57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

ఫిల్మ్ స్కూళ్ల పాత్రపై 57వ ‘ఇఫీ’లో సినీ పరిశ్రమ దిగ్గజాల చర్చ


భావి దర్శకులను తీర్చిదిద్దడంలో సంస్థాగత శిక్షణ.. ఆచరణాత్మక అనుభవం.. సంగ్రహణానుకూలత.. క్రమశిక్షణల ప్రాధాన్యం స్పష్టీకరణ

దర్శకత్వ ప్రతిభకు నిరంతర సాధన.. అనుభవం.. అంతర్జాతీయ సినిమాల పరిచయం అవసరం: ఆర్టూర్‌ జబోర్స్కీ

నాడు పోస్టు చేయడమైనది: 22 NOV 2026 7:43PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2340207Views: 6

   గోవా, 22 నవంబరు 2026: చలనచిత్ర కళను నేర్పగలమా లేక స్వీయాన్వేషణే మార్గమా? ఈ ప్రశ్నే ఇతివృత్తంగా గోవాలో భారత 57వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)లో భాగంగా ఇవాళ బృందగోష్ఠి సాగింది. వివిధ చిత్రాల ప్రదర్శనతో పాటు ‘బోధించలేని చట్రం: సినిమా బోధనీయమా.. స్వీయాన్వేషణే మార్గమా’ శీర్షికతో ఈ చర్చ కొనసాగింది. సృజనాత్మక ప్రతిభ పెంపు, సాంకేతిక నైపుణ్య శిక్షణ సహా పరిశ్రమ అవసరాలకు తగినట్లు ఔత్సాహిక దర్శకులను రూపుదిద్దడంలో ఫిల్మ్ స్కూళ్ల పాత్రను చలనచిత్ర దిగ్గజాలు ఈ సందర్భంగా విశ్లేషించారు.

ఈ బృంద గోష్ఠిలో నటి-‘అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా’ డైరెక్టర్ అమల అక్కినేని, నటుడు-‘యాక్టర్ ప్రిపేర్స్’ వ్యవస్థాపకుడు అనుపమ్ ఖేర్, “సాంస్కృతిక జర్నలిస్ట్-వార్సా ఫిల్మ్ స్కూల్‌లో అంతర్జాతీయ సహకారం వైస్-రెక్టర్, సమ్మర్ ఫిల్మ్ అకాడమీ ప్రోగ్రామ్ డైరెక్టర్, టోఫిఫెస్ట్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ ప్రోగ్రామర్, ‘ఎఫ్‌ఐపీఆర్‌ఈఎస్‌సీఐ’ సభ్యుడు”గా బహుముఖ పాత్రలు పోషిస్తున్న ఆర్టూర్ జబోర్స్కీ, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీటీఐ) మాజీ డైరెక్టర్ భూపేంద్ర కైంతోల, తమిళ, తెలుగు, మలయాళ పరిశ్రమలలో సినిమాటోగ్రాఫర్, మార్గదర్శకుడు, ‘సినిమా ఫ్యాక్టరీ అకాడమీ’ వ్యవస్థాపకుడైన మనోజ్ పరమహంస తదితరులు పాల్గొన్నారు. ‘సోనీ పిక్చర్స్ ఇండియా’, నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎఫ్‌డీసీ)లో సారథ్య బాధ్యతలు నిర్వహించిన విక్రమ్‌జిత్ రాయ్ ఈ గోష్ఠికి సమన్వయకర్తగా వ్యవహరించారు.

ఈ సందర్భంగా అమల అక్కినేని మాట్లాడుతూ- సినిమాల చిత్రీకరణ సహకార స్వభావంతో కూడినదని స్పష్టం చేశారు. విద్యార్థులు సమష్టి కార్యాచరణను అలవరచుకోవడం సహా సినిమా నిర్మాణంలోని వివిధ విభాగాల మధ్య పరస్పర సంబంధాన్ని అర్థం చేసుకోవడంలో ఫిల్మ్ స్కూళ్లు తగిన వాతావరణం కల్పిస్తాయని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత మూస ధోరణులను సవాలు చేయడమే కాకుండా సినిమా నిర్మాణంలో వృత్తిగత శిక్షణ పొందే విధంగా మరింత మంది మహిళలను ప్రోత్సహించాలని సినీ పండితులకు పిలుపునిచ్చారు. నిబద్ధత ప్రాధాన్యాన్ని విశదీకరిస్తూ- వర్ధమాన దర్శకులు మరింత కృషి దిశగా సంసిద్ధతను పెంచుకోవాలని ఆమె సూచించారు.

ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ప్రసంగిస్తూ- ఒక నటుడి సామర్థ్యాన్ని తీర్చిదిద్దడంలో అధికారిక శిక్షణకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని వివరించారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్‌ఎస్‌డీ)లో తన శిక్షణ కాలాన్ని గుర్తు చేసుకుంటూ- “నేను ఎన్‌ఎస్‌డీలో శిక్షణ పొందకపోయి ఉంటే, ఇవాళ ఇక్కడ మీలో ఒకడినయ్యే అవకాశం దక్కి ఉండేది కాదు” అని ఆయన అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అలాగే తన తొలి చిత్రం ‘సారాంశ్‌’ అనుభవాన్ని పంచుకుంటూ- తన వయసు కేవలం 28 ఏళ్లయినా, అందులో 65 ఏళ్ల వృద్ధుడి పాత్రను పోషించానని గుర్తుచేశారు. ఓ యువకుడు అటువంటి సవాలు విసిరే పాత్ర పోషించడంలో ఎన్‌ఎస్‌డీ శిక్షణే దోహదం చేసిందని ఖేర్ స్పష్టం చేశారు. నటుడికి పరిశీలన, ఊహాశక్తి, భావోద్వేగ జ్ఞాపకశక్తి వంటి మూడు కీలక లక్షణాలు అవశ్యమని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తి అనుభవాలు జ్ఞాపకశక్తిలో నిక్షిప్తమై, ఆయా పాత్రలను విశ్వసనీయంగా పోషించగల కీలక వనరుగా మారతాయని ఆయన వివరించారు.

నటన అంటే- నవ రసాలతో కూడిన భావోద్వేగ ప్రకటనతో అనుబంధమేనని ఆయన అభివర్ణించారు. నటుడనే వాడు ఒక సన్నివేశం, దాని క్రమం లేదా కథ అవసరానికి అనుగుణంగా పాత్రలో మమేకమై నవరసాలను సముచిత రీతిలో వ్యక్తీకరించాల్సి ఉంటుందన్నారు. నటులు కావాలనుకునే వారు ఈ భావోద్వేగాలను అర్థం చేసుకుంటూ సాధన చేయడంతో పాటు వాటిని సమర్థంగా పండించడంలో ఫిల్మ్ స్కూళ్లు తోడ్పడతాయని చెప్పారు. యువ నటులు తమ దైనందిన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలంటూ- “ప్రతి అనుభవం మీకు ఏదో ఒకటి నేర్పుతుంది. ఒక మనిషిగా మీరు నేర్చుకున్నది మీ నటనలో మీకు తోడ్పడుతుంది” అని సలహా ఇచ్చారు. అలాగే, యువ నటులు ఆత్మసంతృప్తి భావనకు లోనుకావద్దని, కొన్ని సందర్భాల్లో మన సామర్థ్యమే స్వీయ ప్రతిభా ప్రదర్శనకు అవరోధంగా పరిణమించే ప్రమాదం ఉంటుందని ఖేర్ హెచ్చరించారు. కళాకారులు తమ నైపుణ్యాన్ని, కళను నిరంతరం మెరుగుపరచుకునేందుకు కృషి చేయాలని సూచించారు.

