సినిమా భౌగోళిక, సాంస్కృతిక హద్దులను అధిగమించి.. మానవ భావోద్వేగాలనే విశ్వభాష ద్వారా ప్రజలను అనుసంధానిస్తుందని ప్రముఖ నటి కార్లా సోఫియా గాస్కోన్ అన్నారు. గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫి)లో భాగంగా నేడు ‘స్టేజెస్ అక్రాస్ బోర్డర్స్’ పేరుతో నిర్వహించిన ప్రత్యేక మాస్టర్‌క్లాస్‌లో ఆమె ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అభిరుచి, అంకితభావం ప్రాధాన్యతను వివరిస్తూ.. వర్ధమాన నటులు తమపై తాము నమ్మకం ఉంచాలని, తమ ప్రత్యేకతను కాపాడుకోవాలని, నటన పట్ల నిబద్ధతతో ఉండాలని గాస్కోన్ సూచించారు. తమ వృత్తిని నిజంగా ప్రేమించినప్పుడే సహజమైన నటనను ప్రదర్శించగలమని ఆమె పేర్కొన్నారు.
తన నటనా విధానం గురించి వివరిస్తూ.. ప్రతి పాత్రలోనూ పూర్తిగా లీనమవుతానని, లోతైన భావోద్వేగ అనుభూతుల ద్వారా తెరపై సహజత్వాన్ని తీసుకొస్తానని చెప్పారు. సంప్రదాయానికి భిన్నమైన, సవాళ్లతో కూడిన పాత్రల్లో నటించేందుకు తాను ఇష్టపడతానని తెలిపారు. తమ అనుభవాలకు పూర్తిగా భిన్నమైన పాత్రలను పోషించడం ద్వారా కొత్త సృజనాత్మక ఆలోచనలు, కళాత్మక ఎదుగుదల, ఆత్మపరిశీలనకు అవకాశం లభిస్తుందని వివరించారు.
నటన అనేది నిరంతరం సవాళ్లు, కొత్త అనుభవాలతో కూడిన ప్రయాణమని గాస్కోన్ అన్నారు. ప్రతి పాత్రను కొత్త కోణంలో అర్థం చేసుకుని, విభిన్నమైన నటనా విధానాన్ని అనుసరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. భౌగోళిక ప్రాంతాలు, సాంస్కృతిక నేపథ్యాలతో సంబంధం లేకుండా.. అందరిలోనూ ఉండే ఉమ్మడి మానవ భావోద్వేగాల ద్వారా ప్రేక్షకులను ఏకం చేసే ప్రపంచ భాషే సినిమా అని అభివర్ణించారు.
సినిమా నిర్మాణం అనేది సమష్టి కృషితో కూడుకున్న ప్రక్రియ అని పేర్కొంటూ.. సృజనాత్మక బృందంలోని ప్రతి ఒక్కరి పాత్రను ఆమె ప్రశంసించారు. చిత్ర రూపకల్పనలో దర్శకులు, ఇతర సాంకేతిక, సృజనాత్మక బృంద సభ్యుల సమష్టి ఆలోచనలు, కృషి కీలకమని వివరించారు.
ఈ మాస్టర్‌క్లాస్ ద్వారా వర్ధమాన నటులు, చిత్రనిర్మాతలు, సినీ ప్రేమికులకు సృజనాత్మక ప్రక్రియ, నటనలోని సూక్ష్మాంశాలు, సినిమా నిర్మాణంలో సమష్టి కృషి ప్రాధాన్యంపై విలువైన అవగాహన లభించింది.
ఇఫిలోయిడ్ గురించి ఇక్కడ చూడండి: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48
***