57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

ఐఎఫ్ఎఫ్ఐ 2026లో భారతీయ కథాకథన సంప్రదాయాల వైవిధ్యాన్ని, ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకు ఉన్న ఆదరణను ఆవిష్కరించిన వర్చువల్‌ భారత్‌ కార్యక్రమం

భారతీయ కథలను ప్రపంచానికి చేరవేయడంలో వాస్తవిక కథనాలు, సృజనాత్మక స్వేచ్ఛ, సాంకేతికత ప్రాధాన్యాన్ని వివరించిన భరత్‌ బాలా, ధీరజ్‌ సింగ్‌

నాడు పోస్టు చేయడమైనది: 27 NOV 2026 6:27PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2342974Views: 7

గోవాలో 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) సందర్భంగా నేడు ‘వర్చువల్‌ భారత్‌’పై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో భారతదేశంలోని విభిన్న కథాకథన సంప్రదాయాలు, సృజనాత్మక స్వేచ్ఛ, మారుతున్న చలనచిత్ర రంగంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకుడు భరత్‌ బాలా, ప్రస్తుతం పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టీఐఐ) వైస్‌ ఛాన్సలర్‌గా, నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్ఎఫ్‌డీసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ (అదనపు బాధ్యతలు)గా పనిచేస్తున్న ఇండియన్ ఇన్ఫర్మేషన్ అధికారి ధీరజ్‌ సింగ్‌ పాల్గొన్నారు. నటిగా, నిర్మాతగా, రచయిత్రిగా గుర్తింపు పొందిన వాణి త్రిపాఠి టికూ ఈ చర్చా కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించారు.

‘చిత్ర నిర్మాతలు ముందుగా తమ దేశంలోని కథలను గుర్తించి, వాటిని వెలుగులోకి తీసుకురావాలి’

భరత్‌ బాలా  తన సృజనాత్మక దృక్పథం గురించి వివరిస్తూ, మ్యూజిక్‌ వీడియోలు, లఘు చిత్రాలు, ఫీచర్‌ ఫిల్మ్‌లు, కల్పిత కథాచిత్రాలు, వాస్తవ కథన చిత్రాలు అంటూ తాను ఎలాంటి భేదం చూపనని అన్నారు. ఏ రూపంలో కథను చెప్పినా, కథాకథనం, సృజనాత్మక వ్యక్తీకరణకే ప్రాధాన్యం ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

గత ఐదేళ్లుగా తాను చేపట్టిన పనులను గుర్తుచేసుకుంటూ, దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలకు కెమెరాలను తీసుకెళ్లి, అక్కడి నిజమైన వ్యక్తులతో మమేకమవడం, వారి విశ్వాసాన్ని చూరగొనడం, తమ కథలను తామే చెప్పుకునేందుకు వారికి ఒక వేదిక కల్పించడం గురించి ఆయన వివరించారు. ముందుగా నిర్ణయించుకున్న కథనాలను వారిపై రుద్దడం కంటే, మనుషుల నిజమైన అనుభవాలను సహజంగా చిత్రీకరించడంలోనే చలనచిత్ర నిర్మాణ అసలు సారాంశం ఉందని ఆయన స్పష్టం చేశారు.

క్లౌడ్‌ ఆధారిత వేదికపై 143 చిత్రాలను ఒకచోట చేర్చిన ‘వర్చువల్‌ భారత్‌’ కార్యక్రమం ప్రాధాన్యాన్ని వివరిస్తూ, భారతదేశంలోని అపారమైన సాంస్కృతిక, భౌగోళిక వైవిధ్యం వెలుగులోకి రాని ఎన్నో కథలకు గొప్ప వనరుగా నిలుస్తోందని భరత్‌ బాలా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమదైన గుర్తింపు పొందాలంటే, చిత్ర నిర్మాతలు ముందుగా తమ దేశంలోని కథలను గుర్తించి, వాటిని వెలుగులోకి తీసుకురావాలని ఆయన అభిప్రాయపడ్డారు. “భారత్‌ ఇప్పుడు ప్రపంచానికి కొత్త చిరునామా” అని ఆయన వ్యాఖ్యానించారు. భారతీయుల జీవన అనుభవాల్లోంచి పుట్టుకొచ్చే వాస్తవిక కథనాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోగలవని ఆయన స్పష్టం చేశారు.