దర్శకత్వ ప్రతిభకు నిరంతర సాధన, అనుభవం, ప్రపంచ సినిమాల పరిచయం అవసరమని ఆర్టూర్ జబోర్స్కీ స్పష్టం చేశారు. యువ దర్శకులకు విభిన్న సినిమా సంప్రదాయాల పరిచయం సహా విభిన్న నేపథ్య చిత్రాలు-నిపుణులతో మమేకమయ్యేలా చేయడంలో చలనచిత్రోత్సవాల పాత్రను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. చిత్రీకరణలో సహజత్వం ఉట్టిపడాలంటే ప్రపంచ సినిమా పరిణామాలను యువ దర్శకులు లోతుగా అర్థం చేసుకోవడం అత్యావశ్యకమని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా వార్సా ఫిల్మ్ స్కూల్‌లో తాము అనుసరించే విధానాన్ని వివరిస్తూ- “ప్రయోగాలు చేయడానికి, తప్పుల నుంచి నేర్చుకోవడానికి వీలు కల్పించే సహాయక సంస్థాగత వాతావరణంలో సినిమాలు తీయడానికి విద్యార్థులను ప్రోత్సహిస్తాం.  వృత్తిగత సినిమా సెట్లలో పొరపాట్లు చేస్తే, గణనీయ ఆర్థిక-ఆచరణాత్మక పరిణామాలుంటాయి. కాబట్టి, ఇటువంటి అవకాశాలు ఎంతో ముఖ్యమైనవి” అని జబోర్స్కీ చెప్పారు. అలాగే, సినిమాలు తీసే నిర్మాతలకు ప్రాజెక్టుల గురించి వివరించడం, నిధుల సమీకరణ, వృత్తిగత వ్యవస్థపై అవగాహన వంటి వ్యాపారపరమైన అంశాల్లోనూ విద్యార్థులను సంసిద్ధం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో చలనచిత్రోత్సవాలకు హాజరు కావడం అంతర్భాగమని చెప్పారు.

ఐరోపా చిత్రోత్సవాలకు ఎలాంటి చిత్రాలను ఎంపిక చేస్తారనే అంశంపై మాట్లాడుతూ-  యువ దర్శకులు తమను కలవరపరిచే అంశాలను లేదా తాము నిరాకరించడానికి మొహమాటపడే సమస్యలను అర్థం చేసుకోవాలని సూచించారు. కీలక సామాజిక, మానవ సంబంధ అంశాలతో అర్థవంతంగా ముడిపడిన చిత్రాలకు ఈ ఉత్సవాలు ఎంతో విలువనిస్తాయని ఆయన పేర్కొన్నారు.

కళాత్మక వ్యక్తీకరణకు, సంస్థాగత శిక్షణకు మధ్య గల సంబంధాన్ని భూపేంద్ర కైంతోలా ప్రముఖంగా ప్రస్తావించారు. “కళను మీరు శోధించవచ్చు.. కానీ నైపుణ్యాన్ని మాత్రం నేర్పించాలి” అని ఆయన అన్నారు. చిత్రరంగ వృత్తి నిపుణులు కావాలనుకునే వారికి అధికారిక విద్య ఎంతో విలువైనదని ఆయన చెప్పారు.

దర్శకత్వంలో విజయం సాధించాలంటే క్రమశిక్షణ సహిత సృజనాత్మకత, నిరంతర అభ్యాసం, వృత్తిగత పద్ధతుల అనుసరణ అవశ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అటుపైన ‘ఎఫ్‌టీటీఐ’లో తన అనుభవాన్ని ఉటంకిస్తూ- కుటుంబాలలో వృత్తిపై అంచనాలు సంప్రదాయకమైనప్పటికీ చాలామంది విద్యార్థులు ఈ విద్యను ఎంచుకుంటుంటారని కైంతోలా పేర్కొన్నారు. వారి సృజనాత్మక ఆకాంక్షలకు రెక్కలు తొడిగేందుకు తగిన వాతావరణ కల్పన బాధ్యత ప్రభుత్వ నిధులతో నడిచే ‘ఎఫ్‌టీటీఐ’ వంటి సంస్థలకు ఉందని ఆయన స్పష్టం చేశారు.

