ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్‌వోటీ) పద్ధతిలో, ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో కామరాజర్ పోర్ట్ లిమిటెడ్‌ రెండో కంటెయినర్ టెర్మినల్ అభివృద్ధికి క్యాబినెట్ ఆమోదం

నాడు పోస్టు చేయడమైనది: 25 NOV 2026 3:25PM by PIB Hyderabad

కామరాజర్ పోర్టు లిమిటెడ్ (కేపీఎల్)లో రెండో కంటెయినర్ టెర్మినల్ అభివృద్ధికి ఉద్దేశించిన ప్రతిపాదిత ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. జీఎస్టీతో సహా ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం అంచనా రూ.4,288.26 కోట్లు. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్‌వోటీ) పద్ధతిలో, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తారు. రెండు దశల్లో ఈ ప్రాజెక్టును అమలు చేస్తారు. దీనిలో భాగంగా 900 మీటర్ల పొడవు, 18 మీటర్ల డిజైన్ డ్రాఫ్ట్ కలిగిన కంటెయినర్ టెర్మినల్‌ను నిర్మిస్తారు. ఏటా 2.0 మిలియన్ల ట్వంటీ–ఫుట్ ఈక్వలెంట్ యూనిట్స్ (టీఈయూ) కంటెయినర్లను నిర్వహించే సామర్థ్యం దీనికి ఉంటుంది.

వ్యయ అంచనా: 

పీపీపీ విధానంలో అభివృద్ధి చేసే ఈ ప్రాజెక్టు వ్యయ అంచనా జీఎస్టీతో కలిపి రూ. 4,288.26 కోట్లు. దీనిలో మొదటి దశకు రూ.2,429.32 కోట్లు, రెండో దశకు రూ.1,858.94 కోట్లు కేటాయించారు. డీబీఎఫ్‌వోటీ నమూనా కింద ఎంపిక చేసిన గుత్తేదారు సంస్థ ఈ పెట్టుబడిని సమకూర్చనుంది. కేపీఎల్ భరించాల్సిన డ్రెడ్జింగ్ అంచనా వ్యయాన్ని రూ.450 కోట్లుగా ప్రాజెక్టు ప్రతిపాదనలో విడిగా పేర్కొన్నారు.

వివరాలు:

(i) 900 మీటర్ల పొడవు, 30 మీటర్ల బెర్త్ వెడల్పు, 2.0 మిలియన్ టీఈయూల వార్షిక కంటెయినర్ నిర్వహణ సామర్థ్యంతో రెండో కంటెయినర్ టెర్మినల్‌ను అభివృద్ధి చేయాలని ఈ ప్రాజెక్టు లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ టెర్మినల్‌ను రెండు దశల్లో అభివృద్ధి చేస్తారు. మొదటి దశలో 1.1 మిలియన్ టీఈయూల సామర్థ్యం, రెండో దశలో 0.9 మిలియన్ టీఈయూల సామర్థ్యంతో ఈ టెర్మినల్‌ను అభివృద్ధి చేస్తారు.

(ii)   24,346 టీఈయూల వరకు సామర్థ్యం కలిగిన, మొత్తం 400 మీటర్ల పొడవు, 18 మీటర్ల డిజైన్ డ్రాఫ్ట్ కలిగిన నౌకలతో సహా పెద్ద కంటెయినర్ నౌకలను నిర్వహించేందుకు అనువుగా ఈ టెర్మినల్‌ను రూపొందించారు. ఇది ప్రధాన రవాణా మార్గాల్లో నడిచే పెద్ద నౌకలను నిర్వహించడంలో కేపీఎల్ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాలతో అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది.

(iii)  చెన్నై-ఎన్నోర్ పారిశ్రామిక, ఆర్థిక ప్రాంతం నుంచి, విస్తృతమైన దక్షిణ ప్రాంతం నుంచి కంటెయినర్ ఎగుమతి-దిగుమతి (ఎగ్జిమ్) సరకులకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్యోద్దేశం. ఇక్కడి నుంచి రవాణా అయ్యే ప్రధాన సరకు విభాగాల్లో ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాలు, ఇంజనీరింగ్ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, ఇతర తయారీ రంగ ఉత్పత్తులు ఉన్నాయి.

(iv)  కేపీఎల్ నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరంలో 49.08 మిలియన్ టన్నుల సరుకు, 1,008 నౌకలు రాకపోకలు సాగించాయి. దీనిలో 0.7 మిలియన్ టీఈయూలకు పైగా కంటెినర్ ట్రాఫిక్ కూడా ఉంది. ప్రస్తుతం ఉన్న కంటెయినర్ టెర్మినల్‌కు సంవత్సరానికి 0.8 మిలియన్ టీఈయూల సామర్థ్యం ఉంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సుమారు 0.7 మిలియన్ టీఈయూలను నిర్వహించింది. ఇది దాదాపు 88% వినియోగాన్ని సూచిస్తుంది.

