57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

‘‘ప్రజలను ఒక చోటుకు చేర్చి సినిమా పండుగను జరుపుకొందాం’’:


ఇఫి-2026లో మనసులను గెలిచిన గుజరాతీ చిత్రం ‘లాలో-కృష్ణ సదా సహాయతే’

నాడు పోస్టు చేయడమైనది: 24 NOV 2026 8:42PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2341102Views: 12

గోవాలో నిర్వహిస్తున్న భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ..‘ఇఫి’) 2026లో ఈ రోజు ఇండియన్ పనోరమా విభాగంలో ఆధ్యాత్మికత ప్రధానమైన గుజరాతీ చలనచిత్రం ‘లాలో-కృష్ణ సదా సహాయతే’ను ప్రదర్శించారు. ఈ చిత్రానికి శ్రీ అంకిత్ భూపత్‌భాయి సఖియా దర్శకత్వం వహించారు. సంఘర్షణకు లోనైన ఓ రిక్షా కార్మికుడి కథను ఈ చిత్రం చెబుతుంది. అతడి గతం దు:ఖభరితం. పేదరికంలో మగ్గుతూ, అతడు తన జీవనాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకసారి ఓ మారుమూల ఫాంహౌసులో చిక్కుకుపోతాడు. అతడు చేసిన అపరాధం అక్కడ కూడా అతడిని వెంబడించి సతాయిస్తూ ఉంటుంది. ఉన్నట్లుండి భగవాన్ కృష్ణుని దర్శనం లభించడంతో, మోక్షాన్ని ప్రాప్తింప చేసుకోవాలని అతడు యత్నిస్తాడు. చిత్ర దర్శకుడు శ్రీ సఖియా ఈ రోజు ఇఫిలో పత్రికా ప్రతినిధుల సమావేశంలో ప్రసంగిస్తూ చలనచిత్ర నిర్మాణం గురించి, అందులో ప్రస్తావించిన ఆధ్యాత్మిక విషయాలను గురించి, టికెట్ల కిటికీ వద్ద ఊహించని విజయం దక్కడం గురించి తెలియజేశారు.


ప్రధానంగా ఈ చలన చిత్రం విశ్వాసం, దృఢత్వాలకున్న ప్రాధాన్యాన్ని బోధిస్తుంది. ముఖ్య పాత్రధారికి భగవాన్ కృష్ణుడు మౌన సహచరునిగా ఉంటూ, మార్గదర్శనం చేస్తాడు. దీంతో ముఖ్య పాత్రధారి ఆత్మ మథనం మొదలవుతుంది. తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఘటనల నుంచి ఊరటను పొందే మార్గం అతడికి కనపడుతుంది. ప్రేమ, నమ్మకం, ఆంతరంగిక పరివర్తన వంటి సార్వత్రిక విషయాల ద్వారా ప్రేక్షకులకు భావాత్మక అనుబంధాన్ని ఏర్పరచాలని తాను కోరుకున్నానని దర్శకుడు వెల్లడించారు.
సినిమాకు పెట్టిన పేరులో ‘లాలో’ను గురించి శ్రీ సఖియా ప్రస్తావించి, అది భగవాన్ కృష్ణుని ముద్దుపేరని, బాల్యంలో మగ పిల్లలను తరచు ఆ పేరుతో పిలుస్తుంటారన్నారు. శ్రీ సఖియా తీసిన మొదటి కథాచిత్రం ఇది. పరిమిత బడ్జెట్టులో దీనిని రూపొందించారు. దీని నటవర్గంలో భాగమైన స్నేమితులు కూడా చిత్ర నిర్మాణ బడ్జెట్టులో తమ వంతు సాయాన్ని అందించారు.
ఈ చిత్రం క్రమ క్రమంగా ప్రజల నోళ్లలో నాని చక్కని ఆదరణను సంపాదించుకోగలిగిందని, ఇంతవరకు దాదాపు రూ.130 కోట్ల వసూళ్లను రాబట్టిందని శ్రీ సఖియా గుర్తుచేసుకున్నారు. ప్రేక్షకవర్గాల ప్రతిస్పందనలను ప్రచారం చేసి ఈ సినిమాను ఎక్కువ మంది చెంతకు చేర్చిన ఖ్యాతి సామాజిక మాధ్యమానికే చెందుతుందని ఆయన అన్నారు. ఈ చిత్రాన్ని తన స్వగ్రామంలో ప్రదర్శించినప్పటి విశిష్ట అనుభూతిని ఆయన నెమరు వేసుకుంటూ, తన పల్లెవాసులు వారి ఆప్యాయతతో పాటు ఆశీర్వాదాలను తనకు అందించారన్నారు.

 


శ్రీ సఖియా తన సృజనాత్మక శైలిని గురించి చెబుతూ, గర్‌బా ప్రభావం సినిమా సంగీతంపై ఉందని, భావనలను వ్యక్తం చేయనిచ్చేందుకు వీలుగా క్లోజ్-అప్ షాట్ల పద్ధతిని ఎంపిక చేసుకున్నానన్నారు. సంగీత దర్శకత్వం వహించిన వ్యక్తి ఆస్ట్రేలియాలో ఉంటారని, అక్కడి నుంచే తన తోడ్పాటును అందించారని తెలిపారు. సినిమాలో దృశ్యాలపరంగా భవ్యతకు పెద్ద పీట వేయడానికి బదులుగా స్వాభావిక నటన, సంభాషణలు, భావోద్వేగాల తీవ్రతను కళ్లకు కట్టడానికి యత్నించామన్నారు. చిత్రం సీదాసాదాగా ఉంటూ, కథనం చాలావరకు ఎగుడు దిగుడులు, ముందు వెనుకలు లేని పద్ధతిలో సరళరేఖ మాదిరి సాగుతుందని, అయినప్పటికీ ప్రేక్షకలోకం మమేకం అయ్యేటట్లు కథనం ఉండాలని తాను అనుకున్నానని శ్రీ సఖియా వివరించారు. కథ కూడా స్వాభావిక పద్ధతిలో ఆవిష్కారమైందని తెలిపారు.
గుజరాతీ సినిమా భవిష్యత్తును గురించి శ్రీ సఖియా మాట్లాడుతూ, అనేక కథలు రాష్ట్ర సుసంపన్న సాంస్కృతిక వారసత్వంలో ఇమిడిపోయి ఉన్నాయని, వాటిని ఇంతవరకు తెర మీదకు తీసుకురాలేదన్నారు. ప్రాంతీయ సినిమా ఉనికి విస్తరిస్తూ ఉండడం ఆశాజనకమని, వాణిజ్య సాఫల్యంతో పాటు అర్థవంతమైన కథన కళకు ప్రాధాన్యాన్ని ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని శ్రీ సఖియా స్పష్టం చేశారు.


కార్యక్రమాన్ని శ్రీ కుల్‌దీప్ మీనా సమన్వయపరిచారు.
ఇఫిలాయిడ్‌ (IFFILOID) ను ఈ కింది వెబ్ చిరునామాలో చదవగలరు:
https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2341102
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026