నాడు పోస్టు చేయడమైనది:
27 NOV 2026 1:58PM by PIB Hyderabad
వారణాసిలో 2026 నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరకు నిర్వహించే కాశీ తమిళ సంగమం (కేటీఎస్) అయిదో సంచికను ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ ప్రారంభిస్తారు. ముగింపు కార్యక్రమానికి రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ హాజరవుతారు. తమిళనాడు, కాశీ మధ్య ఉన్న శతాబ్దాల నాటి సాంస్కృతిక, భాషా, నాగరిక సంబంధాల వేడుకలో 1,400 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది రెండు ప్రాంతాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తిని పెంపొందించడానికి కృషి చేస్తుంది. తమిళ సాహిత్యంలో సుప్రసిద్ధమైన తిరుక్కురళ్ అందించే జ్ఞానాన్ని, నైతిక బోధనలను ఈ అయిదో సంచిక ఘనంగా చాటిచెప్పనుంది.
ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఉన్నత విద్యా విభాగం నిర్వహిస్తోంది. ఐఐటీ మద్రాస్, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ (సీఐసీటీ), ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఇతర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వశాఖలు సహకారం అందిస్తున్నాయి.
కేటీఎస్ 5.0 ఇతివృత్తం – ‘‘తిరుక్కురళ్ పయిల్వోమ్ – తిరుక్కురళ్ అభ్యాస్ కరేన్’’
‘‘తిరుక్కురళ్ పయిల్వోమ్ – తిరుక్కురళ్ అభ్యాస్ కరేన్’’ ఇతివృత్తంతో కాశీ తమిళ సంగమం 5.0ను నిర్వహిస్తున్నారు. అంటే ‘‘మనం తిరుక్కురళ్ నేర్చుకుందాం’’ అని అర్థం. తిరుక్కురళ్ అందించే జ్ఞానంపై ప్రధానంగా విద్యార్థులు, యువతలో అవగాహన పెంపొందించడంతో పాటు, మన దేశ సుసంపన్నమైన సాహిత్య సంప్రదాయాలు, చిరకాల సాంస్కృతిక వారసత్వం పట్ల ఆసక్తిని ప్రోత్సహించడంపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది.
ప్రముఖ తమిళ కవి, తత్వవేత్త అయిన తిరువళ్లువర్ రచించిన తిరుక్కురళ్ తమిళ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయిన గ్రంథాల్లో ఒకటి. ఇది తరతరాలుగా మానవాళికి మార్గదర్శనం చేస్తోంది. నైతికత, పరిపాలన, మానవ సంబంధాలు, కరుణ, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని ఈ గ్రంథంలోని 1,330 ద్విపదులు వివరిస్తాయి. ఈ గ్రంథాన్ని అరమ్ (ధర్మం), పొరుళ్ (సంపద), ఇన్బమ్ (ప్రేమ) అనే మూడు భాగాలుగా విభజించారు. ఇవి సత్ప్రవర్తన, సామాజిక, రాజకీయ జీవితం, మానవ సంబంధాల సూత్రాలను తెలియజేస్తాయి.
ప్రతినిధులు, పర్యటన వివరాలు
తమిళనాడు నుంచి దాదాపు 1,400 మంది ఏడు బృందాలుగా ఏర్పడి ఎనిమిది రోజుల పాటు పర్యటిస్తారు. ఒక్కో బృందంలోనూ సుమారుగా 200 మంది చొప్పున ఉంటారు. దీనిలో నాలుగు రోజులను ప్రయాణానికి, మరో నాలుగు రోజులను వివిధ ప్రాంతాల సందర్శనలు, ప్రత్యేక కార్యక్రమాలకు కేటాయించారు. పర్యటనలో భాగంగా వారణాసి, ప్రయాగరాజ్, అయోధ్యను సందర్శిస్తారు. సాంస్కృతికపరమైన, విద్యాపరమైన, నిర్దేశిత రంగాలకు చెందిన, ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఈ ప్రతినిధులను ఏడు విభాగాలుగా విభజించారు.
• విద్యార్థులు
• ఉపాధ్యాయులు
• రచయితలు, పాత్రికేయులు
• వ్యవసాయం, అనుబంధ రంగాలు
• నిపుణులు, కళాకారులు
• మహిళలు
• ఆధ్యాత్మికవేత్తలు
వారణాసి పర్యటనలో భాగంగా కాశీ విశ్వనాథ ఆలయం, రామ్‌నగర్ కోట, భారత్ మాత ఆలయంతో సహా ప్రముఖ ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను ప్రతినిధులు సందర్శిస్తారు. వీరి పర్యటనలో గంగా హారతి, గంగా స్నానం, విద్యా సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఆ తర్వాత ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం, అయోధ్యలోని శ్రీరామ ఆలయాన్ని సందర్శిస్తారు.
ప్రత్యేక తమిళ వారసత్వ పర్యటనలో భాగంగా లిటిల్ తమిళనాడులో ఉన్న మహాకవి సుబ్రమణ్య భారతి పూర్వీకుల నివాసం, కేదార్ ఘాట్, కాశీ మఠానికి ప్రతినిధులను తీసుకెళ్తారు. దీంతో పాటు బీహెచ్‌యూలోని తమిళ విభాగంలో విద్యాపరమైన చర్చను నిర్వహిస్తారు.
