గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)లో మిడ్-ఫెస్ట్ చిత్రంగా నిలిచిన 'ఐ మ్యాటర్' (యూ కాంటెజ్) దర్శకురాలు, రొమేనియన్-రోమా చిత్ర రూపకర్త అయిన ఎలీనా షెర్బాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘రోమా సమాజం నుంచి వెలుగులోకి రాని కథలు ఎన్నో ఉన్నాయి’’ అని అన్నారు.
ఇఫీ నేపథ్యంలో ఈరోజు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) నిర్వహించిన విలేకరుల సమావేశంలో షెర్బాన్ మాట్లాడారు. ఈ సినిమా వెనుక ఉన్న స్ఫూర్తిని, రోమా సమాజాన్ని చిత్రీకరించిన విధానాన్ని, సినిమా ద్వారా మూస ధోరణులను సవాలు చేయడానికి ఉన్న ప్రాధాన్యం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నటీమణులు డెనిసా ఫార్కాష్, వనెస్సా డాన్సియా కూడా పాల్గొన్నారు.

రొమేనియన్, రోమానీ భాషల్లో సంభాషణలు ఉన్న బహుభాషా కథే ఈ ‘ఐ మ్యాటర్’. ఈ రోజు ఇఫీలో ఈ సినిమా ఇండియా ప్రీమియర్ పూర్తి చేసుకుంది. రొమేనియా, జర్మనీ, బెల్జియం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమా గుర్తింపు, కుటుంబం, అనుబంధం, గతాన్ని అధిగమించి భవిష్యత్తును నిర్మించుకోవడం లాంటి అంశాలను అన్వేషిస్తుంది. తన ఇంటిగా భావించిన అనాథాశ్రమాన్ని విడిచి వెళ్ళడానికి సిద్ధమవుతున్న రెబెకా అనే రోమా యువతి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. జైలు నుంచి విడుదలవబోతున్న తన తండ్రిని తిరిగి కలుసుకోవాలని, కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న తన చిరకాల కాంక్షను నెరవేర్చుకోవాలని ఆమె భావిస్తుంది. ఈ తరుణంలో నటనను అభ్యసించడానికి విశ్వవిద్యాలయంలో ఆమెకు ప్రవేశం లభిస్తుంది. ఇది ఆమెకు కొత్త ప్రారంభాన్ని అందిస్తుంది.
సినిమా ద్వారా మూస పద్ధతులను సవాలు చేయడం గురించి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ఈ చిత్రం మానవత్వంలోని విభిన్న కోణాలను అన్వేషించడానికి ప్రయత్నిస్తుందని చెప్పారు. ‘‘మనిషిగా జీవించడానికి ఎవరు అర్హులు అనే ప్రశ్నను ఈ సినిమా అడుగుతుంది. మానవత్వంలోని విభిన్న కోణాలను నేను చిత్రీకరించాలనుకుంటున్నాను’’ అని తెలియజేశారు. ఇఫీలో భాగమైనందుకు ఆమె సంతోషం వ్యక్తం చేశారు. సొంతింటికి తిరిగి వచ్చిన అనుభూతిని భారత్‌లో తన పర్యటన ఇచ్చిందన్నారు.

తెరపై రోమా సమాజాన్ని చిత్రించడంలో ఎదురయ్యే సవాళ్ల గురించి షెర్బాన్ వివరించారు. గణనీయమైన సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్నప్పటికీ తమ సమాజం ఈ నాటికీ వెనకబడే ఉందని తెలియజేశారు. ‘‘ఫ్లమెంకో లాంటి మా సంస్కృతి విశ్వ సంస్కృతిపై ప్రభావం చూపింది. కానీ మేము ఇప్పటికీ సమాజపు చివరి అంచుల్లోనే ఉన్నాం. మేము ఇతరులకు చాలా దగ్గరగానే ఉన్నప్పటికీ, వారికి మా గురించి ఇంకా తెలియదు” అని ఆమె అన్నారు.
ఈ సినిమా అందించిన సాధికారత సందేశం గురించి షెర్బాన్ వివరించారు. ముఖ్యంగా వెనకబడిన వర్గాలకు చెందిన యువతను చేరుకోవాలని తాను భావిస్తున్నట్లు తెలియజేశారు. ‘‘వెనకబడిన వర్గాలకు చెందిన యువతకు సాధికారతను అందించే కథను ముందుగా చెప్పాలనుకున్నాను. నేను ఏ మాటలైతే వినాలనుకున్నానో వారికి కూడా అదే చెప్పాలని భావించాను. అదే... నేను చేయగలను, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక చిన్న చోటు ఉండే ఉంటుంది” అని ఆమె చెప్పారు.
_20261124202307_7028c7.jpeg)
తన సొంత గుర్తింపుతో తనుకున్న సంబంధాన్ని మార్చేసిన వ్యక్తిగత అనుభవంగా ఈ చిత్రాన్ని ప్రధాన పాత్ర రెబెకాగా నటించిన డెనిసా ఫార్కాష్ అభివర్ణించారు. తన రోమా జాతి మూలాల గురించి చెప్పుకోవడానికి మొదట్లో తాను సంకోచించిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ‘‘మొదటిసారిగా రోమా ప్రజలను సానుకూల కోణంలో చూశాను’’ అని ఆమె అన్నారు. ఈ పాత్ర పోషించడం వల్ల తన గుర్తింపు పట్ల ఉన్న సంకోచాన్ని అధిగమించి, తన మూలాలను గర్వంగా స్వీకరించగలిగానని ఆమె అన్నారు. ‘‘నేను రోమా సమాజానికి చెందిన వ్యక్తిని కావడం నాకు గర్వంగా ఉంది’’ అని చెప్పారు. తమ సమాజపు కథలు, అందులోని పిల్లల గాథలు ఎట్టకేలకు అందరికీ చేరువ అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా ప్రాంజల్ రాయ్ వ్యవహరించారు.
Read IFFILOID here:
https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48
***