(v)   గడచిన అయిదేళ్లలో భారతదేశంలో కంటెయినర్ ట్రాఫిక్ సుమారు 7 శాతం సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను సాధించింది. అదే సమయంలో కేపీఎల్ కంటెయినర్ ట్రాఫిక్ సుమారుగా 9.9శాతం వృద్ధిని సాధించింది. ఆగ్నేయ ప్రాంతంలో కంటెయినర్ రవాణా వృద్ధి ఇలాగే కొనసాగుతుందని సాధ్యాసాధ్యాల అధ్యయనం అంచనా వేస్తోంది. తద్వారా కేపీఎల్ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరాన్ని ఇది సమర్థిస్తోంది.

(vi)  ఈ ప్రాజెక్టును 40 సంవత్సరాల రాయితీ కాలానికి డీబీఎఫ్‌వోటీ పద్ధతిలో అమలు చేస్తారు. దీనిలో 48 నెలల నిర్మాణ కాలం వ్యవధి కూడా ఉంది. రాయితీ మంజూరు చేసిన తేదీ నుంచి 24 నెలలలోపు మొదటి దశను పూర్తి చేయాల్సి ఉంటుంది. 25వ నెలలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. రెండో దశ నిర్మాణం 25వ నెల నుంచి 48వ నెల వరకు జరుగుతుంది. 49వ నెలలో పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.

(vii) జీఎస్టీతో సహా ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 4,288.26 కోట్లు. దీనిలో మొదటి దశకు రూ.2,429.32 కోట్లు, రెండో దశకు రూ.1,858.94 కోట్లు కేటాయించారు. ఈ మొత్తాన్ని డీబీఎఫ్‌వోటీ విధానం ద్వారా ఎంపిక చేసిన గుత్తేదారు సంస్థ సమకూర్చనుంది. దీనికి అదనంగా, ప్రాజెక్ట్ ప్రతిపాదనలో సూచించినట్లుగా డ్రెడ్జింగ్ కోసం సుమారు రూ.450 కోట్లను కేపీఎల్ ఖర్చు చేయనుంది.

(viii) పారదర్శకమైన, అందరికీ అవకాశం కల్పించే అంతర్జాతీయ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఈ ప్రాజెక్టును అమలు చేయాలని ప్రతిపాదించారు. ఒప్పంద నిబంధనలు, అమల్లో ఉన్న టారిఫ్ విధానానికి అనుగుణంగా రాయితీ పొందిన సంస్థ అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకుని, వినియోగదారుల రుసుముల ద్వారా తన పెట్టుబడిని తిరిగి రాబట్టుకుంటుంది.

(ix) మారిటైమ్ ఇండియా విజన్–2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్–2047లకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును సిద్ధం చేశారు. ఇది భారత తూర్పు తీరంలో ప్రధాన కంటెయినర్ పోర్టుగా కేపీఎల్ స్థానాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు సముద్ర రవాణా వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడానికి, ఎగ్జిమ్ వాణిజ్య వృద్ధికి తోడ్పడుతుందని భావిస్తున్నారు.

అమలు వ్యూహం, లక్ష్యాలు:

ఎంపిక చేసిన గుత్తేదారు సంస్థ డీబీఎఫ్‌వోటీ విధానంలో ఈ ప్రాజెక్టును అమలు చేస్తుంది. రాయితీ మంజూరు చేసిన తేదీ నుంచి 24 నెలల్లోపు 1.1 మిలియన్ టీఈయూల సామర్థ్యం కలిగిన మొదటి దశను పూర్తి చేయాలి. 25వ నెలలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. 0.9 మిలియన్ టీఈయూల సామర్థ్యం కలిగిన రెండో దశను 48వ నెల నాటికి పూర్తి చేయాలి. 49వ నెలలో పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. బిడ్ దాఖలుకు నిర్దేశించిన గడువు కంటే ముందే, నిర్ణీత కాలపరిమితిలో పర్యావరణపరమైన, ఇతర అవసరమైన అనుమతులను పొందేందుకు కూడా ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలో వెసులుబాటు కల్పించారు.

