57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

పులుల్లా గర్జించగలిగేది కేవలం అబ్బాయిలు మాత్రమేనని ఎవరు చెప్పారు? సంప్రదాయ పులివేషం నృత్యంలోని లింగ వివక్ష అడ్డంకులను సవాలు చేసే ఒక యువతి కథను ఆవిష్కరిస్తోన్న ‘బాఘుని’


ధైర్యం, సాంస్కృతిక గుర్తింపు, తన కలలను సాకారం చేసుకునే స్వేచ్ఛను తెలియజేస్తోన్న ఒడియా చిత్రం

నాడు పోస్టు చేయడమైనది: 22 NOV 2026 6:10PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2340197Views: 5

గోవా, 2026 నవంబర్ 21: కొన్ని సంప్రదాయాలు కేవలం గుడ్డిగా అనుసరించడానికి మాత్రమే కాదు వాటితో మమేకమై నాట్యం చేయడానికి కూడా ఉన్నాయని ఒక చిన్నారి భావిస్తే ఎలా ఉంటుంది? పులి చారలను సంప్రదాయబద్ధంగా పురుషుల శరీరాలపై మాత్రమే చిత్రించే ప్రపంచంలోకి అడుగుపెట్టే ధైర్యం చేసి ‘నేనెందుకు చేయకూడదు?’ అని ఆ బాలిక ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది?

ఇది ఒడిశాలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలిక మిని కథ. ఆమె ‘బాఘ నాచ’ కళాకారిణి కావాలని కలలు కంటుంది. దీర్ఘకాలంగా పురుషుల ఆధిపత్యం కొనసాగుతున్న సంప్రదాయ పులివేషం నృత్య రూపమైన బాఘ నాచను.. తనదైన శైలిలో స్వీకరించాలని మిని ఆకాంక్షిస్తోంది. ఆమె దృష్టిలో ఈ ఆకాంక్ష కేవలం ఒక నృత్యాన్ని ప్రదర్శించడం మాత్రమే కాదు కలలు కనే స్వేచ్ఛ, సంప్రదాయ కట్టుబాట్లను సవాలు చేయడం, తన అభిరుచిని కొనసాగించడమే.

వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్రహీత, నిర్మాత జితేంద్ర మిశ్రా రచించి దర్శకత్వం వహించారు. ‘బాఘుని’ (బాఘుని- డ్యాన్స్ లైక్ ఏ టైగర్) చిత్రం.. లోతుగా పాతుకుపోయిన లింగ వివక్ష మూసధోరణులను సవాలు చేయాలనే ఒక బాలిక దృఢ సంకల్పాన్ని ఆవిష్కరిస్తోంది. ఒడిశాలోని చైతన్యవంతమైన జానపద సంప్రదాయాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం లింగ వివక్ష అడ్డంకులు, సామాజిక కట్టుబాట్లు, సాంస్కృతిక గుర్తింపు, స్థిరపడిన నిబంధనలను ప్రశ్నించే ధైర్యాన్ని అన్వేషిస్తుంది. 2026 నవంబర్ 22న గోవాలో జరిగిన 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) వేదికపై ఈ చిత్రం గాలా ప్రీమియర్‌ ప్రదర్శన జరిగింది.

విలేకరుల సమావేశంలో జితేంద్ర మిశ్రా మాట్లాడుతూ.. చలనచిత్ర పరిశ్రమలో దాదాపు రెండు దశాబ్దాల ప్రయాణం తర్వాత తన దర్శకత్వ అరంగేట్రంగా నిలిచిన ‘బాఘుని’ చిత్రాన్ని తనకు వ్యక్తిగతంగా కీలకమైన ఘట్టంగా అభివర్ణించారు. ఇఫీ ఇండియన్ పనోరమాతో తనకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తమకు అందించిన మద్దతుకు గాను ఇఫీ, ఎన్ఎఫ్‌డీసీ, సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ చిత్రం గురించి జితేంద్ర మిశ్రా మాట్లాడుతూ… ‘బాఘ నాచ’ ఈ చిత్రానికి సాంస్కృతిక నేపథ్యాన్ని అందించినప్పటికీ ఈ కథ అంతిమంగా లింగ సమానత్వం, ధైర్యం, మానవ సంకల్ప బలాన్ని చాటిచెబుతుందని పేర్కొన్నారు. తన సొంత కుటుంబంలోని ఏడుగురు అసాధారణ మహిళల నుంచి ప్రేరణ పొందిన ఆయన బాలికలకు సమాన అవకాశాలు కల్పిస్తే అంచనాలకు మించి రాణించగలరని అన్నారు.

