57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) సందర్భంగా గోవాలోని పనాజీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కన్నడ చలనచిత్రం ‘రూబీ - క్యూబ్’ బృందం మీడియాతో ముచ్చటించింది. ప్రముఖ చిత్ర దర్శకుడు, ఈ సినిమా దర్శకుడు పి. శేషాద్రి, ప్రధాన పాత్రధారి వైనిధి జగదీశ్ ఈ సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలను పంచుకున్నారు.
దర్శకుడు పి. శేషాద్రి తన చిత్ర నిర్మాణ విధానం గురించి వివరిస్తూ, తాను కథల కోసం ప్రత్యేకంగా అన్వేషించనని, కథలే తన వద్దకు వస్తాయని తెలిపారు. ఏదైనా కథ తనను నిజంగా ఆకట్టుకుని, దాన్ని తెరపై ఆవిష్కరించాలనే ప్రేరణ కలిగించినప్పుడే సినిమాగా రూపొందిస్తానని చెప్పారు. ‘రూబీ - క్యూబ్’ తన 13వ చిత్రమని పేర్కొన్న ఆయన, ఈ కథ వాస్తవ జీవిత అనుభవాల ఆధారంగా రూపుదిద్దుకుందని తెలిపారు. భారతీయ కుటుంబ వ్యవస్థలోని సంక్లిష్టతలు, అందులో మానవ సంబంధాలు కాలక్రమంలో ఎలా పరిణామం చెందుతాయన్న అంశాలే ఈ కథకు ప్రధాన ఆధారమని వివరించారు.
పాత్రల జీవితాల ద్వారా అనేక మానవీయ సమస్యలు, సవాళ్లను ఈ చిత్రం ఆవిష్కరిస్తుందని దర్శకుడు వివరించారు. జీవితాన్ని రూబిక్స్ క్యూబ్‌తో పోలుస్తూ, ఆ పజిల్‌లో అనేక రంగులు, వాటి విభిన్న కలయికలు ఉన్నట్లే, మానవ జీవితాల్లోనూ భిన్నమైన కోణాలు, పార్శ్వాలు ఉంటాయని పేర్కొన్నారు. తన సినిమాలు తప్పనిసరిగా ఏదో ఒక నిర్దిష్ట సందేశాన్ని అందించాలనే ఉద్దేశంతో రూపొందించినవి కావని, ప్రేక్షకులతో భావోద్వేగ అనుబంధాన్ని ఏర్పరచడమే వాటి లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సినిమాలు విస్తృత స్థాయి ప్రేక్షకులకు చేరువ కావడానికి, మరింత గుర్తింపు పొందడానికి, సినీ ప్రేమికుల నుంచి అర్థవంతమైన స్పందనలను అందుకోవడానికి ఐఎఫ్ఎఫ్ఐ ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తోందని ఆయన అన్నారు.
ప్రధాన నటి వైనిధి జగదీశ్ తన పాత్రలోని భావోద్వేగ కోణాలు, చిత్రంలోని ప్రధాన ఇతివృత్తం గురించి వివరించారు. తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చిన ఒక కుమార్తె క్రమంగా తన తల్లిదండ్రుల మధ్య ఉన్న సంబంధాల తీరుతెన్నులను గమనించే నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలిపారు. మారుతున్న సంబంధాలు, అంచనాలు, భావోద్వేగపరమైన సవాళ్ల మధ్య వ్యక్తులు తమదైన జీవితాలను ఎలా సాగిస్తున్నారో ఈ చిత్రం ప్రతిబింబిస్తుందని, సమకాలీన కుటుంబాల్లోని వాస్తవ పరిస్థితులను ఆవిష్కరిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఇందులో కథనం ఎంతో సున్నితంగా, సంయమనంతో సాగుతుందని చెప్పారు. నాటకీయమైన సన్నివేశాల కంటే, నిత్యజీవితంలో మనుషులు ఎదుర్కొనే సహజమైన అనుభవాలకే ఈ చిత్రం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.
కొండ ప్రాంతంలోని ఒక పర్యాటక కేంద్రంలో కుటుంబం కొద్దిరోజుల విహారయాత్రకు వెళ్లిన నేపథ్యంలో ‘రూబీ - క్యూబ్’ కథ సాగుతుంది. ఈ ప్రయాణంలో ఒకే ఇంటి కింద మూడు తరాల కుటుంబ సభ్యులు కలుసుకుంటారు. మనస్తత్వ శాస్త్రవేత్త రోహిణి, ఆమె మాజీ భర్త మూర్తి చుట్టూ కథనం సాగుతుంది. తన వైవాహిక జీవితంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకునే క్రమంలో వారి కుమార్తె చిత్ర, తల్లిదండ్రులిద్దరినీ ఒకచోటికి తీసుకువస్తుంది. కుటుంబ సభ్యులంతా కలిసి కొంత సమయం గడుపుతున్న కొద్దీ, గతంలో పరిష్కారం కాని భావోద్వేగాలు, పాత సంబంధాలు, బాధ్యతలకు సంబంధించిన ప్రశ్నలు క్రమంగా తెరపైకి వస్తాయి.
ఐఎఫ్ఎఫ్ఐ - 2026లో నిర్వహించిన ఈ ముఖాముఖి కార్యక్రమం ద్వారా ‘రూబీ- క్యూబ్’ చిత్రం వెనుక ఉన్న సృజనాత్మక దృక్పథం, సమకాలీన కుటుంబ సంబంధాలపై అది సాగించిన విశ్లేషణ గురించి ప్రేక్షకులకు, మీడియా ప్రతినిధులకు అవగాహన కలిగింది. ఈ చలనచిత్రోత్సవంలో ఈ చిత్రం ప్రదర్శనకు ఎంపిక కావడం ద్వారా, దేశాల సరిహద్దులకు అతీతంగా విభిన్న సినీ గొంతుకలు, కథన సంప్రదాయాలను వేడుకగా జరుపుకుంటున్న ఐఎఫ్ఎఫ్ఐ ప్రత్యేకత మరింత ఇనుమడించింది.
ఈ సమావేశానికి శ్రీ అనిమేష్ వాజే సమన్వయకర్తగా వ్యవహరించారు.
Watch the full press conference here:
Read IFFILOID here: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48
* * *