‘మానవ అనుభవాల నుంచే కళాత్మక వ్యక్తీకరణకు బలం’

భారతదేశంలో విస్తృతమైన ప్రేక్షక వర్గంతో పాటు అపారమైన కథా సంపద ఉందని పేర్కొంటూ, ప్రపంచ కథాకథన రంగంలో మరింత బలమైన స్వరంగా ఎదిగే సామర్థ్యం భారత్‌కు ఉందని ధీరజ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. బయటి వ్యక్తుల అభిప్రాయాలు, ప్రభావాలకే పరిమితం కాకుండా, భారతీయ సినిమా తన సొంత సాంస్కృతిక మూలాల నుంచి స్ఫూర్తి పొందాలని ఆయన స్పష్టం చేశారు. సినిమా, కళ, వాస్తవికతల మధ్య ఉన్న సంబంధాన్ని ప్రస్తావిస్తూ, మానవ అనుభవాల నుంచే కళాత్మక వ్యక్తీకరణకు బలం చేకూరుతుందని, అది క్రమంగా తనదైన ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

చలనచిత్రోత్సవాల లక్ష్యం కేవలం సినిమాలను ప్రదర్శించడానికే పరిమితం కాదని ధీరజ్‌ సింగ్‌ అన్నారు. సినిమా ప్రపంచంలోని విస్తృత పరిధిని ప్రేక్షకులకు పరిచయం చేయడం, వారిలో చలనచిత్రాల పట్ల అభిరుచిని పెంపొందించడం, వర్ధమాన దర్శకులకు నేర్చుకోవడానికి, పరస్పరం ఆలోచనలు పంచుకోవడానికి, తమ చిత్రాలను ప్రదర్శించడానికి అవకాశాలు కల్పించడం కూడా చలనచిత్రోత్సవాల ముఖ్య ఉద్దేశాలని పేర్కొన్నారు. యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు ఐఎఫ్ఎఫ్ఐ చేపడుతున్న కార్యక్రమాలను కూడా ఆయన ప్రస్తావించారు. ఇందులో భాగంగా పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌టీఐఐ), అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌టీఐ) విద్యార్థులకు కల్పిస్తున్న అవకాశాలను వివరించారు. విద్యార్థులకు విస్తృత పరిచయం, సృజనాత్మక అవకాశాలు కల్పించడంతో పాటు, చలనచిత్ర రంగానికి చెందిన వారితో మమేకమయ్యే వేదికను అందించడం సినిమా విద్యలో కీలకమైన అంశమని ఆయన పేర్కొన్నారు.

సృజనాత్మక రంగాలపై పెరుగుతున్న కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం గురించి కూడా ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చింది. ఏఐ వల్ల సృజనాత్మక రంగంలోని నిపుణుల స్థానానికి ముప్పు వాటిల్లుతుందన్న ఆందోళనలపై స్పందిస్తూ, సాంకేతిక పరిణామాల గురించి  భయపడకుండా వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ, అవసరమైన సమయంలో తమ పనితీరులో తగిన మార్పులు చేసుకోవాలని సింగ్‌ అన్నారు. మానవ సృజనాత్మకతను, కళాత్మక వ్యక్తీకరణను ఏ సాంకేతికతా భర్తీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. కళ అనేది అంతిమంగా మానవ కల్పనాశక్తి, అనుభవాల నుంచి మాత్రమే ఆవిర్భవిస్తుందని పేర్కొన్నారు.

సృజనాత్మక అవకాశాలను విస్తరించి. చిత్ర నిర్మాతలకు కొత్త మార్గాలను తెరిచే పరిణామశీల సాంకేతికతగా కృత్రిమ మేధను (ఏఐ) భరత్‌ బాలా స్వాగతించారు. అయితే, కథాకథనం అనేది ప్రాథమికంగా మానవ సృజనాత్మకత, మౌలిక ఆలోచనలపై ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సాంకేతిక అభివృద్ధి సృజనకర్తలను మరింత వినూత్నంగా ఆలోచించేలా ప్రోత్సహించడంతో పాటు, మౌలిక కథాకథనంలో కొత్త సరిహద్దులను అన్వేషించేలా దోహదపడాలని ఆయన అన్నారు.

భారతదేశంలోని విభిన్నమైన, వాస్తవిక కథలను వెలుగులోకి తీసుకురావడంలో ‘వర్చువల్‌ భారత్‌’ వంటి వేదికల ప్రాధాన్యం పెరుగుతోందని ఈ చర్చ స్పష్టం చేసింది. అలాగే ప్రతిభను పెంపొందించడం, సృజనాత్మక ఆలోచనల పరస్పర మార్పిడిని ప్రోత్సహించడం, ప్రపంచ చలనచిత్ర రంగంలో భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేయడంలో చలనచిత్రోత్సవాల పాత్రను కూడా ఈ కార్యక్రమం పునరుద్ఘాటించింది.

Read IFFILOID here: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

 

* * *


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2342974
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026