పనాజీలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వెండితెరను మించిన అనుభూతిని అందిస్తుంది. సృజనాత్మక సంస్థలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రాంతీయ వంటకాలు, స్థానిక ఉత్పత్తులు, వస్తువులు, అందరికీ అందుబాటులో ఉండే కార్యక్రమాలకు చైతన్యవంతమైన వేదికగా ఇఫీ ప్రాంగణం రూపుదిద్దుకుంది. ప్రతినిధులు, సినీ రూపకర్తలు, విద్యార్థులు, సందర్శకులకు భారతదేశ సుసంపన్నమైన సృజనాత్మక, సాంస్కృతిక వైభవాన్ని తెలుసుకునేందుకు, అందులో పాలుపంచుకునేందుకు ఈ వైవిధ్యభరితమైన అంశాలు చక్కటి అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
అందుబాటులో ఉండేలా, సమ్మిళితత్వాన్ని ముందుకు తీసుకెళ్లటం
దివ్యాంగుల గౌరవం, వారికి సదుపాయాలను అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్న స్వయం సంస్థ చేపట్టిన అవగాహన కార్యక్రమం ఈ ప్రాంగణంలో ప్రత్యేకమైనది. ఇఫీ వేడుకల్లో రెండోసారి పాల్గొంటున్న స్వయం సంస్థ... అందరికీ అందుబాటులో ఉండే బహిరంగ ప్రదేశాల ఆవశ్యకతను, సాంస్కృతిక, సామాజిక కార్యకలాపాల్లో దివ్యాంగుల భాగస్వామ్య అవసరాన్ని స్పష్టం చేస్తుంది. చిత్రోత్సవ ప్రాంగణంలో కల్పించిన ప్రత్యేక సదుపాయాలకు ఈ కార్యక్రమం మరింత తోడ్పడుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు అందరికీ అందుబాటులో ఉండాలని, ప్రతీ ఒక్కరినీ ఆహ్వానించేలా ఉండాలని ఇది చాటిచెబుతోంది.
భారతదేశ సృజనాత్మక, విద్యా వ్యవస్థల ప్రదర్శన
సృజనాత్మక సాంకేతికత, సినిమా, ప్రదర్శన కళలు, డిజైన్ రంగాల్లో పనిచేస్తున్న సంస్థలు కార్యక్రమాలను ప్రదర్శించేందుకు సందర్శకులతో మమేకమయ్యేందుకు ఈ ఉత్సవ ప్రాంగణం వేదికగా నిలుస్తోంది.
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ రంగాల్లో భారతదేశ జాతీయ అత్యుత్తమ కేంద్రమైన ముంబయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ), యానిమేషన్ క్యారెక్టర్-మేకింగ్ పోటీ ద్వారా సందర్శకులను ఆకట్టుకుంటోంది. సృజనాత్మక సాంకేతిక రంగంలో ఉన్న అవకాశాలను, భవిష్యత్తులో విస్తృతమయ్యే మార్గాలు ఈ సంస్థ ఏర్పాటు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన ద్వారా సందర్శకులకు పరిచయమవుతాయి.
ప్రతిష్ఠాత్మక గాంధేయ సాహిత్య శ్రేణితో పాటు భారతీయ చలనచిత్ర రంగంపై రూపొందించిన ప్రచురణల సంకలనాన్ని ప్రచురణల విభాగం డైరెక్టరేట్ (డీపీడీ) ప్రదర్శిస్తోంది. ఎంపిక చేసిన పుస్తకాలపై అందిస్తున్న ప్రత్యేక రాయితీలు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తూ, ఇక్కడి సాహిత్య సంపదను అన్వేషించేలా ప్రోత్సహిస్తున్నాయి.
చెన్నైలోని ఎస్ఏ ఫిల్మ్ అకాడమీ, హర్యానాలోని రోహ్‌తక్‌కు చెందిన దాదా లక్ష్మీ చంద్ స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ పెర్ఫార్మింగ్ అండ్ విజువల్ ఆర్ట్స్, జేడీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థల భాగస్వామ్యం భారతదేశంలో విస్తరిస్తున్న మీడియా, వినోద, సృజనాత్మక రంగాలకు తోడ్పాటునందిస్తున్న విద్యా, వృత్తిపరమైన విభాగాల విస్తృతిని ప్రతిబింబిస్తోంది.
వైవిధ్యమైన ప్రాంతీయ రుచులు
సంప్రదాయ నాగా వంటకాలు, బిర్యానీ నుంచి దోశ, కాఫీ, బేకరీ ఉత్పత్తుల వరకు విభిన్న ప్రాంతీయ, ప్రజాదరణ పొందిన ఆహార పదార్థాలను ఒకే వేదికపైకి తీసుకురావటం ద్వారా ఫుడ్ స్టాళ్లు ప్రాంగణానికి మరో కొత్త కోణాన్ని జోడిస్తున్నాయి. గోవా ప్రాంత ప్రత్యేకతను చాటుతూ… గోవా అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ స్థానికంగా సేకరించిన జీడిపప్పులను ప్రదర్శించటం ద్వారా ఆ ప్రాంత దేశీయ ఉత్పత్తుల విశిష్టతను తెలియజేస్తుంది.
ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు సందర్శకులకు ఉత్సవ జ్ఞాపికలతో పాటు వివిధ సృజనాత్మక ఉత్పత్తులను అందుబాటులో ఉంచాయి. దుస్తులు, అలంకరణ వస్తువులను పూణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) ప్రదర్శిస్తుండగా... ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ఈఎస్‌జీ ) కూడా సొంత ఉత్పత్తుల కలెక్షన్‌ను సందర్శకుల ముందుకు తీసుకువచ్చింది.
వెండితెరకు మించిన వినోదం
చిత్రోత్సవ అనుభూతిని డిజిటల్, ప్రసార మాధ్యమాలకు విస్తరిస్తూ ప్రైమ్ వీడియో, స్టోరీ టీవీ యాప్, బిగ్ ఎఫ్ఎం కూడా స్టాళ్ల ద్వారా ఇందులో భాగస్వామ్యమవుతున్నాయి. వీటి భాగస్వామ్యం ద్వారా నిరంతరం మారుతున్న మీడియా, వినోద రంగంలోని విభిన్న ఫార్మాట్లు, వేదికలతో మమేకమయ్యే అవకాశం సందర్శకులకు కలుగుతుంది.
భాగస్వామ్యానికి అవసరమైన సహకారం అందించినందుకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ఈఎస్‌జీ), జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ)లకు స్టాల్ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
సృజనాత్మక సంస్థలు, ప్రాంతీయ రుచులు, స్థానిక ఉత్పత్తులు, వినోద వేదికలు, అందరికీ అందుబాటులో ఉండే కార్యక్రమాలతో భారతదేశ సాంస్కృతిక, సృజనాత్మక రంగాల విభిన్న కోణాలను తెలుసుకునేందుకు, పరస్పరం పంచుకుకునేందుకు, మమేకమయ్యేందుకు సందర్శకులకు ఇఫీ ప్రాంగణం కీలక వేదికగా నిలుస్తోంది.
Read IFFILOID here: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48
***