ప్రధాన ప్రభావం:

(i) ఏటా అదనంగా 2.0 మిలియన్ టీఈయూల సామర్థ్యం తోడవడం వల్ల పెరుగుతున్న కంటెయినర్ రవాణాను నిర్వహించడంలో కేపీఎల్ సామర్థ్యం మరింత బలోపేతమవుతుంది. అలాగే తమిళనాడులోని పారిశ్రామిక క్లస్టర్లు, పరిసర ప్రాంతాల నుంచి చేపట్టే ఎగ్జిమ్ కార్గో రవాణాకు కీలకంగా మారనుంది.

(ii) ఈ టెర్మినల్‌కు ఉన్న 18 మీటర్ల డిజైన్ డ్రాఫ్ట్, భారీ కంటెయినర్ నౌకలను నిర్వహించే సామర్థ్యం వల్ల అంతర్జాతీయ అనుసంధానం మెరుగుపడనుంది. తద్వారా ప్రధాన మార్గాల్లో ప్రయాణించే భారీ నౌకలు నేరుగా ఈ పోర్టుకు రావడానికి వీలు కలుగుతుంది. ఫలితంగా, విదేశీ లోతైన జలాల ప్రధాన పోర్టులపై ఆధారపడటంతో పాటు వాటికి అనుసంధానంగా నడిపే చిన్న నౌకల రవాణా ఖర్చులు తగ్గుతాయని భావిస్తున్నారు.

(iii) ఈ ప్రాజెక్ట్ సముద్ర రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని, వాణిజ్యం, తయారీ రంగానికి మద్దతు ఇస్తుందని, ఓడరేవు ఆదాయ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని, నౌకావాణిజ్యంలో భారత్ పోటీతత్వానికి మరింత దోహదపడుతుందని భావిస్తున్నారు.

(iv) ఈ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 750 మందికి ఉపాధి లభిస్తుందని, కార్యకలాపాలు ప్రారంభమయిన అనంతరం 800 మందికి ఉపాధి దొరుకుతుందని అంచనా వేస్తున్నారు.

(v) దేశీయ ఓడరేవుల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు ఈ ప్రాజెక్టు తోడ్పడుతుంది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమలు, ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులకు రవాణా సదుపాయాలను మరింత మెరుగుపరుస్తుంది.

(vi) పీపీపీ విభాగంలో పెట్టుబడిని ఎంపికైన సంస్థ సమకూరుస్తుంది. కాబట్టి భారత ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదు.

 

నేపథ్యం:

(i)  భారతదేశంలోని 12 ప్రధాన ఓడరేవుల్లో కామరాజర్ పోర్టు ఒకటి. గతంలో దీనిని ఎన్నోర్ పోర్టుగా పిలిచేవారు. కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలరవాణా మంత్రిత్వ శాఖ పరిధిలోని చెన్నై పోర్ట్ అథారిటీకి చెందిన పూర్తి స్థాయి అనుబంధ సంస్థ ఇది. తమిళనాడు తూర్పు తీరంలో, చెన్నై పారిశ్రామిక, ఆర్థిక ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ పోర్టు బొగ్గు, పెట్రోలియం, చమురు, కందెనలు, ఎల్‌ఎన్‌జీ, ఎల్‌పీజీ, కంటెయినర్లు, ఆటోమొబైల్స్, సాధారణ కార్గో సహా పలు రకాల సరుకులను నిర్వహిస్తుంది

(ii) 2025–26 ఆర్థిక సంవత్సరంలో కేపీఎల్ సుమారు రూ.1,280 కోట్ల ఆదాయాన్ని, పన్ను చెల్లింపునకు ముందు రూ.924 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. గత అయిదేళ్లలో ఈ పోర్టు సరుకు రవాణా సీఏజీఆర్ వృద్ధిరేటు 13.64 శాతంగా నమోదైంది. ఇది పరిసర ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు, వాణిజ్య విస్తరణను ప్రతిబింబిస్తోంది.

(iii) భారతదేశంలోని ప్రధాన పారిశ్రామిక, తయారీ క్లస్టర్లలో చెన్నై–ఎన్నోర్ ప్రాంతం ఒకటి. వాణిజ్యం, కంటెయినర్ల వినియోగం విస్తరిస్తున్న నేపథ్యంలో తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఇతర దక్షిణాది ప్రాంతాల నుంచి ఎగ్జిమ్ కార్గో రవాణాకు మద్దతుగా అదనపు కంటెయినర్ నిర్వహణ సామర్థ్యం, భారీ నౌకల కోసం సమర్థవంతమైన సదుపాయాల అవసరం ఏర్పడింది.

***


(రిలీజ్ ఐడి: 2341416) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Nepali , Bengali , Bengali-TR , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam