిన అనంతరం ఆయన ఒక వైద్య విభాగంలో సేల్స్ మేనేజర్ గా సేవలు అందించారు. 8.55 లక్షల రూపాయల ముద్ర రుణాన్ని పొంది హెర్బల్ టూత్ పౌడర్ ను ఉత్పత్తి చేసే ఒక విభాగాన్ని తాను స్వయంగా ఏర్పాటు చేశానని ఆయన ఎంతో ఉత్సాహంతో ప్రధాన మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. కొన్ని నమూనాలను సైతం ఆయన ప్రధాన మంత్రి ఇచ్చారు.
తెలంగాణ నుండి వచ్చిన శ్రీ సాలెహుండం గిరిధర్ రావు తాను ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఏ విధంగా మారిందీ ప్రధాన మంత్రి కి వివరించారు. 9.10 లక్షల రూపాయల రుణాన్ని అందుకొని, దానిని తన డై కాస్టింగ్ అండ్ మౌల్డ్స్ సంస్థ యొక్క ఎదుగుదలకు వినియోగించినట్టు ఆయన తెలిపారు.
జమ్ము- కశ్మీర్ లోని కథువా జిల్లా వాసి వీణా దేవి ఒక చేనేత కార్మికురాలు. ఆమె 1 లక్షల రూపాయలు ముద్ర రుణం రూపంలో స్వీకరించారు. ఆమె ప్రస్తుతం తాను నివసిస్తున్న ప్రాంతం లో పశ్‌మినా శాలువల తయారీకి పేరు పొందిన సంస్థలలో ఒక సంస్థకు నిర్వాహకురాలుగా ఉన్నారు. ఆమె ప్రధాన మంత్రి కి ఒక పశ్‌మినా శాలువ ను అందజేశారు.
దెహ్ రాదూన్ నుండి తరలి వచ్చిన శ్రీ రాజేంద్ర సింగ్ ఒక మాజీ సైనికోద్యోగి. చీపురు కట్టలను తయారు చేసి, రిటైల్ విక్రేతలకు సరఫరా చేస్తున్నానని ఆయన ప్రధాన మంత్రి తో చెప్పారు. 5 లక్షల రూపాయల ముద్ర రుణం స్వీకరించి తాను ఈ వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోగలిగానని ఆయన తెలిపారు. ఈ వ్యాపారాన్ని ఏర్పాటు చేయడంలో తాను సఫలీకృతం కావడంతో పాటు మరికొందరికి సైతం ఉద్యోగాలను కల్పించినట్లు ఆయన చెప్పారు.
చెన్నై నివాసి శ్రీ టి.ఆర్. సజీవన్ 10 లక్షల రూపాయల ముద్ర రుణాన్ని అందుకొన్నారు. లోహాలు కరిగించి పోత పోసే కర్మాగారాలకు అవసరమైన పనులు చేసి పెడుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
జమ్ము కు చెందిన శ్రీ సతీశ్ కుమార్ 5 లక్షల రూపాయల రుణాన్ని స్వీకరించారు. ఆయనకు అంతక్రితం ఉద్యోగమంటూ ఏదీ లేదు. ప్రస్తుతం ఆయన ఉక్కు ఉత్పత్తులను తయారు చేసి, వాటితో వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన తన అనుభవాలను గురించి ప్రధాన మంత్రి సమక్షంలో వివరించారు.
ఉత్తరాఖండ్ లో ఉధాం సింహ్ నగర్ నుండి వచ్చిన శ్రీ విప్లవ్ సింహ్ ఒక ఔషధాల సంస్థలో పని చేసే వారు. అయితే, తనకంటూ ఒక సొంత వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన సంకల్పించారు. 5 లక్షల రూపాయల విలువైన ముద్ర రుణం సహాయంతో ఆయన పురుగు మందులు మరియు ఎరువుల అమ్మకం తాలూకు వ్యాపారాన్ని సొంతంగా ఆరంభించుకోగలిగారు. ప్రస్తుతం మరికొంత మంది వ్యక్తులకూ ఉద్యోగాలు కల్పించ గలిగారు. ఆయన తనకు ఎదురైన అనుభావాలను గురించి ప్రధాన మంత్రి కి వివరించారు.
ఇంకా పలువురు లబ్ధిదారులు కూడా వారి వారి అనుభవాలను వెల్లడించారు.
ముద్ర రుణాలను చక్కగా ఉపయోగించుకొన్న నవ పారిశ్రామికవేత్తల కృషిని ప్రధాన మంత్రి ప్రశంసించారు. ఇంతవరకు 11 కోట్ల మంది ప్రధాన మంత్రి ముద్ర యోజన నుండి ప్రయోజనం పొందినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడం కూడా ఈ పథకం లక్ష్యాలలో ఒకటి అని ఆయన చెప్పారు. ఇంతవరకు ఉపాధి కల్పన అనేది అయితే ప్రభుత్వ రంగంలో, లేదా ప్రైవేటు రంగంలో జరుగుతుందన్న ఒక సంప్రదాయబద్ధ ఆలోచన ధోరణి అంటూ ఉండేదని, ఈ పథకం ‘‘వ్యక్తిగత రంగం’’ జీవనోపాధి మరియు స్వతంత్రోపాధి మార్గంగా అభివృద్ధి చెందడంలో తోడ్పాటు ను అందించిందని ఆయన వివరించారు.
ప్రధాన మంత్రికి మరియు లబ్ధిదారులకు మధ్య ఇష్టాగోష్టి సమావేశం గంట సేపటికి పైగా కొనసాగింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రులు శ్రీ పొన్ రాధాకృష్ణన్, శ్రీ శివ్ ప్రతాప్ శుక్లా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు.
***
(Release ID: 1528832)
Visitor Counter : 83