క్షణం పాటు స్క్రోల్ చేద్దామని మనం ఫోన్ తీస్తాం. కానీ గంటల తరబడి అందులోనే ఉండిపోతాం. తదుపరి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూ, ప్రతి స్వైప్‌కు మనల్ని మనం అంకితం చేసుకుంటున్నాం. మనమే తెరను స్క్రోల్ చేయటం కాకుండా, ఆ తెరే మన జీవితాలను స్క్రోల్ చేస్తుంటే ఎలా ఉంటుంది? ఈ ఆందోళనకరమైన అంశంపై రూపొందిన తమిళ చిత్రం స్క్రోల్. గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఇఫీ) వేదికగా స్మార్ట్‌ఫోన్ వ్యసనం, అల్గారిథమిక్ ప్రభావం, డిజిటల్ బానిసత్వం వంటి అంశాలను ఈ చిత్రం కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.
చిత్రోత్సవంలో భాగంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిత్ర దర్శక-నిర్మాత కణ్ణన్ ఎస్, ప్రధాన నటీనటులు అరవింద్ సుందర్, కావ్య అనిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర కథన శైలి, ప్రయోగాత్మక నిర్మాణ పద్ధతులు, సమకాలీన ఇతివృత్తాల గురించి మీడియాతో పంచుకున్నారు.
ఇండియన్ పనోరమా విభాగానికి ఎంపికైన స్క్రోల్... ఇఫీ- 2026లో ప్రతిష్ఠాత్మక ఐసీఎఫ్‌టీ-యునెస్కో గాంధీ పతకానికి నామినేట్ అయిన ఏకైక తమిళ చిత్రం. 128 నిమిషాల నిడివి గల ఈ సైకలాజికల్ థ్రిల్లర్ వినూత్నమైన స్క్రీన్-లైఫ్ ఫార్మాట్‌లో రూపొందింది. దీని కథనం పూర్తిగా మొబైల్ ఫోన్ ఇంటర్‌ఫేస్ ద్వారానే సాగుతుంది.
స్మార్ట్‌ఫోన్ వ్యసనంతో బాధపడుతూ, జీవితాన్ని తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న యువకుడి చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. ఆకర్షణీయమైన గేమ్ టాస్క్‌లు, రివార్డుల ద్వారా డిజిటల్ విముక్తిని ప్రసాదిస్తామనే హామీతో మొదలైన ఆ యాప్, కలవరపెట్టే సవాళ్లు, మానసిక ఒత్తిడికి గురిచేసే విషవలయంగా మారుతుంది.
ఐసీఎఫ్‌టీ-యునెస్కో గాంధీ పతకానికి ఈ చిత్రం నామినేట్ కావడంపై దర్శకుడు కణ్ణన్ ఎస్ మాట్లాడుతూ... సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేటి ప్రపంచంలో సత్యం, అహింస, స్వీయ నియంత్రణ అనే గాంధేయ విలువల ఆవశ్యకతను స్పష్టం చేశారు. బ్లూ వేల్ ఛాలెంజ్ వంటి వాస్తవ డిజిటల్ పరిణామాల నుంచి స్ఫూర్తి పొందిన ఈ చిత్రం... యువతకు ఉపన్యాసాలు ఇచ్చే ధోరణిలో కాకుండా అదుపులేని డిజిటల్ ఆధారిత జీవనంపై ఆత్మపరిశీలన చేసుకునేలా ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు. "ఉపన్యాసంలా కాకుండా, ఆకట్టుకునే థ్రిల్లర్ ద్వారా శక్తిమంతమైన సామాజిక సందేశాన్ని అందించాలని మేం భావించాం" అని తెలిపారు.
మొబైల్ ఫోన్ ఇంటర్‌ఫేస్‌లోనే పూర్తి సినిమాను రూపొందించటంలో ఎదురైన సవాళ్ల గురించి కణ్ణన్ వివరించారు. నటీనటుల్లో ఎక్కువ మంది వేర్వేరు ప్రాంతాల నుంచి ఎవరికి వారుగా తమ భాగాలను చిత్రీకరించారని, చాలామంది నటులు ఈ చలన చిత్రోత్సవంలోనే మొదటిసారి వ్యక్తిగతంగా కలుసుకున్నారని ఆయన తెలిపారు. "కథనాన్ని ఆసక్తికరంగా, ప్రభావవంతంగా నడిపిస్తూనే, మొబైల్ తెర అనే పరిమిత ఫ్రేమ్‌లో సినిమాటిక్ ఉత్కంఠను కొనసాగించటం పెద్ద సవాలుగా నిలిచింది" అని చెప్పారు.
ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన కథానాయకుడు అరవింద్ సుందర్ మాట్లాడుతూ... స్మార్ట్‌ఫోన్ వ్యసనం నుంచి బయటపడేందుకు మరో అప్లికేషన్‌ను ఆశ్రయించటంలోని వైరుధ్యాన్ని గుర్తుచేశారు. ఈ పాత్రకు నిత్య జీవితమే తనను సిద్ధం చేసిందని చెప్పారు. "మనం రోజూ ఈ వాస్తవ పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉన్నాం" అని అన్నారు. సినిమా విలక్షణమైన కథన విధానం ప్రేక్షకులను కథానాయకుడిని ఉక్కిరిబిక్కిరి చేసే డిజిటల్ ప్రపంచంలో పూర్తిగా లీనం చేస్తుందని ఆయన తెలిపారు.
స్క్రిప్ట్‌లోని వినూత్న కథన శైలిని, ప్రస్తుత కాలానికి తగిన అంశాన్ని కావ్య అనిల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. హానికరమైన డిజిటల్ ఛాలెంజ్‌లను ఈ చిత్రం గొప్పగా చూపించటం లేదని, వాటి పర్యవసానాలను సంచలనాత్మకంగా చిత్రీకరించలేదని ఆమె స్పష్టం చేశారు. బదులుగా సాంకేతికత మనుషులను ఒకవైపు అనుసంధానిస్తూనే, మరోవైపు ఎలా తన నియంత్రణలోకి తీసుకుంటుందో ఆలోచింపజేసే రీతిలో విశ్లేషిస్తుందని ఆమె తెలిపారు.
ఈ విలేకరుల సమావేశానికి శ్రీ సురేష్ కుమార్ ఎం. సమన్వయకర్తగా వ్యవహరించారు.
పూర్తి ప్రెస్ కాన్ఫరెన్స్‌ను ఇక్కడ చూడవచ్చు:
Read IFFILOID here: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48
***