57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

షూటింగ్ అనుమతులు మరింత సులభతరం... ప్రపంచ చిత్ర నిర్మాణ కేంద్రంగా భారత్‌కు పెరిగిన ఆదరణ


షూటింగ్ అనుమతులన్నింటికీ ఒకే డిజిటల్ వేదిక... 57వ ఐఎఫ్ఎఫ్ఐ ప్యానెల్ చర్చలో వెల్లడి

నాడు పోస్టు చేయడమైనది: 22 NOV 2026 4:44PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2340218Views: 5

ప్రపంచస్థాయి చిత్రీకరణ, నిర్మాణ కేంద్రంగా భారత్‌కు పెరుగుతున్న ఆదరణపై 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) వేదికగా నిర్వహించిన చర్చలో ప్రధానంగా దృష్టి సారించారు. అంతర్జాతీయ చిత్ర నిర్మాణ రంగంలో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసే అవకాశాలపై విధాన నిర్ణేతలు, సినీ పరిశ్రమ దిగ్గజాలు చర్చించారు.

‘చిత్రీకరణ సులభతరం: ప్రపంచ చిత్రీకరణ, నిర్మాణ కేంద్రంగా భారత్ ఎదుగుదల’ అంశంపై నిర్వహించిన ఈ చర్చాగోష్ఠిలో... సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ పృథుల్ కుమార్, స్క్రీన్ ఆస్ట్రేలియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీమతి గ్రెయిన్ బ్రండ్సన్, ప్రముఖ నటుడు-దర్శకుడు-నిర్మాత శ్రీ అనుపమ్ ఖేర్ పాల్గొన్నారు.

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ) నిర్వహిస్తున్న సింగిల్-విండో డిజిటల్ వేదిక 'ఇండియా సినీ హబ్' (ఐసీహెచ్)... భారత్‌లో చలనచిత్ర నిర్మాణాన్ని సులభతరం చేస్తున్న తీరుపై ఈ కార్యక్రమంలో సమగ్రంగా చర్చించారు. ప్రముఖ సినీ విమర్శకుడు, పాత్రికేయుడు రాజీవ్ మసంద్ ఈ చర్చాగోష్ఠికి సమన్వయకర్తగా వ్యవహరించారు.

చర్చను ప్రారంభిస్తూ... 'ఇండియా సినీ హబ్' పోర్టల్‌లో రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానించడం షూటింగ్ అనుమతులను సులభతరం చేసే దిశగా ఒక కీలక ముందడుగని శ్రీ పృథుల్ కుమార్ పేర్కొన్నారు. మున్సిపల్ సంస్థలు, ట్రాఫిక్ విభాగాలు, భారతీయ రైల్వే, భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) సహా వివిధ విభాగాల అనుమతులు పొందేందుకు చిత్ర నిర్మాతలు ఇప్పుడు ఒకే డిజిటల్ వేదిక ద్వారా ఉమ్మడి దరఖాస్తు ఫారంను ఉపయోగించుకోవచ్చని ఆయన వివరించారు.

ఈ పోర్టల్‌లో సుమారు 32 రకాల సేవలను అనుసంధానించినట్లు శ్రీ పృథుల్ కుమార్ తెలిపారు. దరఖాస్తుదారులు ప్రత్యేక డ్యాష్‌బోర్డ్ ద్వారా తమ దరఖాస్తుల స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చనీ, అవసరమైన చోట సురక్షిత చెల్లింపు లింకుల ద్వారా రుసుములను సులభంగా చెల్లించవచ్చని ఆయన వివరించారు. 'డిజిటల్ స్కై' వేదిక ద్వారా లభించే డ్రోన్ సంబంధిత అనుమతులనూ ఇందులో అనుసంధానించేందుకు కృషి జరుగుతోందని ఆయన వెల్లడించారు.

భారత్‌లో చిత్రీకరణ మరింత సులభతరమవుతున్న తీరును వివరిస్తూ... అంతర్జాతీయ చలనచిత్ర షూటింగ్ అనుమతుల జారీకి నిర్దేశిత గడువు 28 రోజులు కాగా, 2015 నుంచి సగటున కేవలం 18 రోజుల్లోనే అనుమతులు మంజూరవుతున్నాయని శ్రీ పృథుల్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని 'డీమ్డ్-అప్రూవల్' నిబంధననూ ఆయన ప్రస్తావించారు. ఈ నిబంధన ప్రకారం... దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోపు అధికారుల నుంచి ఎటువంటి నిర్ణయం వెలువడకపోతే, ఆ దరఖాస్తుకు ఆమోదం లభించినట్లుగానే పరిగణిస్తారు.

చిత్రీకరణ, సహ-నిర్మాణ కేంద్రంగా భారత్‌కు పెరుగుతున్న ఆదరణను ప్రతిబింబిస్తూ... ఈ తరహా అవకాశాల కోసం భారత్‌ను సంప్రదిస్తున్న అంతర్జాతీయ చిత్ర నిర్మాణ సంస్థల సంఖ్య ఏటా 25–30 నుంచి 100–200కి పెరిగిందని శ్రీ పృథుల్ కుమార్ తెలిపారు. దేశంలోని చిత్ర నిర్మాణ నిపుణులు, సేవా ప్రదాతలు ఈ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ నిర్మాతలు భారత్‌లోని నిర్మాణ వనరులను సులభంగా గుర్తించి, వినియోగించుకునే వీలు కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

