137 నిమిషాల నిడివి గల ఈ చిత్రం... నటుడిగా నిలదొక్కుకోవడానికి పోరాడుతున్న యువకుడైన ఆదిత్యకు, ఉత్సాహవంతుడైన అతని తాతయ్య అనంత రావుకు మధ్య ఆత్మీయ అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరిస్తుంది. ఆదిత్యగా సంకర్షణ్ కర్హాడే, అనంత రావుగా ప్రముఖ సీనియర్ నటుడు అశోక్ సరాఫ్ నటించారు. అశోక్ సరాఫ్ ఇటీవలే ప్రతిష్ఠాత్మక 'పద్మశ్రీ' పురస్కారం అందుకున్నారు.
లిమాయే మీడియాతో మాట్లాడుతూ... ఇద్దరు పాత్రధారులు ఆర్థికపరమైన, వ్యక్తిగత సవాళ్లను ఎదుర్కొంటున్న క్రమంలో వారి మధ్య ఆప్యాయత, సరదా సంభాషణలు, పరస్పర సహకారంతో కథ ఎలా ముందుకు సాగుతుందో వివరించారు. ఒక ప్రమాదం వల్ల అనంత రావు మంచానికి పరిమితం కావడంతో వారి అనుబంధం క్లిష్టమైన మలుపు తిరుగుతుంది. దీంతో తాతయ్య బాగోగులు చూసుకునే బాధ్యతను, తన నటనా ఆశయాలను సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి ఆదిత్యకు ఎదురవుతుంది. ఒత్తిడి, నిరాశ కారణంగా వారి బంధంలో మనస్పర్థలు తలెత్తుతున్న నేపథ్యంలో.. కుటుంబ బాధ్యత, సంరక్షణకు సంబంధించి తరచుగా ఎవరూ పట్టించుకోని కఠోర వాస్తవాలను, నేటి ఆధునిక జీవితంలో విజయానికి అసలైన అర్థాన్నీ ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది.
నటుడు, రచయిత అయిన సంకర్షణ్ కర్హాడే తొలిసారి ఈ కథను వినిపించినప్పుడు తాను ఎంతో భావోద్వేగానికి లోనయ్యానని లిమాయే గుర్తుచేసుకున్నారు. తన తండ్రి చివరి రోజుల్లో ఆయనకు చేసిన సేవల జ్ఞాపకాలను ఈ కథ మళ్లీ కళ్లముందు నిలిపిందని ఆయన పేర్కొన్నారు. మరాఠీ నేపథ్యంతో రూపొందిన కథ అయినప్పటికీ, ఇందులోని భావోద్వేగాలు భాషలకు అతీతంగా... దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోని ప్రతి కుటుంబంలో కనిపించే అనుభవాలకు అద్దం పడతాయని ఆయన వివరించారు.
చిత్ర సంగీతం, చిత్రం కోసం పనిచేసిన బృంద సమష్టి కృషి గురించి లిమాయే మాట్లాడుతూ... 'ఆది అనంత్'లో శాస్త్రీయ సంగీత గాయకులు రాహుల్ దేశ్‌పాండే ఆలపించిన ఒక భక్తి గీతం (భజన) ఉందనీ, ఈ పాటలో అశోక్ సరాఫ్ తెరపై తబలా వాయిస్తూ కనిపిస్తారని వెల్లడించారు. అశోక్ సరాఫ్ వినయం, అంకితభావాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఎంతో సంక్లిష్టమైన, తనకు కొత్తదైన ఈ పాత్రను ఆ సీనియర్ నటుడు... ఒక కొత్త నటుడిలా ఎంతో ఉత్సాహంతో, నిబద్ధతతో పోషించారని కొనియాడారు. సరాఫ్, కర్హాడే మధ్య ఉన్న పరస్పర గౌరవం వల్ల తెరపై వారి అనుబంధం ఎంతో సహజంగా, అద్భుతంగా కనిపించిందని ఆయన పేర్కొన్నారు.
ఆరంభాన్ని సూచించే 'ఆది'కి, శాశ్వతత్వాన్ని సూచించే 'అనంత'కు మధ్య వైరుధ్యాన్ని 'ఆది అనంత్' అనే టైటిల్ చక్కగా స్పష్టం చేస్తుంది. తరాల మధ్య కొనసాగే అనుబంధాలను ఈ చిత్రం లోతుగా విశ్లేషిస్తుందనే విషయాన్నీ ఇది ప్రతిబింబిస్తోంది.
ముంబైలోని ప్రతిష్టాత్మక జె.జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్ పూర్వ విద్యార్థి అయిన మహేష్ లిమాయే ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'యెల్లో' మూడు జాతీయ చలనచిత్ర పురస్కారాలను గెలుచుకుంది. రెండో చిత్రం 'జగ్గు అని జూలియట్' మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడు చలనచిత్ర పురస్కారాలను సొంతం చేసుకుంది. దర్శకుడిగా 'ఆది అనంత్' చిత్రం ఆయనకు మూడో చలనచిత్రం.
ఈ మీడియా సమావేశానికి శివరాజ్ గంగావాల్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఇఫిలాయిడ్ (ఐఎఫ్ఎఫ్ఐఎవ్‌వోఐడి) సంచికను ఇక్కడ చదవండి:
https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48
***