57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

ఇఫీ- 2026లో సరస్వతీ నది డాక్యుమెంటరీ ప్రదర్శన శాస్త్రీయ దృక్పథంతో ప్రాచీన నదీ రహస్యాల అన్వేషణ

నాడు పోస్టు చేయడమైనది: 26 NOV 2026 3:09PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2342263Views: 6

భూగర్భంలో నిక్షిప్తమై, ప్రాచీన గ్రంథాల పుటల్లో ప్రవహిస్తూ, భారత నాగరికత స్మృతుల్లో అంతర్వాహినిగా నిలిచిన సరస్వతీ నది దేశంలో అంతుచిక్కని మిస్టరీల్లో ఒకటిగా మిగిలిపోయింది. ప్రాచీన సంప్రదాయాలకు, ఆధునిక శాస్త్రీయ పరిశోధనలకు మధ్య వారధిని నిర్మించే లక్ష్యంతో రూపొందిన హిందీ డాక్యుమెంటరీ ‘ది అన్‌సీన్ హోలీ రివర్ - సరస్వతి’. 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)- 2026లో ‘ఇండియన్ పనోరమా’ విభాగంలో ఈ రోజు ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ నదికి సంబంధించిన ఆసక్తికరమైన కథనాన్ని, నది ఉనికిపై డాక్టర్ సుభాష్ సి. సింగ్ నిర్వహించిన శాస్త్రీయ పరిశోధనలను ఈ డాక్యుమెంటరీ అన్వేషిస్తుంది. ప్రాచీన భౌగోళిక ఆధారాలు, భూగర్భ శాస్త్ర పరిశీలనలు, శాస్త్రీయ పరిశోధనలను మిళితం చేస్తూ... దేశ సహజ, సాంస్కృతిక వారసత్వంపై ఒక ఆసక్తికరమైన అన్వేషణను ఈ చిత్రం ప్రేక్షకుల కళ్లెదుట నిలిపింది.

పీఐబీ ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శకుడు భాస్కర్ విశ్వనాథన్ మాట్లాడుతూ... తన తొలి డాక్యుమెంటరీ నిర్మాణ అనుభవాన్ని వివరించారు. సరస్వతీ నది చుట్టూ అల్లుకున్న రహస్యం తనకు ఎంతో ఆసక్తిని కలిగించిందని, ఈ అంశంపై జరిగిన పరిశోధన తనకు ప్రధాన స్ఫూర్తిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. సరస్వతీ నది చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ముఖ్యంగా సరస్వతీ నాగరికత, ప్రాచీన వేద సంప్రదాయంతో ఈ నదికి ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ.. ఈ నదీ తీరంలోనే వేదాలను రచించారన్న విశ్వాసం కూడా ఉందని తెలిపారు. విస్తృతమైన పరిశోధన అంశాలను క్లుప్తంగా, ఆసక్తికరంగా, వినోదాత్మక శైలిలో అందించడం ప్రధాన సవాలుగా నిలిచిందని విశ్వనాథన్ పేర్కొన్నారు. పరిశోధనాత్మక పునాదిని ఏమాత్రం కోల్పోకుండా.. ఈ డాక్యుమెంటరీని విస్తృత శ్రేణిలో ప్రేక్షకులకు చేరువ చేయడమే ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

 

భారతదేశ నదులు, వాటి చారిత్రక ప్రాధాన్యం పట్ల తనకున్న ఆసక్తే ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్రేరణనిచ్చిందని నిర్మాత అభినవ్ ఎం. జైన్ తెలిపారు. తన ప్రయాగరాజ్‌ కుంభమేళా సందర్శనను గుర్తు చేసుకుంటూ.. త్రివేణి సంగమం వద్ద తనకు గంగా, యమునా నదులే కనిపించాయనీ, దాంతో వేదాలు, ఇతర హిందూ గ్రంథాల్లో పదేపదే ప్రస్తావించిన మూడో నది సరస్వతి గురించి అన్వేషించాలన్న ఆలోచన కలిగిందనీ ఆయన పేర్కొన్నారు. ఈ పరిశోధనలోని శాస్త్రీయ కోణాన్ని ప్రస్తావిస్తూ... రూర్కీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ నిర్వహించిన ఐసోటోపిక్ అధ్యయనాలను జైన్ ఉదాహరించారు. ఈ సంస్థ నీటి నమూనాలను పరీక్షించి, భూగర్భ జల వ్యవస్థపై జరిగిన పరిశోధనలకు ఎంతగానో దోహదపడిందని ఆయన వివరించారు.

భూగర్భ శాస్త్ర పరిశోధనలు, ప్రాచీన సంప్రదాయాలు, సమకాలీన చలనచిత్ర నిర్మాణ శైలిని మిళితం చేయడం ద్వారా... దేశ నాగరికతా వారసత్వంలోని ఒక ముఖ్యమైన విశేషాన్ని శాస్త్రీయ దృక్పథంతో పునఃపరిశీలించే అవకాశాన్ని ‘ది అన్‌సీన్ హోలీ రివర్ - సరస్వతి’ డాక్యుమెంటరీ ప్రేక్షకులకు అందిస్తోంది.

ఈ మీడియా సమావేశానికి శ్రీ స్వాధీన్ శక్తి ప్రసాద్ సమన్వయకర్తగా వ్యవహరించారు.

ఇఫిలాయిడ్‌ను ఇక్కడ చదవండి: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48 


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2342263
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026