అనేక ఆచరణాత్మక పరిమితుల మధ్య వృత్తిపరమైన చిత్ర నిర్మాణ సెట్లలో పని సాగుతూంటుందని మనోజ్ పరమహంస చెప్పారు. అందువల్ల, నవతరం ప్రయోగాలు చేయడానికి, ప్రయత్న దోషాల నుంచి నేర్చుకోవడానికి అవకాశాలు పరిమితంగానే ఉంటాయని తెలిపారు. అందువల్ల, క్రమబద్ధ వాతావరణంలో చిత్ర నిర్మాణ ప్రాథమికాంశాల బోధన ద్వారా ఫిల్మ్ స్కూళ్లు కీలక పునాది వేస్తాయన్నారు. సాంకేతిక నైపుణ్యానికి అతీతంగా మానవ వనరుల నిర్వహణ, బృందాల మధ్య సమన్వయం,  సమష్టిగా పనిచేయడం వంటి నైపుణ్యం దిశగానూ విద్యార్థులను సన్నద్ధం చేస్తాయన్నారు. ఒక సినిమా ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయాలంటే ఇలాంటివన్నీ ఎంతో కీలకమని ఆయన వ్యాఖ్యానించారు.

చలనచిత్ర విద్య, సినిమా నిర్మాణంపై కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావం పెరుగుతుండటంపైనా ఈ బృందం చర్చించింది. ఈ సందర్భంగా మనోజ్ పరమహంస మాట్లాడుతూ- పునరావృతమయ్యే పనుల సౌలభ్యంలో భాగంగా ప్రాథమిక స్టోరీబోర్డుల రూపకల్పన, నిర్మాణ కార్యాచరణ మెరుగుదలలో ‘ఏఐ’ని ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. సాంకేతికత పురోగమనం విజువల్ ప్రొడక్షన్‌ను కూడా మార్చేసిందని ఆయన అన్నారు. దీనివల్ల చిత్రీకరణ తర్వాత కూడా నేపథ్యాలను మార్చడానికి, అత్యాధునిక దృశ్య వాతావరణ సృష్టికి వీలు కలుగుతోందని పేర్కొన్నారు.

సాంకేతిక ప్రగతికి అనుగుణంగా మారాల్సిన అవసరాన్ని అంగీకరిస్తూనే, సృజనాత్మక వ్యక్తీకరణకు మానవ భావోద్వేగాలే కేంద్రకమని అనుపమ్ ఖేర్ స్పష్టం చేశారు. ఏఐ సృష్టించిన ‘వర్చువల్ అవతార్‌’ ప్రక్రియను ప్రస్తావిస్తూ- చిత్రాలను, ప్రదర్శనలను సాంకేతికత సృష్టించగలిగినా, నటనలో ఆత్మ సాక్షాత్కారాన్ని, మానవ హృదయాన్ని అది పునఃసృష్టించలేదని ఆయన వివరించారు.

సంస్థాగత శిక్షణ, ఆచరణాత్మక అనుభవం, ప్రయోగాల సమ్మేళనంతో సృజనాత్మక ప్రతిభను పెంచడంలో ఫిల్మ్ స్కూళ్ల ప్రాముఖ్యాన్ని ఈ బృంద గోష్ఠి విశదీకరించింది. అలాగే, వర్ధమాన దర్శకులు పరిస్థితులకు అనుగుణంగా మారాలని, సాంకేతికంగా అవగాహన పెంచుకోవాలని, నిరంతర అభ్యసనం సహా పునరావిష్కరణపై నిబద్ధత కలిగి ఉండాలని కూడా స్పష్టం చేసింది.

గోవాలో ఈ నెల 20న ప్రారంభమైన భారత 57వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 28వ  తేదీ వరకూ జాతీయ, ప్రపంచవ్యాప్త దర్శకులు, పరిశ్రమ నిపుణులు, సినిమా ప్రియులను ఒకే వేదికపైకి తెస్తోంది. వివిధ చిత్ర ప్రదర్శనలు, మాస్టర్‌క్లాస్‌లు, పరస్పర చర్చల ద్వారా ఆదానప్రదానం, అభ్యాసం, సహకారానికి ఈ ఉత్సవం వీలు కల్పిస్తుంది.

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2340207
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026