సినిమా థియేటర్, ఉత్సవ వేదికలకు ఆవల పణజీ వీధుల్లోకి 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ.. ‘ఇఫి’) వైభవాన్ని తీసుకుపోయారు. ‘సినిమాతో ముడిపడిన ఆనందోత్సవం’ ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకొని ఒక విశేష పరేడ్‌ను ఈ రోజు నిర్వహించారు. పణజీలో రోడ్లను గోవా కళాత్మక, సాంస్కృతిక వారసత్వాలకు అద్దం పట్టే చైతన్యపూర్వక ప్రదర్శన వేదికలుగా మార్చివేశారు. గోవా వినోద సంఘం (ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా.. ఈఎస్‌జీ) పరిసరాలలో పరేడును మొదలుపెట్టి, కళా అకాడమీ వద్ద ముగించారు. ఈ సందర్భంగా వర్ణమయ శకటాలు, సాంప్రదాయిక హస్తకళలు, జానపద కళారూపాలు, ఔత్సాహికుల భాగస్వామ్యం.. వీటన్నిటి సమ్మేళనాన్ని కనులార చూసే అవకాశం ఎంతోమందికి లభించింది.
గోవాకు చెందిన సుసంపన్న సాంస్కృతిక సంప్రదాయాలను ఆవిష్కరించిన ఈ పరేడ్‌లో.. రాష్ట్ర కార్నివాల్, షిగ్మొ ఉత్సవాన్ని ఆవిష్కరించిన పురస్కార విజేతల శకటాలతో పాటు మనోహర జానపద నృత్య సమర్పణలు కూడా భాగం పంచుకున్నాయి. గోవాకు సంబంధించిన ఉత్సవ భావనకు సినిమా సార్వత్రిక అపీలును జత చేసిన ఈ ఊరేగింపు రాష్ట్ర సాంస్కృతిక చైతన్యాన్ని అర్థం చేసుకొనేందుకు ఒక అరుదైన అవకాశాన్ని చూపరులకు, ప్రతినిధులకు, నగర నివాసులకు అందించింది. ఇది ‘ఇఫి’ ప్రధాన ఇతివృత్తమైన ‘ఎల్లలు లేని కథలు’ (స్టోరీస్ వితవుట్ బార్డర్స్) భావనను ప్రతిబింబించింది. కళ, సాంస్కృతిక అభివ్యక్తీకరణలు భాషాపరమైన, భౌగోళికపరమైన సరిహద్దులకు అతీతమైనవని కూడా ఈ పరేడ్ నిరూపించింది.

పరేడును గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ప్రారంభించారు. ఈ ఉత్సవంలో పాలుపంచుకున్న ప్రముఖులు, కళాకారులు, సందర్శకులకు ఆయన స్వాగత వచనాలు పలికారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ (స్వయంసమృద్ధ భారత్) దృష్టికోణం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను డాక్టర్ ప్రమోద్ సావంత్ పునరుద్ఘాటించారు. స్థానిక ప్రతిభావంతులను ఆదరించి ప్రోత్సహించడం, సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించడం, సామాజిక కార్యక్రమాల మాధ్యమం ద్వారా స్వయంసమృద్ధిని పెంపొందింప చేయడానికి ప్రాధాన్యాన్ని ఇస్తున్నట్లు వివరించారు. ఆకాశ్ కండీల్ (లాంతరు) తయారీ పోటీని గురించి ఆయన చెబుతూ, సాంప్రదాయిక పద్ధతిలో చేతులతో తయారు చేసిన లాంతరు ద్వారా సృజనాత్మకతను చాటుకున్న గోవా ప్రజల ఉత్సాహపూర్వక భాగస్వామ్యాన్ని ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు ఒక్క కళాత్మక అభివ్యక్తిని పండుగ చేసుకోవడమే కాకుండా, సామాజిక భాగస్వామ్యాన్ని కూడా బలోపేతం చేస్తాయని, శతాబ్దాల నాటి సంప్రదాయాలకు ఊపిరి పోస్తాయన్నారు. ‘ఇఫి’కి ఎంపిక చేసిన ‘ఎల్లలు లేని కథలు’ ఇతివృత్తం గోవా సాంప్రదాయిక శకట పరేడు, జానపద కళారూపాల ప్రదర్శనల్లో సహజంగానే వ్యక్తమవుతోందని, ఈ సాంస్కృతిక అభివ్యక్తీకరణలు భాషాపరమైన ఇబ్బందులను అధిగమించి మరీ కళాత్మక వారసత్వాన్ని మెచ్చుకొనే అవకాశాన్ని చూపరులకు కలిగిస్తాయని ఆయన అన్నారు. దీనిలో పాల్గొంటున్న కళాకారులకు, నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలిపారు. ‘ఇఫి’ తాజా సంచిక అన్నింటి కన్నా ఫలప్రదమైన సంచికల్లో ఒకటని వర్ణించారు. సందర్శకులందరికి గోవా ప్రభుత్వం పక్షాన ఇదే సాదర స్వాగతం అని డాక్టర్ సావంత్ అన్నారు.

ఈఎస్‌జీ వైస్-చైర్‌పర్సన్ శ్రీమతి డెలిలా ఎమ్. లోబో సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఆకాశ్ కండీల్ (సాంప్రదాయిక లాంతరు నిర్మాణ కళ) పోటీని గురించి ప్రస్తావించారు. దీనిలో ఈ సంవత్సరం నెమలి ఇతివృత్తం ఆధారంగా 350 కన్నా ఎక్కువ ఎంట్రీలు వచ్చాయని తెలిపారు. పోటీలో పాలుపంచుకున్న వారి సృజనాత్మకత, హస్తకళాకౌశలం ప్రశంసనీయమని ఆమె అంటూ, పురస్కారాలను గెలుచుకున్న కార్నివాల్ శకటాలు, చైతన్యభరితమైన జానపద కళారూపాల విశేష పరేడును గురించి కూడా ప్రస్తావించారు. గోవా సంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని ఆస్వాదిస్తూ, ఈ ఉత్సవంలో ప్రదర్శించే వివిధ సినిమాల అనుభూతులను మదిలో పదిలపరుచుకోవాల్సిందిగా సందర్శకులకు, సినిమా ప్రేమికులకు ఆమె విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న వారిలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ ప్రభాత్, జాతీయ చలనచిత్రాభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ) చైర్మన్ శ్రీ జి. కృష్ణకుమార్, ఎన్ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ధీరజ్ సింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా (ఈఎస్‌జీ) ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) శ్రీ దీపక్ బాండేకర్‌లతో పాటు చలనచిత్ర రంగ ప్రముఖులు శ్రీ అసీమ్ బజాజ్, శ్రీ ఎశ్‌లే లోబో, శ్రీ సైనీ ఎస్. జోహ్రే ఉన్నారు.
***