నాడు పోస్టు చేయడమైనది:
26 NOV 2026 7:43PM by PIB Hyderabad
సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజున, అంటే 2026 నవంబర్ 26న, న్యూఢిల్లీలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ సంబంధిత వేడుకలలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, తోటి పౌరులందరికి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయులు 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారని రాష్ట్రపతి గుర్తుచేశారు. ఏటా ఈ రోజును ‘రాజ్యాంగ దినోత్సవం’గా పాటించాలనే నిర్ణయాన్ని 2015లో, మన రాజ్యాంగ ప్రధాన శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ భీంరావు అంబేడ్కర్ 125వ జయంతి శుభ సందర్భంగా తీసుకున్న సంగతిని శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రస్తావించారు. ఇది రాజ్యాంగ మహా శిల్పికి, రాజ్యాంగంలో ఉల్లేఖించుకున్న ఆదర్శాలకు గౌరవపూర్వక శ్రద్ధాంజలిని అర్పించే రోజు కూడానని రాష్ట్రపతి అన్నారు.
మన గణతంత్రం వైభవోపేత ప్రయాణంలో సర్వోన్నత న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానాలు, జిల్లా కోర్టులు, దిగువ కోర్టులు అమూల్యమైన తోడ్పాటును అందించాయని రాష్ట్రపతి అన్నారు. గత కొన్ని దశాబ్దాల్లో, జీవితంలో అనేక రంగాలలో ఊహించలేని మార్పులు చోటుచేసుకున్నాయని, మరీముఖ్యంగా సాంకేతిక విజ్ఞానంతో పాటు సమాచార ప్రసార మాధ్యమాల ప్రభావం ఎంతో విస్తృతమైందని పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులకు, అంచనాలకు తగ్గట్టు న్యాయ వ్యవస్థ తన భూమికను మార్చుకుంటూనే, న్యాయం తాలూకు మౌలిక ఆదర్శాలను పరిరక్షించడమే కాక బలోపేతం చేసిందని తెలిపారు. ఎప్పటికి అప్పుడు భారతీయ న్యాయ వ్యవస్థ న్యాయబద్ధ జవాబుదారుతనానికి ప్రత్యేక ప్రాధాన్యాన్ని ఇచ్చిందని, తద్వారా రాజ్యంగ నిర్మాతలు తలపోసిన ఆదర్శాలకు ఆచరణ రూపాన్ని ఇవ్వడం సాధ్యపడిందని రాష్ట్రపతి వివరించారు. న్యాయబద్ధ స్వాతంత్య్రానికి, న్యాయబద్ధ జవాబుదారుతనానికి మధ్య పొందిక న్యాయవ్యవస్థ పాత్రను బలోపేతం చేస్తుందని శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు.
న్యాయం చేయడంలో సమయబద్ధతే న్యాయ భావనలో కీలకమైన భాగమని రాష్ట్రపతి అన్నారు. ఎప్పటికప్పుడు న్యాయాన్ని అందుబాటులో ఉంచేటట్లు చూడటానికి న్యాయ వ్యవస్థ అనేక కార్యక్రమాలను చేపడుతోందన్నారు. వాటిలో విధానాలను సరళతరం చేయడం, సాంకేతికతను ఉపయోగించుకోవడం, ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయడం కొన్ని అని వివరించారు. ఇన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా పేరుకుపోయిన కేసుల భారం మన న్యాయ వ్యవస్థకు ముఖ్య సవాలుగా మారిందని రాష్ట్రపతి అన్నారు. న్యాయ వ్యవస్థలో ప్రతి దశలో ఉమ్మడి కృషి ద్వారా ఈ సవాలును పరిష్కరించగలదన్న విశ్వాసాన్ని శ్రీమతి ద్రౌపది ముర్ము వ్యక్తం చేశారు.