ఒడిశాలోని బెర్హంపూర్‌లో చేసిన విస్తృత పరిశోధన ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆడిషన్ల ద్వారా ఎంపికై ప్రముఖ నటుడు సబ్యసాచి మిశ్రాతో కలిసి పలు నెలల పాటు శిక్షణ పొందిన స్థానిక చిన్నారులు నటించారు.

ప్రఖ్యాత ఒడియా నటుడు సబ్యసాచి మిశ్రా ‘బాఘుని’ చిత్రాన్ని ఆకట్టుకునే కథాకథనం, ఒడిశా సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం సమ్మేళనంగా అభివర్ణించారు. సంప్రదాయ పులివేషం నృత్యమైన ‘బాఘ నాచ’ ఆడపులి అనే అర్థం వచ్చే ‘బాఘుని’ మధ్య ఉన్న వైరుధ్యమే ఈ కథనానికి కేంద్రబిందువని.. ఇది చిత్రానికి మరింత లోతును, ఉత్కంఠను తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు.

సంప్రదాయ బాఘ నాచ కళాకారుడి పాత్రను పోషించిన తన అనుభవాన్ని పంచుకున్న సబ్యసాచి.. పాత్రలో సహజత్వం కోసం 30 కిలోల బరువు తగ్గినట్లు, కఠినమైన శారీరక- ఆధ్యాత్మిక సన్నద్ధతను పాటించినట్లు వెల్లడించారు. ఈ జానపద కళతో ముడిపడి ఉన్న కఠినమైన ఆచారాలు, గంటల తరబడి సాగే క్లిష్టమైన శరీర వర్ణచిత్రణ గురించి కూడా ఆయన వివరించారు. ఈ కళలో కళాకారుడిని 'మా భగవతి బుద్ధి ఠాకురాణి' దేవత ప్రతిరూపంగా పూజిస్తారని తెలిపారు. ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ.. ప్రాంతీయ ఒడియా సినిమాకు ‘బాఘుని’ ఒక కొత్త ప్రమాణాన్ని నిర్దేశించే సామర్థ్యాన్ని కలిగి ఉందని ఆయన అన్నారు. ఈ చిత్ర సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువ చేయాలని మీడియాను ఆయన కోరారు.

‘బాఘుని’ చిత్రానికి గాలా ప్రీమియర్ గౌరవాన్ని కల్పించి ఒడిశా సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయ ప్రేక్షకులకు పరిచయం చేసే వేదికను అందించినందుకు ఇఫీ, ఎన్ఎఫ్‌డీసీ, భారత ప్రభుత్వానికి నిర్మాత పార్థ పండా కృతజ్ఞతలు తెలిపారు.

మిని ప్రయాణం ద్వారా ‘బాఘుని’ చిత్రం లోతుగా పాతుకుపోయిన ఒక స్థానిక సంప్రదాయాన్ని ధైర్యం, గుర్తింపు, సంప్రదాయ కట్టుబాట్లను సవాలు చేసే స్వేచ్ఛ గురించిన మరింత విస్తృత, అంతర్జాతీయ చర్చలోకి తీసుకువస్తోంది. ఇదే స్ఫూర్తితో ఈ చిత్రం ఇఫీ 2026 ఇతివృత్తమైన 'విశ్వజనీయ కథల'తో మమేకమవుతూ స్థానిక గొంతుకలను ప్రపంచ ప్రేక్షకులకు సినిమా ఎలా చేరువ చేయగలదో, ప్రపంచంలోని ఒక మూలన పుట్టిన కథలను మరో ప్రాంతానికి అర్థవంతంగా ఎలా అందించగలదో పునరుద్ఘాటిస్తోంది.

ఈ విలేకరుల సమావేశానికి శ్రీమతి నిఖిత ఏఎస్ సమన్వయకర్తగా వ్యవహరించారు.

ఇఫీలోయిడ్ ఇక్కడ చదవండి: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2340197
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026