57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

57వ ఇఫీలో భాగంగా ఐఐసీటీ - వాకోమ్ ఇండియా మధ్య వ్యూహాత్మక అవగాహన ఒప్పందం.. భారత్ - జపాన్ సృజనాత్మక సహకారాన్ని బలోపేతం చేసే దిశగా కీలక చర్య


స్కాలర్‌షిప్‌లు, వృత్తిపరమైన సాధనాలు, ప్రపంచవ్యాప్త మార్గనిర్దేశం, పరిశ్రమ అనుభవం ద్వారా ఏవీసీజీ-ఎక్స్ఆర్ ప్రతిభావంతులకు ప్రోత్సాహాన్నిచ్చే చర్య

నాడు పోస్టు చేయడమైనది: 23 NOV 2026 3:06PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2340423Views: 2

యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఏవీసీజీ- ఎక్స్ఆర్) రంగాల్లో దేశంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సుగా ఉన్న ‘భారత సృజనాత్మక సాంకేతికతల సంస్థ (ఐఐసీటీ)’.. 57వ ఇఫీలో భాగంగా వాకోమ్ ఇండియాతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సృజనాత్మక సాంకేతికతలు, నైపుణ్యాభివృద్ధిలో భారత్ - జపాన్ మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవడమే దీని ముఖ్య లక్ష్యం.

భారతీయ విద్యార్థులకు వృత్తిపరమైన ఆధునిక సాధనాలు, పరిశ్రమ ఆధారిత శిక్షణను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేవడం ఈ భాగస్వామ్య ముఖ్య లక్ష్యం. ఈ ఒప్పందం ప్రకారం.. ఐఐసీటీ అందిస్తున్న యానిమేషన్ ఫిల్మ్ డిజైన్, ఇంటరాక్టివ్ వీడియో గేమ్ డిజైన్ - డెవలప్‌మెంట్, పోస్ట్ ప్రొడక్షన్ - వీఎఫ్‌ఎక్స్ అనే 3 రెండేళ్ల డిప్లొమా కోర్సుల్లో మొత్తం 18 మంది విద్యార్థులకు 50 శాతం ట్యూషన్ ఫీజు స్కాలర్‌షిప్ లభిస్తుంది. దీనితో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అర్హులైన విద్యార్థులకు వసతి సదుపాయానికి సంబంధించిన ఆర్థిక సాయం కూడా అందుతుంది.

జపాన్, భారతీయ కళాకారులు, నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించే 10 వాకోమ్ బ్రాండెడ్ సృజనాత్మక పోటీలు, అలాగే మాంగా, యానిమె, ఇతర సృజనాత్మక విభాగాలపై మూడు నెలల మాస్టర్‌క్లాసుల ద్వారా.. 2027 డిసెంబరు నాటికి విద్యార్థులకు వ్యవస్థీకృత మార్గదర్శకత్వాన్ని, అంతర్జాతీయ స్థాయి గుర్తింపును ఈ భాగస్వామ్యం అందిస్తుంది. విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా పోర్ట్‌ఫోలియోలను తీర్చిదిద్దుకునేందుకు వీలుగా.. డిజిటల్ ఇలుస్ట్రేషన్, కాన్సెప్ట్ ఆర్ట్, క్యారెక్టర్ డిజైన్, యానిమేషన్, గేమ్ ఆర్ట్ విభాగాలతో కూడిన ఒక అంతర్జాతీయ విద్యార్థి పోర్ట్‌ఫోలియో ప్రదర్శన వేదికను ఈ రెండు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తాయి. పరస్పర అంగీకారంతో కూడిన కార్యాచరణ ప్రణాళికలకు లోబడి.. వాకొమ్ టాబ్లెట్ ప్యాకేజింగ్‌, దాని ‘పిక్సెల్ పెర్చ్’ క్రియేటర్ ప్లాట్‌ఫాంలో ఐఐసీటీ ఏకీకరణకు కూడా ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది.

ఈ సందర్భంగా ఐఐసీటీ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ ఆశిష్ కులకర్ణి మాట్లాడుతూ.. యువ సృజనకారులను అంతర్జాతీయ వ్యవస్థలతో అనుసంధానించడం దేశ సృజనాధార ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. యానిమేషన్, మాంగా, గేమింగ్ రంగాల్లో జపాన్‌కు ఉన్న నైపుణ్యాన్ని, దేశంలోని వైవిధ్యభరితమైన కథన వారసత్వంతో ఏకం చేయడానికీ, తద్వారా అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం స్వీయ మేధో సంపత్తిని విద్యార్థులు సృష్టించడానికీ ఈ భాగస్వామ్యం అవకాశాన్నిస్తుందని ఆయన వివరించారు.

ఏవీజీసీ - ఎక్స్‌ఆర్ రంగంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో ఆచరణాత్మక అనుభవానికి ఉన్న ప్రాధాన్యాన్ని ఐఐసీటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ విశ్వాస్ దేవ్‌స్కర్ ప్రధానంగా ప్రస్తావించారు. పోటీలు, మాస్టర్‌క్లాసులు, వృత్తిపరమైన ఆధునిక సాధనాలు, పోర్ట్‌ఫోలియో అభివృద్ధి వంటివి వాస్తవిక ప్రాజెక్టుల్లో పనిచేయడానికి, పరిశ్రమ అవసరాలకు సిద్ధంగా ఉన్నామని నిరూపించుకోవడానికి విద్యార్థులకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.

యానిమేషన్, మాంగా, గేమింగ్, డిజిటల్ కంటెంట్ రంగాల్లో భారత్, జపాన్ మధ్య సృజనాత్మక సహకారం, వైజ్ఞానిక వినిమయానికి ఉన్న అపార అవకాశాలను వాకోమ్ సంస్థలోని క్రియేటివ్ ఎక్స్‌పీరియన్స్ యూనిట్ గ్లోబల్ హెడ్ కోజి యానో వివరించారు. డిజిటల్ ఇంక్ వంటి వాకోమ్ సాంకేతికతలు యువ భారతీయ సృజనకారులు కలిసి పనిచేయడానికి, అంతర్జాతీయ సృజనాత్మక భాగస్వామ్యాలలో పాలుపంచుకోవడానికి ఎంతగానో తోడ్పడతాయని ఆయన తెలిపారు.

ఐఐసీటీ గురించి:

‘భారత సృజనాత్మక సాంకేతికతల సంస్థ (ఐఐసీటీ).. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఏవీసీజీ-ఎక్స్ఆర్) రంగాల్లో భారత్‌లోని జాతీయ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఉంది. కేంద్ర సమాచార - ప్రసార మంత్రిత్వశాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం, ఫిక్కీ, సీఐఐ భాగస్వామ్యంతో దీనిని నెలకొల్పారు. 2025 జూలైలో ముంబయిలోని ఎన్‌ఎఫ్‌డీసీ కాంప్లెక్సులో దీని మొదటి క్యాంపస్ కార్యకలాపాలు ప్రారంభమవగా.. ఫిల్మ్ సిటీలో శాశ్వత క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఐఐసీటీ ప్రస్తుతం 18 కోర్సులను అందిస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ సాంకేతిక, మీడియా సంస్థలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

ఇఫిలాయిడ్‌ను ఇక్కడ చదవండి: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48  

 

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2340423
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026