మీడియా, వినోద రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్, స్పెయిన్ దేశాలు కొత్త అవకాశాలను అన్వేషిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న దృశ్య-శ్రవణ సహ-నిర్మాణ ఒప్పందాన్ని నవీకరించడం, 'వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్' (వేవ్స్) వేదికగా భాగస్వామ్యాన్ని విస్తరించడం ప్రధానాంశాలుగా ఈ చర్చలు సాగుతున్నాయి. 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ)లో స్పెయిన్ 'గౌరవ దేశం'గా పాల్గొంటున్న సందర్భంగా ఈ కీలక భేటీ నిర్వహిస్తున్నారు.
గోవాలో జరిగిన ఈ సమావేశంలో స్పెయిన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని స్పానిష్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సినిమాటోగ్రఫీ అండ్ ఆడియోవిజువల్ ఆర్ట్స్ (ఐసీఏఏ) డైరెక్టర్ జనరల్ ఎంఎస్. మార్టా సెరానో నేతృత్వంలోని స్పెయిన్ ప్రతినిధి బృందంతో... భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ప్రసార విభాగం) సంయుక్త కార్యదర్శి శ్రీ పృథుల్ కుమార్, మంత్రిత్వ శాఖ అధికారులు, ఇండియా సినీ హబ్ ప్రతినిధులు భేటీ అయ్యారు.
చలనచిత్ర, దృశ్య-శ్రవణ నిర్మాణ రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అవకాశాలపై ప్రధానంగా ఈ చర్చలు సాగాయి. ఇరు దేశాల సృజనాత్మక రంగాల మధ్య మరింత మెరుగైన సహకారానికి వీలు కల్పించేలా, సహ-నిర్మాణ విధానాన్ని నవీకరించడం వంటి కీలక అంశాలు ఇందులో ప్రస్తావనకు వచ్చాయి.
ప్రస్తుతం అమల్లో ఉన్న భారత్–స్పెయిన్ దృశ్య-శ్రవణ సహ-నిర్మాణ ఒప్పందం 2012లో కుదిరింది. చలనచిత్ర, ఆడియోవిజువల్ నిర్మాణ రంగాల్లో ద్వైపాక్షిక సహకార విధానాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ ఒప్పందాన్ని నవీకరించడంపై చర్చలు జరుగుతున్నాయి. స్పెయిన్ ప్రతిపాదించిన నూతన విధానం ప్రకారం.. కల్పిత కథా చిత్రాలు, యానిమేషన్, డాక్యుమెంటరీ ప్రాజెక్టులతో పాటు టెలివిజన్ సిరీస్‌లు, చలనచిత్రాల నిర్మాణంలో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం కొనసాగుతుంది.
ఐఎఫ్ఎఫ్ఐ-2026లో స్పెయిన్ 'గౌరవ దేశం'గా పాల్గొనడం వల్ల సమకాలీన స్పానిష్ సినిమాలను ప్రదర్శించేందుకు... భారతీయ, స్పానిష్ చిత్ర పరిశ్రమల నిపుణుల మధ్య వృత్తిపరమైన సంబంధాలను మరింత పెంపొందించుకునేందుకు చక్కటి అవకాశం లభిస్తోంది. ఈ చలనచిత్రోత్సవం గోవా వేదికగా ఈ నెల 20 నుంచి 28 వరకు జరుగుతోంది.
ఈ నెల 20 నుంచి 24 వరకు పనాజీలో జరుగుతున్న 20వ 'వేవ్స్ ఫిల్మ్ బజార్'... ఇరు దేశాల దృశ్య-శ్రవణ పరిశ్రమల మధ్య పరస్పర చర్చలకు మరో చక్కటి వేదికగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 22న ప్రత్యేకంగా 'స్పానిష్ డే'ను నిర్వహిస్తున్నారు. దీని ద్వారా పరిశ్రమ నిపుణులతో ప్రత్యేక చర్చతో పాటు... ఇరు దేశాల సినీరంగ నిపుణులు పరస్పరం అభిప్రాయాలు పంచుకునేందుకు తగిన అవకాశం లభిస్తుంది.
చలనచిత్ర, దృశ్య-శ్రవణ రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు... సహ-నిర్మాణం, సృజనాత్మక భాగస్వామ్యం, నిపుణులు పరస్పరం ఆలోచనలను పంచుకోవడానికి విస్తృత అవకాశాలను కల్పించడం పట్ల భారత్, స్పెయిన్ దేశాల ఉమ్మడి నిబద్ధతను ఈ చర్చలు స్పష్టం చేస్తున్నాయి.
ఇఫిలాయిడ్’ (ఐఎఫ్ఎఫ్ఐఎల్‌వోఐడీ) సంచికను ఇక్కడ చదవండి:
https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48