విద్యార్థుల భాగస్వామ్య కార్యక్రమాలు
విభిన్న విద్యా విభాగాలు, భాషా నేపథ్యాలు ఉన్న విద్యార్థుల్లో తిరుక్కురళ్‌పై విస్తృత అవగాహన పెంపొందించేందుకు 1,000 ఉన్నత విద్యా సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా ‘విద్యార్థుల భాగస్వామ్య కార్యక్రమాన్ని’ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రణాళికాబద్ధమైన అధ్యయనం, పరిశోధన, క్యాంపస్ ఆధారిత కార్యక్రమాలు ఉంటాయి.
· ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి విద్యాసంస్థ తిరుక్కురళ్‌పై ఆసక్తి కలిగిన విద్యార్థులను పరీక్షిస్తుంది. వారి నుంచి ప్రతిభ ఆధారంగా ఒక విద్యార్థిని నామినేట్ చేస్తుంది.
· రాజ్యాంగం గుర్తించిన 22 షెడ్యూల్డ్ భాషలు, ఇంగ్లీషులో నిర్వహించే ఆన్‌లైన్ విద్యా మార్గదర్శక కార్యక్రమానికి ఎంపికయిన విద్యార్థులు హాజరవుతారు.
· సీఐసీటీ అందించే బహుభాషా అధ్యయన సామగ్రితో నెల రోజుల పాటు ఈ పరిశోధన, విద్యా కార్యక్రమాలు కొనసాగుతాయి. కార్యక్రమ నిబంధనలకు లోబడి, నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసిన, అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి రూ. 10,000 ఉపకార వేతనం అందుతుంది.
· ప్రతి విద్యార్థి ఉపాధ్యాయుని మార్గదర్శకత్వంలో 4 నుంచి 10 పేజీల వ్యాసం లేదా పరిశోధన పత్రాన్ని రాసి, తమ విద్యా సంస్థలో తిరుక్కురళ్‌పై ఒక గంట పాటు ప్రసంగించాల్సి ఉంటుంది.
ఉత్తరప్రదేశ్‌లో తిరుక్కురళ్ బోధన
సంగమంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో 50 మంది తమిళనాడు ఉపాధ్యాయులు పర్యటిస్తారు. పాఠశాలల్లో తిరుక్కురళ్ బోధిస్తారు. వారణాసిలోని పాఠశాలలను తిరుక్కురళ్‌లో నిష్ణాతులైన తమిళ పండితులు సందర్శిస్తారు. ఓరియెంటేషన్ మాడ్యూళ్లు, చర్చా కార్యక్రమాలు, క్విజ్‌ల ద్వారా ఈ గ్రంథంలోని ముఖ్యమైన విలువలను విద్యార్థులకు పరిచయం చేస్తారు.
పాఠశాలల్లో పఠన కార్యక్రమాలు
వారణాసిలోని పాఠశాలల్లో పఠన అలవాట్లు, కథలు చెప్పడం, సృజనాత్మక కార్యక్రమాలపై పరస్పర చర్చా కార్యక్రమాలను రాష్ట్రీయ ఈ-పుస్తకాలయ సహకారంతో నేషనల్ బుక్ ట్రస్ట్ నిర్వహిస్తుంది.
విద్యా సదస్సులు, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రాంతీయ హస్తకళల ప్రదర్శనలు
భారతీయ భాషా సమితి భాగస్వామ్యంతో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం తిరుక్కురళ్‌పై జాతీయ సదస్సును నిర్వహిస్తుంది. దీంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, తిరుక్కురళ్‌పై లఘు చిత్రాల ప్రదర్శన కూడా ఉంటుంది. ప్రధాన వేదిక వద్ద ప్రతినిధుల కోసం తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన హస్తకళలు, చేనేత వస్త్రాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
డిజిటల్, ప్రజా ప్రచార కార్యక్రమాలు
తిరుక్కురళ్ బోధనలను దేశవ్యాప్తంగా మరింత మందికి చేరువ చేసేందుకు సాంకేతికతను కాశీ తమిళ సంగమం 5.0 వినియోగించుకుంటోంది. సీఐసీటీ రూపొందించిన బహుభాషా యాప్‌లో మొత్తం 1,330 ద్విపదులు, రాజ్యాంగ గుర్తింపు పొందిన 22 భాషల్లో వాటి అనువాదాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సంచిక కోసం సీఐసీటీ రూపొందించిన కార్యక్రమాల్లో ఎంపిక చేసిన ద్విపదులపై షార్ట్ యానిమేటెడ్ వీడియోలు, లఘు చిత్రాలతో పాటు తిరుక్కురళ్ ఆడియో పుస్తకాలు కూడా ఉన్నాయి.
మరింత సమాచారం కోసం, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి:
· సందర్శించండి https://www.kts.cict.in/?lang=en
https://kashitamil.iitm.ac.in/
https://kashitamil.bhu.edu.in/
· తిరుక్కురళ్‌పై మైగవ్ క్విజ్‌లో పాల్గొనేందుకు: https://quiz.mygov.in/quiz/kashi-tamil-sangamam-5-0-quiz-on-thirukkural/
***