గోవాలో 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) సందర్భంగా ఈ రోజు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) నిర్వహించిన విలేకరుల సమావేశంలో బెల్జియన్ ఫిల్మ్ మేకర్ ఇసబెల్లె టోలెనేర్ తన చిత్రం ‘పారిస్ పారిస్’ విశేషాలను, దాని సృజనాత్మక ప్రయాణాన్ని ప్రేక్షకులకు వివరించారు. వలసలు, నిరాశ్రయత, సొంగడ్డపై మమకారం వంటి అంశాలపై ఆమె మాట్లాడారు. ‘ఇంటర్నేషనల్ సినిమా’ విభాగంలో ప్రదర్శించిన ఈ చిత్రం.. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో నివసిస్తున్న ముగ్గురు వ్యక్తుల జీవితాల ద్వారా ఇంటికి నిజమైన అర్థాన్ని అన్వేషిస్తుంది.
పారిస్‌లోని ఒక భవనం నేపథ్యంలో ‘పారిస్ పారిస్’ చిత్రం సాగుతుంది. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఖాళీగా ఉన్న ఒక అపార్ట్‌మెంటులో నివాసాన్ని ఏర్పరుచుకోవడానికి చేసే ప్రయత్నాన్ని ఇందులో చిత్రీకరించారు. తమ వద్ద ఉన్న పరిమిత వనరులను పంచుకుంటూ, తమ గతం, భవిష్యత్తుల గురించి మాట్లాడుకుంటూ.. గుర్తింపు, నిరాశ్రయత, ఒక ప్రాంతంతో ఏర్పడే అనుబంధం వంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతారు. ఈ క్రమంలో భిన్న సంస్కృతులకు చెందిన మనుషులందరినీ ఏకం చేసే మానవీయ అనుభవాలను ఈ చిత్రం హృద్యంగా ఆవిష్కరిస్తుంది.
తొలిసారిగా భారత్‌ను సందర్శించడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన టోలెనేర్.. ఇఫీలో తన చిత్రాన్ని ప్రదర్శించే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కిందటి రోజు చిత్ర ప్రదర్శనకు ఆడిటోరియం పూర్తిగా నిండిపోయిందని, ప్రేక్షకుల నుంచి ఎంతో ప్రోత్సాహకరమైన స్పందన లభించిందని ఆమె గుర్తుచేసుకున్నారు. ప్రదర్శన అనంతరం నిర్వహించిన ఆసక్తికరమైన ప్రశ్నోత్తరాల కార్యక్రమం భారతీయ ప్రేక్షకులతో ముఖాముఖి మాట్లాడటానికి, చిత్రంపై వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఎంతో దోహదపడిందని ఆమె తెలిపారు.
తన సృజనాత్మక శైలి గురించి మాట్లాడుతూ.. డాక్యుమెంటరీ చిత్రనిర్మాణంలో తన అనుభవం నటీనటుల ఎంపికపై ఎంతో ప్రభావాన్ని చూపిందని టోలెనేర్ వివరించారు. కథలోని పాత్రల స్వభావానికి సరిపోయే వ్యక్తిగత నేపథ్యం, జీవితానుభవాలు ఉన్న వ్యక్తులనే నటులుగా ఎంచుకోవడం వల్ల కథనానికి సహజత్వం చేకూరిందని ఆమె పేర్కొన్నారు.
పరిమిత బడ్జెట్, చిత్రీకరణకు అనువైన ప్రదేశాలను గుర్తించడం వంటి విషయాల్లో ఎదురైన నిర్మాణ సవాళ్ల గురించి కూడా ఆమె వివరించారు. తన తాతయ్య, నానమ్మలు కూడా వలసదారులేనని, వారి జీవితానుభవాలే తనలో వలసలు, నిరాశ్రయత, సొంత గడ్డపై మమకారం వంటి అంశాల పట్ల ఆసక్తిని పెంచాయని ఆమె వెల్లడించారు.
తన సినిమా వివిధ దేశాలు, సంస్కృతుల సరిహద్దులు దాటి.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువ కావాలని కోరుకుంటున్నట్లు టోలెనేర్ తెలిపారు. ఇందులోని సార్వత్రిక అంశాలు, ఉమ్మడి మానవీయ అనుభవాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమాతో మమేకమవుతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ విలేకరుల సమావేశానికి ఆండ్ర్యూ లాల్‌ఛాందమా వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఇఫిలాయిడ్‌ను ఇక్కడ చదవండి: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48