ఉన్నత న్యాయస్థానాలను, సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి అవసరమైన స్తోమత ప్రతి ఒక్కరికి ఉండదని రాష్ట్రపతి అన్నారు. సమాన అవకాశాలపై ఆధారపడి న్యాయాన్ని అందించాలని మన రాజ్యాంగం చెబుతుందని, దీనిలో ఉచిత న్యాయ సహాయ సౌలభ్యం కూడా ఓ భాగమని శ్రీమతి ద్రౌపది ముర్ము తెలిపారు. పౌరులు ఆర్థిక నిర్బంధాల వల్ల గాని, లేదా మరే ఇతర కష్టం కారణంగా గాని న్యాయాన్ని అందుకొనే అవకాశాన్ని దక్కించుకోకుండా ఉండరాదన్నదే ఈ ఏర్పాటులో ముఖ్యోద్దేశమని రాష్ట్రపతి వివరించారు. పౌరులందరికి జీవితంలో ఎదిగేందుకు, విజయులు అయ్యేందుకు సమాన అవకాశం లభించేటట్లు చూసినప్పుడే ఒక దేశం సిసలైన అర్థంలో అభివృద్ధి చెందినట్లు అవుతుందని శ్రీమతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. ప్రతి చిన్నారికీ నాణ్యమైన విద్యను అందించడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని రాష్ట్రపతి అన్నారు. సమాజంలో పేదలకు, నిరాదరణ పాలయిన వర్గాలకు అందే న్యాయ ప్రాతినిధ్యం తాలూకు వాసిపైన, విశ్వసనీయతపైన శ్రద్ధ తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యమేనన్నారు. ఈ సందర్భంగా న్యాయం ఈ వర్గాల చెంతకు చేరుకునే దిశగా జిల్లా, రాష్ట్ర, జాతీయ న్యాయ సేవల అధికారులు సమాజంలో తమ ప్రయత్నాల్ని తప్పక ముమ్మరం చేయాలని రాష్ట్రపతి సూచించారు.
మన దేశంలో న్యాయ విద్యాబోధన క్రమంలో చట్టాలను అధ్యయనం చేయడంతో పాటు కరుణకు, నైతికతకు కూడా సమాన ప్రాధాన్యాన్ని ఇవ్వాలని రాష్ట్రపతి అన్నారు. యువ న్యాయవాదులకు స్ఫూర్తిదాయక ఉదాహరణలను అందించవలసిందిగా న్యాయ రంగంలోని ప్రముఖులకు శ్రీమతి ద్రౌపది ముర్ము విజ్ఞప్తి చేశారు. వృత్తిలో రాణింపును కరుణతోను, యోగ్యతను దయతోను ఎలా జోడించవచ్చో గమనించాల్సిందిగా యువ న్యాయవాదులకు రాష్ట్రపతి హితవు చెప్పారు.
న్యాయ పీఠాలలో, న్యాయవాది సంఘాలలో మహిళల ప్రాతినిధ్యం అంతకంతకు వృద్ధి చెందితే అప్పుడు మన సమాజం మరింత న్యాయపూర్ణం, నిష్పాక్షికం, సమానం, సమ్మిళితంగా రూపుదిద్దుకొంటుందని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము అన్నారు. మహిళల దృష్టికోణం న్యాయ నిర్ణయాలు తీసుకొనే ప్రక్రియను సమ్మిళితయుక్తంగా, వైవిధ్యపూరితంగా, సంతులితంగా తీర్చిదిద్దగలుగుతుందని రాష్ట్రపతి అన్నారు. న్యాయమూర్తులుగా, న్యాయవాదులుగా మహిళలు ఎక్కువ మంది బాధ్యతలు స్వీకరించేటట్లు వారిని ప్రోత్సహించవలసి ఉందన్నారు. కలుపుకొని ముందుకు పోవడం, యోగ్యతకు పెద్ద పీట వేయడం మన న్యాయ వ్యవస్థ బలాన్ని ఇనుమడింపచేస్తాయని రాష్ట్రపతి అన్నారు.
విశేష ప్రతిశావంతులు, యాసిడ్ దాడి బాధితులు, 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, పేదరిక రేఖకు దిగువన జీవిస్తున్న వారికి సంబంధించిన కేసులకు ప్రాధాన్యాన్నిచ్చి న్యాయ లభ్యతను ప్రోత్సహించే దిశగా సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయాలు తీసుకుందని రాష్ట్రపతి తెలిపారు. మరింత ప్రభావవంతమైన రీతులలో కేసుల నిర్వహణ, లిస్టింగు, డిజిటల్ పరివర్తన, వివాదాలను సౌహార్దపూర్వకంగా పరిష్కరించుకోవడాన్ని ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యలను శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. రాజ్యాంగ పరిషత్తు సభ్యులు ఆదర్శవాద భావాలతో న్యాయ వ్యవస్థ నిబంధనలను రూపొందించారని, ఆ భావాలను మన న్యాయ సమాజ సభ్యులు పరిరక్షిస్తారన్న విశ్వాసాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి ప్రసంగాన్ని చదవడానికి ఈ కింద ఇచ్చిన లింక్ లోకి వెళ్లగలరు:
Please click here to see the President’s speech
***