భారత్–ఆస్ట్రేలియా సహకార అవకాశాలపై శ్రీమతి బ్రండ్సన్ మాట్లాడుతూ... భారత్‌లోని వైవిధ్యభరితమైన చిత్రీకరణ లొకేషన్లు, సినీ నిపుణుల ప్రతిభ, ప్రేక్షకులతో సినిమాలకు ఉండే బలమైన భావోద్వేగ అనుబంధం అంతర్జాతీయ భాగస్వామ్యాల కోసం భారత్‌ను ఒక ఆకర్షణీయ కేంద్రంగా మార్చాయన్నారు. ఆస్ట్రేలియాలో భారతీయ సినిమాలకు ఆదరణ విపరీతంగా పెరుగుతోందని ప్రస్తావిస్తూ... గతేడాది ఆస్ట్రేలియా చిత్రాల కంటే భారతీయ సినిమాలనే అక్కడి ప్రేక్షకులు ఎక్కువగా వీక్షించారని ఆమె పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో పెరుగుతున్న భారతీయ సంతతి జనాభాతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన సాంస్కృతిక, విద్యా, క్రీడా, వాణిజ్య సంబంధాలు ఉమ్మడి కథా చిత్రాల నిర్మాణానికి గొప్ప అవకాశాలను కల్పిస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.

సినిమా నిర్మాణానికి ప్రభుత్వ మద్దతు ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, శ్రీమతి బ్రండ్సన్ ఇలా అన్నారు... “ప్రతి సినిమా ఒక ఆరంభం, ఒక అద్భుతం. అది ఒక కల లేదా ఆలోచనతో మొదలవుతుంది. దానికి ప్రాణం పోయడానికి అంకితభావం, అభిరుచి, ఇతరుల మద్దతూ అవసరం.”

విజయవంతమైన సహ-నిర్మాణాలు కేవలం ఆర్థిక భాగస్వామ్యం, నష్టభయాన్ని పంచుకోవడానికే పరిమితం కాకుండా... సృజనాత్మక ఆలోచనల మార్పిడికీ గొప్ప అవకాశాలను కల్పిస్తాయని ఆమె పేర్కొన్నారు. భారతీయ, ఆస్ట్రేలియా చిత్ర నిర్మాతలు ఒకరి కథన సంప్రదాయాల నుంచి మరొకరు నేర్చుకునేందుకు ఎంతో అవకాశం ఉందనీ ఆమె అన్నారు. ముఖ్యంగా ప్రవాసుల అనుభవాలు సహా ఇరు దేశాల ఉమ్మడి అంశాలను అన్వేషించడం ద్వారా... రెండు దేశాల ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే కథలను రూపొందించవచ్చని శ్రీమతి బ్రండ్సన్ వివరించారు.

'ఇండియా సినీ హబ్' వేదిక ఏర్పాటులో భారత ప్రభుత్వ చొరవను ప్రశంసిస్తూ... చిత్రీకరణ అనుమతులను పొందే ప్రక్రియ ఇప్పుడు గణనీయంగా మెరుగుపడిందని శ్రీ అనుపమ్ ఖేర్ అన్నారు. భారత్‌లోని వైవిధ్యభరితమైన ప్రకృతి దృశ్యాలు, ఆహారం, వస్త్రధారణ, సాంస్కృతిక నేపథ్యాలు చిత్ర నిర్మాతలకు అద్భుతమైన సృజనాత్మక అవకాశాలను అందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సినిమాకు భౌగోళిక సరిహద్దులు లేవని స్పష్టం చేస్తూ... "భావోద్వేగాలకు వేర్వేరు జాతీయతలు ఉండవు. మనకు కావాల్సిందల్లా చిత్రీకరణకు తగిన అవకాశం మాత్రమే" అని ఆయన వ్యాఖ్యానించారు.

అనుభవం గల నిర్మాతలకే కాకుండా కొత్తవారికి, రచయితలకు, నిర్మాణ నిపుణులకు, భవిష్యత్ దర్శకులకూ సింగిల్ విండో విధానం ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని శ్రీ అనుపమ్ ఖేర్ పేర్కొన్నారు. అనుమతులు ఇప్పిస్తామనే సాకుతో చిత్ర నిర్మాతలను దోచుకునే దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

సరళీకృత అనుమతులు, వైవిధ్యభరితమైన చిత్రీకరణ ప్రదేశాలు, సృజనాత్మక భాగస్వామ్య అవకాశాల అండతో అంతర్జాతీయ చలనచిత్ర నిర్మాణాలకు అత్యంత అనుకూల కేంద్రంగా భారత్ ఎదుగుతున్న తీరుపై ఈ చర్చాలో ప్రధానంగా దృష్టి సారించారు. ప్రపంచస్థాయిలో సినిమా సంబంధిత ఆలోచనలను పంచుకునే వేదికగా ఐఎఫ్ఎఫ్ఐ పోషిస్తున్న పాత్రకు అనుగుణంగా... బలమైన పరిశ్రమ భాగస్వామ్యాలు, చిత్ర నిర్మాణానికి అనుకూలమైన వాతావరణం ప్రపంచ వేదికపై భారతీయ సినిమాకు సరికొత్త మార్గాలను ఎలా అందించగలవో ఈ సదస్సు చాటిచెప్పింది.

ఇఫిలాయిడ్’ (ఐఎఫ్ఎఫ్ఐఎల్‌వోఐడీ) సంచికను ఇక్కడ చదవండి:

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2340218
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026